బలపడుతోన్న అల్ప పీడనం.. తరుముకొస్తున్న కొత్త తుపాను. ఆకాశంలో ఆగమాగమే..
IMD Rain Alert: సెన్యార్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ తుపాను దారి మళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు మరో కొత్త తుపాను తరుముకొస్తుంది.

డిత్వా తుపాను
బంగాళాఖాతంలో తాజా వాతావరణ మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. సెన్యార్ తుపాను దారి మళ్లడంతో ప్రమాదం తప్పినా, కొత్త అల్పపీడనం త్వరగా బలపడుతోంది. దీనికి ‘డిత్వా’ అనే పేరు నిర్ణయించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 28–29 మధ్య ఇది తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు అంచనా. తమిళనాడు నుంచి దక్షిణ ఆంధ్ర తీరం వరకు భారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఆంధ్ర–తమిళనాడు తీరాలకు భారీ వర్ష సూచన
డిత్వా ప్రభావం నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు స్పష్టంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీని కారణంగా ప్రధానంగా.. నెల్లూరు, ప్రకాశం, దక్షిణకోస్తా ప్రాంతాలు, ఉత్తర తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక గాలివేగం 45–50 కిమీ వేగం దాటే అవకాశం ఉన్నట్లు సూచించారు. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. సముద్రంలో అలలు భారీగా ఎగసే అవకాశం ఉన్నందున మత్స్యకారులకు వేటపై తాత్కాలిక నిషేధం విధించారు.
తెలంగాణలో విపరీత వాతావరణ ధోరణులు: సీఎస్ఈ రిపోర్ట్ హెచ్చరిక
దేశవ్యాప్తంగా తీవ్ర వాతావరణ పరిస్థితులు పెరుగుతున్నాయని ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ రిపోర్ట్ చెబుతోంది. 2025 జనవరి–సెప్టెంబర్ కాలానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. 273 రోజుల్లో 54 రోజులు అసాధారణ వాతావరణం. 26 రోజులు భారీ వర్షాలు–వరదలు, 24 రోజులు పిడుగులు, పిడుగుల కారణంగా 22 మరణాలు, రెండు రోజులు హీట్‌వేవ్, ఒక రోజు కోల్డ్‌వేవ్. తెలంగాణలో వాతావరణ మార్పులు ఎలా ఉన్నాయో చెప్పేందుకు ఇవే నిదర్శనాలు.
శ్రీలంక సమీపంలో వాయుగుండం
ఇదిలా ఉంటే సెన్యార్ దూరం కావడంతో భారత్‌కి ప్రమాదం తగ్గింది. అయితే శ్రీలంక పక్కన ఏర్పడిన మరో తీవ్ర అల్పపీడనం వేగంగా మార్పు చెందుతోంది. ఈ వాయుగుండం ఉత్తర వాయవ్య దిశగా కదలుతోంది. శనివారం నాటికి ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి తీరాలకు చేరే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో శుక్ర–శని–ఆది రోజుల్లో వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. గురువారం రాత్రికల్లా మేఘాలు పూర్తిగా ఆవరించే అవకాశం ఉంది. తెలంగాణలో గురువారం వర్షం పడకపోవచ్చని, చలి కాస్త తగ్గుతుందని అధికారులు తెలిపారు.
తగ్గుతోన్న చలి
గత వారం వరకూ తెలంగాణలో తీవ్ర చలి నమోదు కాగా, ఇప్పుడు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం రోజు పటాన్‌చెరువు – 17°C, మెదక్ – 13.5°C, నిజామాబాద్ – 17.6°C, రామగుండం – 17.5°C, హైదరాబాద్ – 18.2°C, నల్లగొండ – 18.2°C, ఖమ్మం – 20.4°C, భద్రాచలం – 21°Cగా నమోదయ్యాయి. రాబోయే రెండు రోజుల్లో ఏపీ తీర ప్రాంతాలు, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.

