భారత ప్రధాని నరేంద్ర మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం లభించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసినందుకు ఈ పురస్కారం లభించింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటన చేపడుతున్నారు. వివిధ దేశాల పర్యటనలో భాగంగా ఆయన సైప్రస్ లో పర్యటిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తమ దేశాన్ని పర్యటిస్తున్న భారత ప్రదానికి సైప్రస్ అద్భుత స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III' తో ప్రధాని మోదీని సత్కరించింది.
భారత్, సైప్రస్ ల మధ్య వ్యూహాత్మక, దౌత్య సంబంధాలను బలోపేతం చేసేందుకు మోదీ కృషిచేస్తున్నారు. అందుకోసమే ఆయన చాలాకాలం తర్వాత ఆ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందజేశారు. అంతర్జాతీయ దౌత్యంలో మోదీకి లభించిన అంతర్జాతీయ పురస్కారాల్లో ఇది ఒకటి.
సైప్రస్ పురస్కారాన్ని అందుకున్న మోదీ… "భవిష్యత్తులో మన సహకారం మరింత ఎత్తులకు చేరుకుంటుందని నమ్ముతున్నా. రెండు దేశాల అభివృద్ధిని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచ శాంతి, భద్రతకు కృషి చేస్తాం" అని అన్నారు. వ్యాపారం, సాంకేతికత, సాంస్కృతిక మార్పిడి వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించడంలో మోదీ నాయకత్వాన్ని సైప్రస్ ప్రభుత్వం ప్రశంసించింది.
మోదీ సైప్రస్ పర్యటన
భారత ప్రధాని మోదీ తొలిసారి సైప్రస్ పర్యటన చేపడుతున్నారు… ఆదివారం (స్థానిక కాలమానం ప్రకారం) మధ్యాహ్నం ఆయన ఆ దేశానికి చేరుకున్నారు. లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ స్వయంగా విచ్చేసి మోదీకి ఘన స్వాగతం పలికారు.
సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. జూన్ 15 నుంచి 16 వరకు జరిగిన సైప్రస్ లో ఉంటారు. ఈ పర్యటనలో మధ్యధరా ప్రాంతంలో కీలక భాగస్వాములతో భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తారు.
మోదీ, అధ్యక్షుడు క్రిస్టోడౌలైడ్స్ ఇరు దేశాల అగ్ర వ్యాపారవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గత దశాబ్ద కాలంలో భారతదేశం సాధించిన పురోగతిని మోదీ వివరించారు. భారత్, సైప్రస్ ల మధ్య బలమైన వాణిజ్య సంబంధాలను ప్రోత్సహించారు.
ఈ మీటింగ్ గురించి మోదీ ఎక్స్ ద్వారా స్పందించారు. "వ్యాపార సంబంధాలను పెంపొందిస్తున్నాం! భారత్, సైప్రస్ ల మధ్య వాణిజ్య సంబంధాలను పెంపొందించడానికి అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ నేను అగ్ర కంపనీల CEOలతో సంప్రదింపులు జరిపాం. ఆవిష్కరణ, సాంకేతికత వంటి రంగాలు అపార అవకాశాలను అందిస్తున్నాయి. గత దశాబ్దంలో భారతదేశ సంస్కరణల గురించి కూడా చర్చించాం” అని తెలిపారు.
సైప్రస్ ప్రెసిడెన్సీ కూడా Xలో పోస్ట్ చేస్తూ.. "మేం మరిన్ని వారధులు నిర్మిస్తున్నాం. సైప్రస్, భారత్ ల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంచుతున్నాం. విశ్వాసం, ఉమ్మడి విలువలతో కూడిన కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యంలోకి అడుగుపెడుతున్నాం. ఆవిష్కరణతో నడిచే గొప్ప చరిత్ర, భవిష్యత్తుతో ప్రేరణ పొందిన భాగస్వామ్యం ఇది" అని పేర్కొంది.
భారత్ నుంచి బయలుదేరే ముందు మోదీ ఒక ప్రకటనలో.. యూరోపియన్ యూనియన్, మధ్యధరా ప్రాంతంలో సైప్రస్ భారత్‌కు సన్నిహిత మిత్రదేశం, ముఖ్య భాగస్వామి అని అన్నారు. "ఈ పర్యటన మన చారిత్రక సంబంధాలను, వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత, సాంకేతికత వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించడానికి ఒక అవకాశం" అని ఆయన అన్నారు.
భారత్-సైప్రస్ సంబంధాలు
1962 నుంచి భారత్, సైప్రస్ ల మధ్య స్నేహపూర్వక దౌత్య సంబంధాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ విషయంతో సహా కీలక అంతర్జాతీయ అంశాల్లో భారతదేశ వైఖరికి సైప్రస్ ఐక్యరాజ్యసమితి వంటి వేదికలపై నిరంతరం మద్దతు ఇచ్చింది.
సైప్రస్‌లోని భారతీయ సంతతి ప్రజలతో ప్రధాని మోదీ కలిసి సంభాషించారు. సంఖ్యాపరంగా చిన్నదే అయినా విద్య, వైద్యం, వ్యాపార రంగాల్లో భారతీయ సమాజం కీలక పాత్ర పోషిస్తోంది.
