ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ సమర్దవంతంగా ఎదుర్కుంటోంది. తాజాగా ఓ ఇరాన్ డ్రోన్ ను గాల్లోనే ధ్వంసం చేసిన వీడియోనూ ఇజ్రాయెల్ రక్షణ శాఖ విడుదల చేసింది.
Israel-Iran War : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయి... ఇరుదేశాలు ఒకరిపై ఒకరు మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా ఇరాన్ సైనిక బలాన్ని తగ్గించేలా దాడులకు ప్లాన్ చేసింది... ఇలా ఇరాన్ అణ్వాయుధ, ఆయుధ స్థావరాలే టార్గెట్ గా దాడులకు దిగుతోంది. తాజాగా ఇరాన్ పై జరిపిన దాడుల వివరాలను, వీడియోలను ఇజ్రాయెల్ ఎక్స్ వేదికన విడుదలచేసింది.
గురువారం రాత్రి ఇరాన్ లో మిస్సైల్స్ తయారీ పరిశ్రమలే టార్గెట్ గా దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. దాదాపు రెండుగంటల పాటు ఈ దాడులు జరిపి ఇరాన్ ను చావుదెబ్బ తీసినట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధిచిన వివరాలను IDF అధికారికంగా ప్రకటించింది.
''ఇరాన్ రాజధాని టెహ్రాన్ పరిసరాల్లోని మిస్సైల్స్ తయారీ పరిశ్రమలపై దాడులు చేశాము. 60కి పైగా ఫైటర్ జెట్ దాదాపు 120 నిమిషాల పాటు ఇరాన్ రక్షణ వ్యవస్థలోని కీలక స్థావరాలపై దాడులకు దిగాయి. ఇక ఇరాన్ మిలిటరీ స్థావరాలపైనా దాడులు చేసి ధ్వంసం చేసాం. టెహ్రాన్ సమీపంలోని SPND (Organization for Defensive Innovation and Research) హెడ్ క్వార్టర్ పైనా దాడిచేసాం. ఇరాన్ మిలిటరీలో ఇది చాలా కీలకమైనది'' అని ఇరాన్ పై జరిపిన దాడుల గురించి ఇజ్రాయెల్ వెల్లడించింది.
ఇక ఇరాన్ ప్రయోగించిన 4 UAV (Unmanned Aerial Vehicle) అంటే డ్రోన్లను తమ భూభాగంలోకి రాకుండా అడ్డుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఎక్స్ వేదికన పంచుకుంది ఇజ్రాయెల్ రక్షణ విభాగం.
