అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌పై ఇమ్మిగ్రేష‌న్ అధికారుల దాడుల‌తో మొద‌లైన నిర‌సన‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఆరో రోజు కూడా ఆందోళ‌న‌లు తీవ్ర‌త‌ర‌మ‌య్యాయి. 

లాస్ ఏంజెల్స్ నగరం ప్రస్తుతం ఉద్రిక్తతలతో ఉడికిపోతోంది. అక్రమ వలసదారులపై ఇమ్మిగ్రేషన్ అధికారుల దాడులతో మొదలైన నిరసనలు ఆరో రోజుకూ కొనసాగుతున్నాయి. శాంతియుతంగా మొదలైన ఈ ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో అధికారులు నగరంలో కర్ఫ్యూ విధించారు.

లాస్ ఏంజెల్స్‌లో మేయర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. నాటకీయంగా మారిన పరిస్థితుల మధ్య జాతీయ భద్రతా దళాలు, మెరైన్లు భారీగా మోహ‌రించారు. నగరంలోని ప్రధాన రోడ్లపై ఎక్క‌డ చూసినా పోలీసులు, సైనికులే క‌నిపిస్తున్నారు.

ట్రంప్ కఠిన హెచ్చరికలు: తిరుగుబాటు చట్టం ప్రయోగం?

ఈ పరిణామాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అక్రమ వలసదారులను తిరిగి తమ దేశాలకు పంపుతామని తేల్చిచెప్పారు. ఆందోళనలు కొనసాగితే "తిరుగుబాటు చట్టం" ప్రయోగిస్తానని, అవసరమైతే నగరాన్ని ఫెడరల్ నియంత్రణలోకి తీసుకొస్తానని హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలు ప్రస్తుతం అమెరికా రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

ఇదిలా ఉంటే ఇది ఒక్క లాస్ ఏంజెల్స్ సమస్యగానే కాకుండా ఇతర నగరాలకు కూడా వ్యాపించింది. న్యూయార్క్, డెన్వర్, బోస్టన్, డాలస్, సియాటెల్, శాంటా అనా, వాషింగ్టన్ డీసీ, షికాగో, ఆస్టిన్ తదితర నగరాల్లో వందలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

ఆస్టిన్ నగరంలో జరిగిన ఘర్షణల్లో నలుగురు అధికారులు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. లాస్ ఏంజెల్స్‌లో కర్ఫ్యూ అమలులో ఉన్నా... ఆందోళనకారుల సంఖ్య తగ్గలేదు. పోలీసుల ప్రకారం ఇప్పటికే 400 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

లాస్ ఏంజెల్స్ నగరంలో ఇప్పటి వరకు మోహరించని స్థాయిలో నేషనల్ గార్డ్స్‌ను రంగంలోకి దించారు. ఇరాక్, సిరియా వంటి యుద్ధ ప్రాంతాల్లో ఉన్న దళాల కంటే ఎక్కువ మంది గార్డ్స్ ఇప్పుడు నగరంలో ఉన్నారు. ఇంత‌కు ముందు ఈ దళాలకు అరెస్టు చేసే అధికారాలు లేవు. కానీ ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రభుత్వం వారికి తాత్కాలికంగా కొన్ని ప్రత్యేక అధికారాలను అప్పగించింది. అల్లర్లు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో వారు ఇప్పుడు అరెస్టులు కూడా చేస్తున్నారు.