భారత్ పై పాక్ అణుబాంబులతో దాడికి రెడీగా ఉందని రష్యాలోని పాక్ రాయబారి ముహమ్మద్ ఖాలిద్ జమాలి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇరుదేశాల మధ్య ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతల వేళ పాక్ రాయబారి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
India Pakistan War Tension : భారతదేశంపై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పి హింసకు పాల్పడటమే కాకుండా ఇప్పుడు అణ్యాయుధాలతో దాడి చేస్తామంటూ బహిరంగంగానే బెదిరిస్తోంది పాకిస్థాన్. ఇటీవల పాకిస్థాన్ మంత్రి హనీఫ్ అబ్బాసి భారత్ పై వేయడానికి పాక్ వద్ద 130 అణుబాంబులు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు రష్యాలోని పాకిస్థాన్ రాయబారి ముహమ్మద్ ఖాలిద్ జమాలి ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. పాక్ పై భారత్ దాడిచేస్తే చూస్తూ ఊరుకోమని... అణ్వాయుధాలతో ప్రతిదాడి చేస్తామని అతడు హెచ్చరించాడు.
నిన్న(శనివారం) రష్యా రాజధాని మాస్కోలో రష్యన్ మీడియాలో పాకిస్థాన్ అగ్ర దౌత్యవేత్త ముహమ్మద్ ఖాలిద్ జమాలీ మాట్లాడారు. పాకిస్థాన్ భూభాగంపై భారతదేశం సైనిక దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తమకు విశ్వసనీయ నిఘావర్గాల సమాచారం ఉందని అన్నారు. పాకిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలపై దాడి చేయాలని భారత్ నిర్ణయించిందని... త్వరలోనే ఈ దాడులు జరిగే అవకాశాలున్నాయని జమాలీ పేర్కొన్నారు. ఇదే జరిగితే భారత్ పై అణుబాంబులతో దాడి చేయడానికి సిద్దంగా ఉందంటూ జమాలీ సంచలన వ్యాఖ్యలు చేసారు.
రష్యాలోని పాక్ రాయబారి మాటలను బట్టి పాకిస్థాన్ భారత్ ఎక్కడ దాడిచేస్తుందో అన్న భయంతో ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే ముందుగానే అణ్వాయుధాలంటూ భారత్ ను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ భారత్ మాత్రం చాలా స్పష్టంగా ఉంది... ఎట్టి పరిస్థితుల్లో పహల్గాం ఉగ్రదాడికి కారణమైన పాక్ ను వదిలిపెట్టబోమని అంటోంది. ఇప్పటికే పాక్ సింధజలాలు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నంచేస్తున్న భారత్ ఆ దేశంతో పూర్తిగా వాణిజ్య సంబంధాలు కూడా తెంచుకుంది. ఆ దేశ విమానాలకు భారత గగనతలంలో అనుమతించడంలేదు. ఇలా ఇప్పటికే పాక్ ను దెబ్బతీసేందుకు అన్ని చర్యలు తీసుకున్న భారత్ ప్రత్యక్ష దాడికి కూడా దిగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో పాక్ నాయకులు, అధికారుల భయం ఇది నిజమేనని నమ్మేలా ఉన్నాయి.
పహల్గాం దాడితో పాక్ పై భారత్ ఆంక్షలు :
సింధు నది జలాల పంపిణీ కోసం భారత్, పాక్ దేశాల మధ్య ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో 1960లో ఓ ఒప్పందం కుదిరింది. తాజాగా ఈ సింధు జలాల ఒప్పందాన్ని (IWT) భారతదేశం నిలిపివేసింది. దీంతో పాకిస్థాన్ లో అలజడి రేగింది. ఈ ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేయడాన్ని యుద్ధ చర్యగా జమాలీ అభివర్ణించారు.
"నీటిని స్వాధీనం చేసుకోవడానికి లేదా ఆపడానికి లేదా మళ్లించడానికి చేసే ఏ ప్రయత్నం అయినా పాకిస్థాన్‌పై యుద్ధ చర్యగానే పరిగణిస్తాం. ఇలాంటి చర్యలను తిప్పికొట్టేందుకు పూర్తి స్థాయి శక్తితో ప్రతిస్పందిస్తాం" అంటూ జమాలీ హెచ్చరించారు.
పాకిస్థాన్ క్షిపణి పరీక్ష :
అణు చర్య గురించి చర్చల వేళ పాకిస్థాన్ సైన్యం శనివారం ఉపరితలం నుండి ఉపరితల క్షిపణిని పరీక్షించింది. ఈ ఆయుధం 450 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది మరియు సంప్రదాయ మరియు అణు పేలోడ్‌లను మోసుకెళ్లగలదు. పాకిస్థానీ సైన్యం ఈ క్షిపణి పరీక్ష గురించి ప్రకటించింది.


