అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్ చేసారు. ఇండియా అమెరికాకు దాదాపు సున్నా సుంకాలతో కూడిన ఒప్పందాన్ని ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. అలాగే యాపిల్ సంస్థను ఇండియాలో పెట్టుబడులు పెట్టొద్దని సూచించానన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇండియా గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. భారత్ లో యాపిల్ కంపనీ విస్తరణకు సిద్దమవగా... ఇలా చేయడం అవసరం లేదని ఆ కంపనీ సీఈవో టిమ్ కుక్ కు సూచించినట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాలోనే యాపిల్ కంపనీని విస్తరించాలని చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. 

"నేను నిన్న టిమ్ కుక్‌తో చర్చించా. యాపిల్ ఇండియాలో మరింత విస్తరించడానికి ప్రయత్నిస్తోందని వింటున్నాను. నాకు యాపిల్ ఉత్పత్తులు ఇండియాలో తయారుచేయడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇండియా ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాలలో ఒకటి, కాబట్టి ఇండియాలో అమ్మడం చాలా కష్టం" అని టిమ్ కుక్ తో చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు.

ఇక ఇండియా అమెరికాకు దాదాపు సున్నా సుంకాలతో కూడిన ఒప్పందాన్ని ప్రతిపాదికంగా ఇచ్చిందని ప్రకటించారు. "వాళ్ళు మాకు ఒక డీల్ ఆఫర్ చేశారు, అందులో వాళ్ళు మన దగ్గర ఏ సుంకం వసూలు చేయమని చెప్పారు," అని ఇండియా గురించి దోహాలో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ వెల్లడించారు. 

Scroll to load tweet…

ఐఫోన్‌ల మొత్తం ఉత్పత్తిని ఇండియాకు మార్చేందుకు ఆపిల్ సిద్ధమవుతోందని గతంలో వార్తలు వచ్చాయి. చైనా నుండి తయారీ కార్యకలాపాలను తగ్గించి ఇండియాలో ఉత్పత్తిని పెంచాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు అటు వ్యాపార వర్గాల్లోనే కాదు ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.