ఇరాన్‌, ఇజ్రాయెల్‌ల మ‌ధ్య మొద‌లైన ఉద్రిక్త‌త‌లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అయితే ఇప్ప‌ట్లో ఈ యుద్ధం ఆగేలా క‌నిపించ‌డం లేదు. తాజాగా జ‌రుగుతోన్న ప‌రిణామాలు చూస్తుంటే నిజ‌మే అనిపిస్తున్నాయి. 

ఇరాన్‌, ఇజ్రాయెల్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా మధ్యప్రాచ్యంలో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో వివిధ దేశాలు తమ పౌరులను విమానాలూ, బస్సులూ, కార్ల ద్వారా సురక్షితంగా తరలిస్తున్నాయి.

భారత్

ఇజ్రాయెల్‌-ఇరాన్​ మధ్య యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో భారత్ సైతం భారతీయుల్ని తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. దీనికి 'ఆపరేషన్ సింధు' అని పేరు పెట్టారు. 

జూన్‌ 17న ఉత్తర ఇరాన్‌ నుంచి ఆర్మేనియాకు చేరుకున్న 110 మంది విద్యార్థులను భారత్‌కు తీసుకొచ్చారు. వీరంతా ఆర్మేనియా రాజధాని యెరవాన్‌ నుంచి ప్రత్యేక విమానంలో భారత్ చేరుకున్నారు. జూన్‌ 19న తెల్లవారు జామున వీరు దిల్లీకి చేరుకున్నారు.

బల్గేరియా

బల్గేరియా తాత్కాలికంగా ఇరాన్‌లోని రాయబార కార్యాలయాన్ని అజర్బైజాన్ రాజధాని బాకూకు మార్చింది.

89 బల్గేరియన్ పౌరులు, మరో 59 మంది ఇతర దేశాలకు చెందిన వారిని ఇజ్రాయెల్ నుంచి ఈజిప్ట్‌లోని షార్మ్ ఎల్ షేక్‌కు బస్సుల ద్వారా త‌ర‌లించి, అక్కడినుంచి విమానాల్లో సోఫియాకు పంపించారు.

చైనా

చైనా 1,600 మందిని ఇరాన్ నుంచి, వందల మందిని ఇజ్రాయెల్ నుంచి సురక్షితంగా తరలించింది. ఈవాక్యుయేషన్‌ కోసం బస్సులు, కార్లు వాడుతున్నారు. టాబా బోర్డర్‌ క్రాసింగ్ ద్వారా ఈజిప్ట్‌కి తరలిస్తున్నారు. చైనీస్ పాస్‌పోర్ట్ కలిగినవారికి మాత్రమే అవకాశం కల్పించారు.

యూరోపియన్ యూనియన్

ఈయూ 400 మందిని జోర్డాన్, ఈజిప్ట్‌ ద్వారా తరలించింది. ఇందుకోసం స్లొవేకియా, లిథువేనియా, గ్రీస్, పోలాండ్ దేశాలు సహకారం కోరాయి. ఈయూ అందించే విమాన ఖర్చులో 75% వరకు సహాయం చేస్తోంది.

ఫ్రాన్స్

ఫ్రాన్స్ తన పౌరులను టర్కీ, ఆర్మేనియా, ఈజిప్ట్‌ మీదుగా తరలిస్తోంది. వారికి ప్రత్యేక బస్సుల ద్వారా బోర్డర్ వరకూ తీసుకెళ్లి, అక్కడినుంచి కమర్షియల్ ఫ్లైట్స్‌ ద్వారా దేశానికి చేరుస్తోంది.

జర్మనీ

జర్మనీ 171 మందిని బుధవారం, 174 మందిని గురువారం ప్రత్యేక విమానాల్లో అమ్మాన్ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు తీసుకొచ్చింది. మరో విమానం వీకెండ్‌కి ప్లాన్ చేశారు. కానీ, ఇజ్రాయెల్‌ అంతటా ఉన్న పౌరులను సమీకరించడం ప్రమాదకరమని భావించి, బస్సుల ద్వారా తరలించలేదు.

కాగా మధ్యప్రాచ్యం అంతటా ఎయిర్‌స్పేస్ మూసివేయడంతో ప్రజలు ఇబ్బందిప‌డుతున్నారు. కొంతమంది రోడ్డు మార్గాల ద్వారా టర్కీ, అజర్బైజాన్, జోర్డాన్‌కు చేరుకుంటున్నారు. మొత్తం మీద ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా చాలా దేశాలు తమ పౌరుల రక్షణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి.