సౌదీ అరేబియా పర్యటనలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఏ దేశాధినేతకు దక్కని గౌరవం మన ప్రధానికి లభించింది. సౌదీ గగనతలంలోకి మోదీ ప్రయాణించే విమానం ప్రవేశించగానే అరుదైన ఘటన చోటుచేసుకుంది. 

Narendra Modi Saudi Arabia Visit: భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం సౌదీ అరేబియా చేరుకున్నారు. జెడ్డా నగరానికి చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. మోదీ ప్రయాణిస్తున్న 'ఎయిర్ ఇండియా వన్' విమానం సౌదీ ఎయిర్‌స్పేస్‌లోకి ప్రవేశించగానే ఆ దేశ వైమానిక దళానికి చెందిన రాయల్ ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్ చేశాయి. ఇలాంటి గౌరవం చాలా తక్కువమందికి దక్కింది... అందులో మోదీ ఒకరు. 

గత దశాబ్దంలో ప్రధాని మోదీ మూడోసారి సౌదీ పర్యటన చేపడుతున్నారు. అయితే జెడ్డా నగరానికి మాత్రం మొదటిసారి వెళ్ళారు. ప్రస్తుతం హజ్ యాత్ర సందర్భంగా సౌదీ రాజకుటుంబం రియాద్ నుండి జెడ్డాకు తరలివచ్చింది. దీంతో మోదీ కూడా జెడ్డాకు వెళ్లాల్సివచ్చింది.

ఈ సందర్భంగా మోదీ సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ కానున్నారు. ఇరువురు నాయకులు రెండో స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. ఆర్థిక, రక్షణ, మీడియా, వినోదం, ఆరోగ్యం, పర్యాటక రంగాలపై చర్చలు జరగనున్నాయి. ఇరువురి మధ్య జరిగే ప్రత్యేక సమావేశంలో ఇంధన భద్రత, గ్రీన్ హైడ్రోజన్, స్మార్ట్ సిటీ పెట్టుబడులు, డిజిటల్ మౌలిక సదుపాయాలపై చర్చించే అవకాశం ఉంది.

Scroll to load tweet…

ఆరోగ్యం, పర్యాటకం వంటి రంగాల్లో ఒప్పందాలు

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, మోదీ జెడ్డా పర్యటనలో భారత్, సౌదీ అరేబియా కనీసం ఆరు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి. అంతరిక్షం, ఇంధనం, ఆరోగ్యం, సైన్స్, సంస్కృతి, అధునాతన సాంకేతిక రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.