ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరుదేశాల మధ్య యుద్దం ముగిసిందని ట్రంప్ ప్రకటించారు.
Iran-Israel : ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్దవాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే... ఇరుదేశాలు పరస్పరం మిస్సైల్స్, డ్రోన్ దాడులకు తెగబడుతున్నాయి. దీంతో రెండుదేశాల ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటే... యావత్ ప్రపంచం ఆందోళనకు గురవుతోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణ (సీజ్ ఫైర్) కు అంగీకరించాయని ప్రకటించారు. ఈమేరకు తెల్లవారుజామున సోషల్ మీడియా వేదికన ట్రంప్ ప్రకటించారు.
''అందరికీ అభినందనలు. ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. మరో ఆరుగంటల్లో పూర్తిస్థాయిలో చర్చలు జరగనున్నాయి. 12 గంటల్లో యుద్దం అధికారికంగా ముగియనుంది. ముందుగా ఇరాన్ కాల్పుల విరమణ చేపట్టనుంది. 12గంటల తర్వాత ఇజ్రాయెల్ కూడా సీజ్ ఫైర్ చేస్తుంది. మొత్తంగా 24 గంటల్లోపు 12 రోజులుగా ఇరుదేశాల మధ్య సాగుతున్న యుద్దం ముగుస్తుంది'' అని ట్రంప్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
''ప్రతి కాల్పుల విరమణ వెనక శాంతి ఉంటుంది, దేశాల మధ్య పరస్పర గౌరవం ఉంటుంది. అన్నీ అనుకున్నట్లే జరిగి సీజ్ ఫైర్ పూర్తవుతుంది. ఇందుకు అంగీకరించిన ఇజ్రాయెల్, ఇరాన్ కు నా అభినందనలు. ఈ యుద్దం ఆపాలని ఇరు దేశాలు చాలా తెలివిగా ఆలోచించాయి... ధైర్య, సాహసం చూపించాయి. యుద్దం ఏళ్లుగా కొనసాగితే మొత్తం మిడిల్ ఈస్ట్ నాశనం అయ్యేది. కానీ అలా జరగలేదు... ఎప్పుడూ అలా జరగకూడదు. ఇజ్రాయెల్, ఇరాన్ తో పాటు మిడిల్ ఈస్ట్ దేశాలకు ఆ దేవుడు ఆశీర్వదించాలి. అమెరికాకు, ఈ ప్రపంచానికి కూడా దేవుడి ఆశిస్సులు ఉండాలి'' అని ట్రంప్ అన్నారు.
యుద్దం ఇంకా ముగియలేదు : ఇరాన్
యుద్ద ముగిసిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ తో ఎలాంటి సీజ్ ఫైర్ ఒప్పందం జరగలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి స్పష్టం చేశారు. ముందుగా ఇజ్రాయెల్ యుద్దాన్ని ప్రారంభించింది... వారు దాడులు ప్రారభించాకే మేం ప్రతిదాడులు చేసామని అన్నారు. ఇప్పటివరకు సీజ్ ఫైర్ పై నిర్ణయం తీసుకోలేదు... తీసుకుంటే తప్పక ప్రకటిస్తామని ఇరాన్ మంత్రి తెలిపారు.
