షాంఘై ఫోరంలో భారత అభివృద్ధి, పెట్టుబడి అవకాశాలపై ప్రతీక్ మాథుర్ ప్రసంగించారు. భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్నట్లు పేర్కొన్నారు.

 చైనాలోని షాంఘై నగరంలో నిర్వహించిన వార్షిక కాన్సుల్ జనరల్స్, CEOల బిజినెస్ ఫోరంలో భారత కాన్సులేట్ జనరల్ ప్రతీక్ మాథుర్ ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. ఈ ఫోరంలో భారతదేశ అభివృద్ధి, పెట్టుబడి అవకాశాలు, ఆవిష్కరణల గురించి వివరిస్తూ దేశ ప్రగతి ప్రయాణాన్ని ప్రపంచం ముందు ఉంచారు.

ప్రస్తుతం భారత్ 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకునే దిశగా కదులుతున్నదని మాథుర్ పేర్కొన్నారు. జనాభాలో యువత శాతం ఎక్కువగా ఉండటం, వినియోగదారుల శక్తి, విద్యావంతుల సంఖ్య ఇవన్నీ భారత్‌కు ఆర్థిక పరంగా బలమని చెప్పారు.

జపాన్‌ను అధిగమించి భారత్ నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిన నేపథ్యంలో, త్వరలోనే జర్మనీ పై పైచేయి సాధించి మూడో స్థానాన్ని అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మేక్ ఇన్ ఇండియా, పీఎల్ఐ (PLI) వంటి కార్యక్రమాల ద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతూ, దేశీయ సంస్థలు గ్లోబల్ మార్కెట్లకు పోటీగా ఎదుగుతున్నాయని వివరించారు.

కరోనా తర్వాత తయారీ, సరఫరా శ్రేణుల్లో నిలిచిపోయిన ధోరణిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం 14 రంగాల్లో భారీ ప్రోత్సాహకాలు ఇచ్చిందని, ఫలితంగా స్మార్ట్‌ఫోన్ తయారీలో భారత్ ఇప్పుడు చైనా తర్వాత రెండో స్థానంలో ఉందని చెప్పారు. ఫాక్స్‌కాన్ లాంటి దిగ్గజ సంస్థలు ఐఫోన్ తయారీకి భారత్‌ను కేంద్రంగా మార్చడం ఇదే ధృవీకరిస్తుందని వివరించారు.

Scroll to load tweet…

భారత ఐటీ రంగం, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్ తయారీ రంగాల్లో వేగంగా అభివృద్ధి సాధిస్తోందని, ప్రభుత్వ విధానాలు వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచాయని చెప్పారు. ఇటీవల వరల్డ్ బ్యాంక్ నివేదికల్లో భారత్ దాదాపు 80 స్థానాలు ఎగబాకినట్లు గుర్తు చేశారు.

జి20 అధ్యక్ష బాధ్యతలను భారత్ సమర్థంగా నిర్వహించినట్లు గుర్తుచేసిన మాథుర్, భారత్ గ్లోబల్ ఈకానమీని ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంటోందని అన్నారు. 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ నిలుస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. ఇది భారతదేశ దశాబ్దమే కాక, శతాబ్దంగా మారే అవకాశం ఉందని చెప్పారు.