ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారా? పాకిస్థాన్ లో రచ్చ
Imran Khan : ఇమ్రాన్ ఖాన్ జైలులో హత్యకు గురయ్యారని ఆఫ్ఘనిస్తాన్ మీడియా కథనాలతో పాకిస్థాన్‌లో ఉద్రిక్తత నెలకొంది. అదియాలా జైలు వద్ద పీటీఐ ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ఇమ్రాన్ ఖాన్ మరణ వార్తలతో పాకిస్థాన్‌లో కలకలం
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ తహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ మరణించారని ఒక అఫ్గాన్ మీడియా సంస్థ వార్తతో దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. “ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్” అనే పోర్టల్ నవంబర్ 26న విశ్వసనీయ సమాచారం అంటూ ప్రచురించిన కథనం రచ్చ లేపుతోంది. రావల్పిండి అదియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ మరణించారని పేర్కొంది. ఈ వార్త సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవడంతో ఎక్స్ లో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తాయి.
అయితే, ఈ ప్రకటనను ఏ పాకిస్థాన్ ప్రధాన మీడియా సంస్థలు ధృవీకరించలేదు. డాన్, అల్ జజీరా వంటి వార్తా సంస్థలు కూడా ఏ నిర్థారణ ఇవ్వలేదు. ఖాన్ పార్టీ పీటీఐ కూడా దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. కానీ, ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాక్ అధికారులు ఏమంటున్నారు?
ఆఫ్ఘనిస్తాన్ మీడియా ప్రచారం తర్వాత కొన్ని గంటల్లోనే పాకిస్థాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వార్తను ఫేక్ గా ఖండించింది. ప్రజలను ఇలాంటి ఫేక్ న్యూస్ పై జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.
ఇదిలా వుండగా, ఖాన్ మరణంపై ఒక ప్రెస్ రిలీజ్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిందని పేర్కొంటూ పంచుకున్నారు. కానీ, ప్రభుత్వం వెంటనే ఇది తప్పుడు ప్రకటన అని స్పష్టం చేసింది.
అదియాలా జైలు బయట వేలాది పీటీఐ కార్యకర్తల ఆందోళనలు
ఇమ్రాన్ ఖాన్ మరణ వార్తలు వైరల్ కావడంతో అదియాలా జైలు వద్దకు వేలాది మంది పీటీఐ కార్యకర్తలు చేరుకున్నారు. ఖాన్ ఆరోగ్యంపై పూర్తి సమాచారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
పబ్లిక్ ఒత్తిడి పెరగడంతో పాక్ ప్రభుత్వం జైలు పరిసరాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించింది. కార్యకర్తలు జైలు వైపు మార్చ్ చేయడానికి ప్రయత్నించగా, పోలీసులు వారిని చెక్‌పాయింట్ల వద్ద అడ్డుకున్నారు.
ఇది జరుగుతున్న సమయంలో, ఖాన్ సోదరీమణులు అలీ మా ఖాన్, డాక్టర్ ఉజ్మా, నరీన్ ఖాన్ లు జైలుకు వెళ్లడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఫ్యాక్టరీ చెక్‌పాయింట్, దాహ్గల్ చెక్‌పాయింట్ల వద్ద వారిని అడ్డుకున్నారు.
మాపై దాడి చేశారు.. ఖాన్ కుటుంబం తీవ్ర ఆరోపణలు
కొన్ని నెలలుగా పాకిస్థాన్ ప్రభుత్వం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను కలవడానికి ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు. తమను కూడా కలవనీయలేదని ఖాన్ సోదరీమణులు ఆరోపించారు. నరీన్ నియాజీ తెలిపిన వివరాల ప్రకారం, వారు అదియాలా జైలు బయట శాంతియుతంగా నిరసన చేపట్టిన సమయంలో లైట్లు ఆఫ్ చేసి, పోలీసులు మహిళలను తోసేసి జట్టుపట్టుకుని లాక్కెళ్లారని పేర్కొన్నారు.
"71 ఏళ్ల వయసులో నన్ను జుట్టు పట్టుకుని నేలపై పడవేసి, రోడ్డుమీద లాక్కెళ్లారు" అని నరీన్ పేర్కొన్నారు. ఇతర మహిళలపై కూడా పోలీసు దాడులు జరిగాయని ఆమె తెలిపారు. పీటీఐ ఈ ఘటనపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది.
ఇమ్రాన్ ఖాన్ నిర్బంధం
2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ అదియాలా జైలులో ఉన్నారు. అవినీతి, కోర్టు ధిక్కరణ వంటి అనేక కేసుల్లో ఆయనపై విచారణలు జరుగుతున్నాయి. పీటీఐ ఆయనను పూర్తిగా ఒంటరిగా ఉంచారు.
న్యాయవాది ఖాలిద్ యూసుఫ్ చౌదరి ప్రకారం, పుస్తకాలు, అవసరమైన వస్తువులు, న్యాయసలహాదారులను కలుసుకునే అవకాశాన్ని కూడా ఖాన్‌కు నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ఖైబర్-పఖ్తున్‌ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది కూడా అతన్ని చూడటానికి చేసిన ఏడుసార్ల ప్రయత్నాలను జైలు అధికారులు అడ్డుకున్నారని తెలిపారు. ఇక్కడ చట్టం కాదు.. అటవిక రాజ్యం నడుస్తోందని ఆయన ఆరోపించారు. పీటీఐ నాయకులు, కార్యకర్తలు ఖాన్‌ను విడుదల చేయాలని, కనీసం కుటుంబ సభ్యులను కలవడానికైనా అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆఫ్ఘన్ మీడియాలో వచ్చిన కథనం ఫేక్ అని పాక్ అధికారులు చెబుతున్నప్పటికీ, ఇమ్రాన్ ఖాన్ ను ఒంటరిగా వుంచడం, కుటుంబ సభ్యులను కూడా కలవనీయకపోవడంతో పీటీఐ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
🚨#BreakingNews:
A credible source from Pakistan has confirmed to Afghanistan Times that PTI Chairman Imran Khan has allegedly been mysteriously killed, and his body has been moved out of the prison.#PTI#AfghanistanAndPakistanpic.twitter.com/FpJSrksXHA— Afghanistan Times (@TimesAFg1) November 26, 2025

