టెక్సాస్‌లో బస్సులో ప్రయాణిస్తున్న భారత సంతతికి చెందిన అక్షయ్ గుప్తా హత్యకు గురయ్యారు. నిందితుడు మరో భారతీయుడే.

ఇంతకాలం అమెరికాలో భారతీయులను ఆ దేశస్థుల్లో , ఇతర దేశాల వారో చంపేయడం గురించి మనం చూస్తూనే ఉన్నాం. కానీ తాజాగా ఓ భారతీయుడు..మరో భారతీయున్ని అమెరికాలో దారుణంగా చంపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన టెక్సాస్‌ లోని ఆస్టిన్‌ ప్రాంతంలో ఓ బస్సులో జరిగినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. భారతీయ సంతతికి చెందిన అక్షయ్‌ గుప్తా (30) హెల్త్‌- టెక్‌ స్టార్టప్‌ కంపెనీకి సహ వ్యవస్థాపకుడిగా పనిచేస్తున్నారు. మే 14న టెక్సాస్‌లో ఓ బస్సులో ప్రయాణిస్తుండగా ఆయన పై దాడి జరిగింది. అదే బస్సులో వెనక కూర్చొన్న గుప్తాపై మరో భారతీయుడు దీపక్‌ కండేల్‌ కత్తితో దాడి చేసి హతమార్చాడు. అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గుప్తాను ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.

మామలా కనిపించడం వల్లే..

దాడి జరిగిన సమయంలో ఎలాంటి ఘర్షణ చోటుచేసుకోకపోయినా కండేల్‌ దాడి చేసినట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా బయటపడింది.  వాటి ఆధారంగా నిందితుడిని గుర్తించి పట్టుకున్నాం. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. కాగా.. అక్షయ్‌ గుప్తా తన మామలా కనిపించడం వల్లే తాను అతనిని కత్తితో పొడిచినట్లు నిందితుడు పోలీసులకు చెప్పడం గమనార్హం. అక్షయ్‌ పెన్‌ స్టేట్‌ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్‌ పూర్తి చేశారు. తన కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యనాదెళ్లను కూడా కలిశారు.