ఆపరేషన్‌ సిందూర్ సమయంలో పాక్‌కు మద్దతుగా నిలిచిన తుర్కియేపై భారత్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ ఎర్డోగాన్-షరీఫ్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచిన తుర్కియే చర్యలపై భారత్‌లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. దీనికి ప్రతిగా దేశవ్యాప్తంగా ‘బాయ్‌కాట్ తుర్కియే’ అనే నినాదాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్య జరిగిన తాజా భేటీ నూతన చర్చలకు తావిస్తోంది.

ఈ ఇద్దరూ ఆదివారం రాత్రి ఇస్తాంబుల్ నగరంలో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం షెహబాజ్ షరీఫ్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఎర్డోగాన్‌ను తన ‘ప్రియ సోదరుడు’గా అభివర్ణించారు. భారత్‌తో ఉద్రిక్తతల సమయంలో తుర్కియే మద్దతుగా నిలిచిందని పేర్కొంటూ, ఆ దేశానికి కృతజ్ఞతలు తెలిపారు. వాణిజ్య , పెట్టుబడి రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచే దిశగా ఇరు దేశాలు చర్చించాయని చెప్పారు. ఈ బంధం ఇకపై మరింత బలపడాలని ఆకాంక్షించారు. షెహబాజ్‌తో పాటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు.

ఈ సమావేశంపై ఎర్డోగాన్ స్పందిస్తూ, తుర్కియే-పాక్‌ మైత్రి ఎంతో బలంగా కొనసాగుతోందని, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మరింత సహకారానికి కృషి చేస్తామని చెప్పారు. ఆసక్తికరంగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ ఇద్దరు నేతలు ముఖాముఖి భేటీ కావడం ఇదే తొలిసారి.

పహల్గాం ఉగ్రదాడి అనంతరం ప్రపంచం మొత్తం ఉగ్రవాదాన్ని ఖండిస్తున్న సమయంలో, పాకిస్తాన్‌కు తుర్కియే మద్దతుగా నిలవడం చర్చనీయాంశమైంది. ఎర్డోగాన్ ఈ దాడిని ఖండించడమే కాకుండా, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపేందుకు కూడా ఆసక్తి చూపలేదు.

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ వాడిన డ్రోన్లలో అనేకం తుర్కియేకు చెందినవిగా గుర్తించారు. ముఖ్యంగా ‘అసిస్ గార్డ్ సోనగర్’ కంపెనీ తయారుచేసిన డ్రోన్లు వినియోగించినట్లు సమాచారం. అంతేకాక, తుర్కియే సైనిక సిబ్బంది కూడా పాక్‌కు మద్దతుగా ఉండటం పై వార్తలు వెలుగులోకి వచ్చాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌లో తుర్కియే ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. సోషల్ మీడియాలో ‘బాయ్‌కాట్ తుర్కియే’ ట్రెండ్ అవుతూ నిరసనల స్వరం మిన్నంటుతోంది. ఇలాంటి సమయంలో ఎర్డోగాన్-షరీఫ్ భేటీ ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకోవడం గమనార్హం.