ఉత్తర కొరియాలో ప్రభుత్వ నియంత్రణ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. చివ‌రికి ప్ర‌జ‌ల హెయిర్ స్టైల్‌ను కూడా ప్ర‌భుత్వ‌మే నిర్ణ‌యిస్తుంది. అయితే తాజాగా మొబైల్ ఫోన్ల విష‌యంలో అక్క‌డి ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

ఆటో కరెక్ట్ మార్పులు

ఉత్తర కొరియాలో వాడే ఫోన్లలో కొన్ని పదాలు ఆటోమేటిక్‌గా మారుతున్నాయి. ఉదాహరణకి, దక్షిణ కొరియాలో “ఒప్పా” అని పిలిచే పదం – అనుబంధం సూచించే మాట – ఉత్తర కొరియా ఫోన్‌లో టైప్ చేస్తే “కామ్రేడ్”గా మారిపోతుంది. ఇక “సౌత్ కొరియా” అని టైప్ చేస్తే, అది “పప్పెట్ స్టేట్”గా (కీలుబొమ్మ దేశం) ఆటోకరెక్ట్ అవుతుంది.

ప్రతి ఐదు నిమిషాలకు స్క్రీన్‌షాట్

ప్రతి ఐదు నిమిషాలకు ఆటోమేటిక్‌గా స్క్రీన్‌షాట్ తీసేలా టెక్నాల‌జీని ఉప‌యోగిస్తున్నారు. అయితే ఈ ఫొటోలు సేవ్ అయ్యే ఫోల్డర్ వినియోగదారులకు కనిపించదు. అది ప్రభుత్వ అధికారులకే అందుబాటులో ఉంటుంది. ఈ విధానంతో ఫోన్ యూజర్లు ఎలాంటి సమాచారం చూస్తున్నారు, ఏ పదాలు టైప్ చేస్తున్నారు అన్నది ప్రభుత్వానికి తెలిసిపోతుంది.

ఇంటర్నెట్ యాక్సెస్?

ఉత్తర కొరియాలో మొబైల్ ఫోన్లకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు. అంతర్జాతీయ సమాచారానికి ప్రజలు చేరుకోకుండా ఉండేందుకు, బాహ్య ప్రపంచంతో సంబంధం కలగకుండా ఉండేందుకు ఇలా చేస్తారు. ఫోన్‌లో ఉండే అన్ని యాప్‌లు, సెట్టింగ్స్ ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి. ఇది డిజిటల్ ప్రపంచం నుంచి అక్కడి ప్రజలను పూర్తిగా వేరుచేస్తోంది.

ట్యాంపర్‌ప్రూఫ్ సీల్

ఉత్తర కొరియాలో మొబైల్ ఫోన్‌లు, రేడియోలు మొదలైన డివైస్‌లన్నిటిపై ప్రత్యేకమైన “ట్యాంపర్‌ ప్రూఫ్ సీల్” ఉంటుంది. దీన్ని తీసేస్తే, ప్రభుత్వం తక్షణమే గుర్తించి చర్యలు తీసుకుంటుంది. ఇది ప్రభుత్వ ప్రాపగాండా తప్ప మరే సందేశానికీ మార్గం లేకుండా చేస్తుంది. ఉత్తర కొరియాలో దక్షిణ కొరియా పాప్ మ్యూజిక్, టీవీ సీరియల్స్ (K-Drama)ను పూర్తిగా నిషేధించారు. యువతపై వీటి ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అలాంటి కంటెంట్ చూసినట్టు తేలితే కఠిన శిక్షలు అమ‌లు చేస్తారు.