Fire Accident: హాంకాంగ్‌ తై పో జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జ‌రిగింది. 35 అంతస్తులతో ఉన్న పెద్ద హౌసింగ్ కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో క్షణాల్లోనే అనేక ఫ్లాట్లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 44 మంది మరణించినట్లు తెలుస్తోంది. 

4000 మందికి పైగా నివాసితులు

బుధ‌వారం సాయంత్రం ప్రారంభమైన మంట‌లు వెంటనే, ఆ కాంప్లెక్స్‌లో నివసించే వేలాది మంది ప్రజలు గందరగోళానికి గురయ్యారు. దట్టమైన పొగతో అపార్ట్‌మెంట్ అంతా నిండి పోయింది. రాత్రికి రాత్రే అధికారులు సుమారు 700 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాత్కాలిక ఆశ్రయాలు ఏర్పాటు చేసి, కుటుంబాల‌ను త‌ర‌లించారు. అయితే మరో 270 మందికి పైగా కనిపించడంలేదని తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

రంగంలోకి అగ్నిమాప‌క సిబ్బంది

వందల సంఖ్యలో ఫైరింజిన్లు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి శ్రమిస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనం కావడంతో మంటలు పై అంతస్తుల దాకా వేగంగా వ్యాపించాయి. కొంతమంది అగ్నిమాపక సిబ్బంది కూడా గాయపడినట్లు సమాచారం. మృతుల్లో ఫైర్ సిబ్బంది ఉండవచ్చన్న అనుమానం ఉన్నప్పటికీ, అధికారిక నిర్ధారణ ఇంకా రావడం లేదు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు

అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సమయం బుధవారం మధ్యాహ్నం 02:51. కొద్ది నిమిషాల్లోనే భారీ మంటలు 35 అంతస్తుల భవనం మొత్తం చుట్టుముట్టాయి. అగ్నిప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పక్క అపార్ట్‌మెంట్‌లకు కూడా మంటలు అంటుకోవడంతో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు ప‌రుగులు పెట్టారు.

Scroll to load tweet…

ట్రాఫిక్ జామ్

ప్రమాదం తీవ్రత దృష్ట్యా, హాంకాంగ్ ట్రాన్స్‌పోర్ట్ శాఖ సమీప రహదారులను పూర్తిగా మూసివేసింది. కాంప్లెక్స్ చుట్టుపక్కల భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు, ప్రమాదం మరింత విస్తరించే ప్రమాదం ఉండడంతో సమీప హైవేలను కూడా నిలిపివేశారు. పొగ విపరీతంగా వ్యాపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది.