israel iran conflict: ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇరాన్ రక్షణ స్థావరాలపై ఇజ్రాయెల్ భారీ దాడికి పాల్పడింది. టెహ్రాన్‌ సహా ఇరాన్ అణు కేంద్రాలు, డిఫెన్స్ బేస్ లపై దాడులు జరుగుతున్నాయి.

israel iran conflict: ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల ఘర్షణలు అంతర్జాతీయంగా మరింత ఆందోళనను పెంచుతున్నాయి. ఇరు దేశాలు వెనక్కి తగ్గకుండా వరుసగా భారీ ఆయుధాలతో దాడులు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ తరఫున అమెరికా కూడా నేరుగా యుద్ధంలోకి అడుగుపెట్టింది. ఇరాన్ లోని పలు ప్రాంతాలపై దాడులు చేసింది.

తాజాగా ఇరాన్ కు తమ సపోర్ట్ ఉంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో పరిస్థితి ఎటుపోతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.

Scroll to load tweet…

ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఇజ్రాయెల్ ఐడీఎఫ్ (IDF) వైమానిక దళాలు టెహ్రాన్ లో విధ్వంసం రేపాయి. ఇరాన్ రాజధానిపై భారీ దాడి చేశాయి. నగరంలోని వివిధ ప్రాంతాలలో భారీ పెలుళ్లు సంభవించాయి. పెద్ద ఎత్తున పొగ కమ్మెసింది. స్థానిక మీడియా విడుదల చేసిన దృశ్యాల్లో చాలా ప్రాంతాల్లో పెద్ద పెలుళ్లు సంభవించాయి.

Scroll to load tweet…

డిఫెన్స్ స్థావరాలే టార్గెట్ గా ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు

ఇస్లాం రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కేంద్రాలు, పోలీస్ ఇంటెలిజెన్స్ సంస్థలపై కూడా దాడులు జరిగాయి. ఇరాన్ అంతర్గత టెలివిజన్ ఛానల్లో ఉదహరించిన ప్రకారం.. కీలక భద్రతా సదుపాయాలపై భారీ దాడులు జరిగాయి.

అంతకుముందు, అమెరికా కూడా ఇరాన్ పై దాడులు చేసింది. టెహ్రాన్ సహా మూడు ప్రాంతాల్లోని అణు కార్యకలాపాల దాడులు చేసింది. ఫోర్డో, నాటాంజ్, ఇస్ఫహాన్ అణు సైట్‌ల మీద ఖచ్చితత్వంతో దాడి జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇరాన్ లో అణుసంబంధిత స్థావరాలను, ఆ దేశ అణు సామర్థ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశామనీ, ఇప్పుడు శాంతియుత మార్గాన్ని ఎంచుకోవాలని పేర్కొన్నారు.

Scroll to load tweet…

తీవ్రంగా స్పందించిన ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్ కు హెచ్చరికలు

అమెరికా ఇరాన్ పై దాడులు చేయడంపై ఆ దేశం తీవ్రంగా స్పందించింది. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చిని మాట్లాడుతూ.. “అమానుష్యమైన సైనిక దాడి” అని పేర్కొన్నారు. దీనికి తగిన సమాధానం ఉంటుందని తెలిపారు. “సమాధానం తగిన సమయంలో తప్పకుండా ఉంటుంది. ఈ దాడులు ఒక నేరమైన అణు చర్యగా భావించాలి. మేము మా రక్షణ మార్గాన్ని ఎంచుకుంటున్నాము” అని తెలిపారు.

అమెరికా చేపట్టిన దాడి ఐక్యరాజ్య సమితి చార్టర్‌తో పాటు అంతర్జాతీయ న్యాయసూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించిందని పేర్కొన్నారు. "నా దేశం ప్రత్యక్షంగా దాడికి గురైంది. ఈ పరిస్థితిలో కేవలం దౌత్యం చాలదు.. ఇప్పుడు మన ప్రధాన లక్ష్యం స్వరక్షణ" అని విదేశాంగ మంత్రి అబ్బాస్ స్పష్టం చేశారు.

ఇరాన్ లో హింసాత్మక పాలన అంతం కావచ్చు: అమెరికా

అవసరమైతే ఇరాన్ ప్రజలు ‘హింసాత్మక పాలన’ నుండి అధికారాన్ని తొలగించే పరిస్థితి రావొచ్చని అమెరికా పేర్కొంది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ సోమవారం ఫాక్స్ న్యూస్‌ తో మాట్లాడుతూ.. "ఇరాన్ పాలన శాంతియుత, దౌత్యపరమైన పరిష్కారానికి రావడానికి నిరాకరిస్తోంది. కానీ, అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికీ ఆ ప్రక్రియలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు... అయితే ఇరాన్ ప్రజలు ఈ హింసాత్మక పాలనను అధికారం నుండి తొలగించకూడదా" అని అన్నారు.

ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా చేపట్టిన వైమానిక దాడులను వైట్ హౌస్ మద్దతు తెలిపింది. ఇరాన్‌ను "తక్షణ ముప్పు"గా వర్ణిస్తూ, టెహ్రాన్ అణ్వాయుధ అభివృద్ధి సామర్థ్యాన్ని ఈ దాడులు తీవ్రంగా దెబ్బతీశాయని పేర్కొంది.

ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. "ఇరాన్ తక్షణ ముప్పుగా మారింది. ఈ ముప్పును నిజంగా ఎదుర్కొనడానికి ధైర్యం చూపిన మొదటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్" అని అన్నారు. ఈ వైమానిక దాడులు ఇరాన్ అణుబాంబు అభివృద్ధి సామర్థ్యాన్ని పూర్తిగా అణిచివేశాయని కూడా తెలిపారు.

హార్ముజ్ జలసంధి వద్ద ట్యాంకర్ల మళ్లింపు

అమెరికా దాడుల నేపథ్యంలో, ఇరాన్ ప్రతీకార చర్యలు వ్యూహాత్మక జలమార్గాలపై ప్రభావం చూపుతాయనే ఆందోళనలతో హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెరిగాయి. సోమవారం, మెరైన్ ట్రాఫిక్ డేటా ప్రకారం మూడు చమురు, రసాయన ట్యాంకర్లు తమ రూట్ మార్చి జలసంధి ప్రాంతం నుండి దూరంగా ప్రయాణించాయి.

మళ్లించిన ట్యాంకర్లలో మెరీ సీ, రెడ్ రూబీ అనే నౌకలు బ్యాలస్ట్‌లో ప్రయాణిస్తూ, గతంలో హార్ముజ్ వైపు వెళ్లినా, ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీరానికి సమీపంగా ఉన్న ఫుజైరా వద్ద లంగరేశారు. మూడవ నౌక కోహ్జాన్ మారూ, ఒమన్ గల్ఫ్ ప్రాంతంలో ఒమన్ జలాలకు సమీపంగా నావిగేట్ చేస్తోంది.

జపాన్‌కు చెందిన షిప్పింగ్ కంపెనీల చర్యలు ప్రారంభించాయి. నిప్పాన్ యుసెన్, మిత్సుయ్ ఓఎస్‌కె లైన్స్ సంస్థలు తమ వాణిజ్య నౌకలకు సంబంధించి పర్షియన్ గల్ఫ్‌ మార్గంలో గడిపే సమయాన్ని తగ్గిస్తూ, జలసంధిలో తక్షణ ప్రాధాన్యతలు మళ్లింపుకు మార్గదర్శకాలను సోమవారం జారీ చేశాయి.

Scroll to load tweet…

పతనానికి దగ్గరలో ఇస్లామిక్ రిపబ్లిక్: యువరాజు రెజా పహ్లావి

ఇస్లామిక్ రిపబ్లిక్ పతనం ఎదురుచూస్తోందని, అది ఇప్పటివరకు ఎన్నడూ లేనంత స్పష్టంగా కనిపిస్తోందని బహిష్కరించబడిన ఇరాన్ యువరాజు రెజా పహ్లావి తెలిపారు. సోమవారం (జూన్ 23, 2025న) ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

"ఈ పాలన ఇప్పుడు తన చివరి దశలో ఉంది. ఇది కూలిపోతుంది" అని అన్నారు. పహ్లావి ప్రకారం ఇరాన్ సైన్యం ప్రస్తుతం అంతర్గతంగా విభజన ఎదుర్కొంటోంది. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. "46 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ నియంతత్వ పాలన మూలాల నుంచే దెబ్బతింటోంది" అని వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా, ఇస్లామిక్ రిపబ్లిక్ నుండి విడిచి బయటకు రావాలనుకునే సైనికులు, పోలీసులు, భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఓ సురక్షిత కమ్యూనికేషన్ ఛానెల్‌ను ప్రారంభించినట్లు పహ్లావి తెలిపారు.

"ఈ అధికారిక ప్లాట్‌ఫామ్ ద్వారా నన్ను, నా బృందాన్ని నేరుగా సంప్రదించవచ్చు. వారు పాలనను విడిచి ప్రజల పక్షాన నిలవాలనుకుంటే, ఇది వారికో విశ్వసనీయ మార్గం" అని తెలిపారు.

అలాగే, దేశభక్తిగల సాయుధ దళాల సభ్యులను ఉద్యమంలో చేరాలని పిలుపునిచ్చారు. "ఇది దేశంలో మీ స్థానానికి గుర్తింపు పొందే సమయం. మీరు తీసుకునే ప్రతి న్యాయమైన చర్యను ప్రజలు గుర్తుంచుకుంటారు" అని పేర్కొన్నారు.