Israel Iran conflict: ఇజ్రాయెల్‌లో జరిగిన బాంబుదాడుల కారణంగా తెలంగాణకు చెందిన రవీంద్ర గుండెపోటుతో మృతి చెందారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం క్రమంలో ఇరు దేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఇండియా ఆపరేషన్ సింధూను ప్రారంభించింది.

Israel Iran conflict: ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరు దేశాల్లో బాంబులతో దాడులు చేసుకోవడంతో పెద్ద ఎత్తున నష్టం జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక తెలుగు వ్యక్తి కూడా ఉన్నారు.

తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన రవీంద్ర అనే వ్యక్తి జూన్ 15న ఇజ్రాయెల్‌లో హార్ట్ అటాక్‌కు గురై మృతి చెందాడు. ఇజ్రాయెల్‌లో జరుగుతున్న వరుస బాంబుదాడుల వల్ల తీవ్ర భయాందోళనకు లోనైన రవీంద్ర.. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

రవీంద్ర ఇజ్రాయెల్‌కు విజిట్ వీసాతో వెళ్లి పార్ట్‌టైం ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, అక్కడ పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి.

రవీంద్ర గురించి భార్య విజయలక్ష్మి ఏం చెప్పారంటే?

ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన రవీంద్ర భార్య విజయలక్ష్మి.. "ఆయన మాకు ఫోన్ చేసి అక్కడ జరుగుతున్న బాంబుల మోత విషయాలు చెప్పారు. 'నా ప్రాణాలు పోవచ్చు' అని తెలిపారు. మేము ఆయనకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాం. కానీ చివరికి మేము ఆయనను కోల్పోయాం" అని కన్నీరు పెట్టుకున్నారు.

తమ పిల్లలకు జీవనోపాధి కల్పించాలని, భర్త మృతదేహాన్ని వెంటనే భారత్‌కు తీసుకురావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు.

విజయలక్ష్మి మాట్లాడుతూ.. "నా భర్త మృతదేహాన్ని వెంటనే తీసుకురావాలని కోరుతున్నాను. మా పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను" అని చెప్పారు. ఆమె కుటుంబ స్థితి చాలా కష్టంగా మారిందని తెలిపారు.

Scroll to load tweet…

Scroll to load tweet…

ఇజ్రాయెల్ లో ఉన్నవారి కోసం తెలంగాణ సర్కారు హెల్ప్‌లైన్

ఇజ్రాయెల్‌ లో ఉన్న తెలంగాణ నివాసితుల సమస్యలపై స్పందించేందుకు, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ప్రజలు క్రింది నెంబర్లకు కాల్ చేసి సహాయం పొందవచ్చు..

• వందన: +91 98719 99044

• జి. రక్షిత్ నాయక్: +91 96437 23157

• జావేద్ హుస్సేన్: +91 99100 14749

• సి.హెచ్. చక్రవర్తి: +91 99493 51270

'ఆపరేషన్ సింధూ' ను ప్రారంభించిన భారత ప్రభుత్వం

ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఉత్తర ఇరాన్‌లోని 110 మంది భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిని జూన్ 17న ఆర్మేనియాలోకి తరలించి, అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా జూన్ 19 ఉదయం న్యూఢిల్లీకి తీసుకువచ్చారు.

విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. "ఇరాన్‌లో ఉన్న భారతీయులను రక్షించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూ ను ప్రారంభించింది. దీనిలో భాగంగా 110 మంది విద్యార్థులను 17 జూన్‌న ఆర్మేనియాలోకి తరలించి, 19 జూన్ ఉదయం న్యూఢిల్లీకి తీసుకువచ్చాం" అని తెలిపారు. ఇరాన్‌లో ప్రస్తుతం 4,000 మందికి పైగా భారతీయులు ఉన్నారని, వారిలో సగం మంది విద్యార్థులేనని వెల్లడించారు.

Scroll to load tweet…

భారత కార్మికులపై AICCTU ఆవేదన

ఇజ్రాయెల్‌లో పని చేస్తున్న భారతీయ కార్మికుల భద్రతపై AICCTU (All India Central Council of Trade Unions) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం కార్మికుల కోసం సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించింది.

ఏఐసీసీటీయూ ఒక ప్రకటనలో "ఇజ్రాయెల్‌లోని భారత కార్మికుల భద్రత కోసం ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదు. వారిని తక్షణమే తిరిగి తీసుకురావాలి" అని పేర్కొంది. అక్టోబర్ 2024 నాటికి ఇజ్రాయెల్‌లో సుమారు 32,000 మంది భారతీయ కార్మికులు ఉన్నారనీ, వారిలో 12,000 మంది అక్టోబర్ 2023 తర్వాత ప్రభుత్వ ఒప్పందాలు, ప్రైవేట్ సంస్థల ద్వారా అక్కడి సంస్థల్లో చేరారని తెలిపింది.

గతంలో భారత్‌ చేపట్టిన ఆపరేషన్లు

భారత ప్రభుత్వం గతంలో కూడా అనేక మార్లు యుద్ధ ప్రాంతాల నుంచి భారతీయులను సురక్షితంగా తరలించింది. దీని కోసం ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టింది. 2023లో ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధ సమయంలో ఆపరేషన్ అజయ్ ని చేపట్టింది. యుద్ధ ప్రాంతాల నుంచి భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తీసుకువచ్చింది. 2022లో రష్యా - ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ‘ఆపరేషన్ గంగా’ను చేపట్టింది. చాలా మంది భారతీయులను సురక్షితంగా భారత్ కు తీసుకువచ్చింది.

తాజాగా ఇరాన్ నుండి భారత్ కు వచ్చిన విద్యార్థులు మాట్లాడుతూ.. “మేము డ్రోన్లు, మిస్సైళ్ళను చూశాం. చాలా భయమేసింది. భారత ప్రభుత్వం మాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు. మేము మూడు రోజుల ప్రయాణం చేశాం. మిస్సైళ్ళు మా హాస్టల్ కిటికీల నుండి కనిపించాయి. ఇప్పుడు మా కుటుంబాలను కలవబోతున్నాము, చాలా ఆనందంగా ఉందని” తెలిపారు.

అలాగే, “ఇరాన్ ప్రజలు కూడా మనవాళ్లలానే భయం గుప్పిట్లో ఉన్నారు. చిన్నపిల్లలు చాలా బాధపడుతున్నారు. యుద్ధం మంచిది కాదు” అని మరొకరు చెప్పారు.

ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం ఎందుకొచ్చింది?

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య చాలా కాలంగా ఉద్రిక్తతలు ఉన్నాయి. దీని వెనుక చాలా కారణాలే ఉన్నాయి. అయితే, తాజా ఘర్షణలు చెలరేగడానికి ఇరాన్ అణు కార్యక్రమం పై ఇజ్రాయెల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో మొదలైంది. ఈ కార్యక్రమాన్ని తన అస్తిత్వానికి నేరుగా ముప్పుగా భావిస్తున్న ఇజ్రాయెల్.. ఇరాన్ లక్ష్యం అణు ఆయుధాల అభివృద్ధి అని అనుమానిస్తోంది. అందుకే అణు ప్రాజెక్టులను ఆపాలని పలు మార్లు ప్రస్తావించింది. ఇరాన్ మాత్రం తన అణు ప్రాజెక్టులు శాంతియుత ప్రయోజనాల కోసమేనని చెబుతోంది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి దాడులు చేసుకునే వరకు చేరాయి.