భారీ భూకంపం ధాటికి అలాస్కా ఊగిపోయింది. బుధవారం అలాస్కా దక్షిణ ద్వీపకల్పంలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.3గా న‌మోదైంది. అయితే ఈ భూకంపానికి సంబంధించిన వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

నెట్టింట వైర‌ల్ అవుతోన్న ఈ వీడియోలో ఓ ఇంటి వద్ద నిలిపిన కార్లు, ఇంటి నిర్మాణం వణికిపోయే విధంగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఘటన తాలూకు దృశ్యాలను Alaska Earthquake Center తమ అధికారిక ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేసింది.

ఈ సంస్థ తెలిపిన ప్రకారం, సాండ్పాయింట్ అనే గ్రామంలో నివసించే ఒక వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరించాడు. "ఇలాంటి వీడియోలు ప్రజలకు భూకంపాల సమయంలో జరిగే పరిస్థితులపై అవగాహన కల్పిస్తాయి, భవిష్యత్తులో సిద్ధంగా ఉండేలా చేస్తాయి," అని సంస్థ వెల్లడించింది. అయితే భూకంపం తీవ్రత ఎక్కువగా ఉన్నా... ఎవరూ గాయపడ్డారని సమాచారం రాలేదని అధికారులు తెలిపారు. ఇది అలాస్కాలో సాధారణంగా జరిగే పెద్ద భూకంపాలలో ఒకటిగా పేర్కొన్నారు.

సునామీ హెచ్చరిక ఎందుకు జారీ చేశారు?

ఈ భూకంపం తర్వాత సాండ్పాయింట్ గ్రామం, ప్రజలతో కూడిన తీరప్రాంతం కావడం వల్ల మొదట సునామీ హెచ్చరిక జారీ చేశారు. ఈ గ్రామం భూకంప కేంద్రానికి సుమారు 50 మైళ్ల‌ దూరంలో ఉంది. అలాస్కా ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ డివిజన్ ప్రతినిధి జెరెమీ జిడెక్ మాట్లాడుతూ “ఇది చాలా తీవ్రమైన భూకంపం కావడంతో, ముందు జాగ్రత్త చర్యల కోసం సునామీ హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది. పలు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి, తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్న సూచనలు ఇచ్చాము” అని చెప్పారు. కోల్డ్ బే, సాండ్పాయింట్, కొడయాక్, కింగ్ కోవ్, యూనాలాస్కా వంటి ప్రాంతాల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

వైరల్ వీడియో 

Scroll to load tweet…

సునామీ హెచ్చ‌రిక‌లు ర‌ద్దు

భూకంపం తరువాత జారీ చేసిన సునామీ హెచ్చరికను, కొద్ది గంటల్లోనే అలస్కా వాతావరణ శాఖ పునఃపరిశీలించి, మొదటగా అడ్వైజరీకి డౌన్‌గ్రేడ్ చేశారు. ఆ తరువాత, పూర్తిగా రద్దు చేశారు. ఎక్స్ వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. సునామీ ప్ర‌మాదం ఏం లేద‌ని అయితే కొన్ని తీర ప్రాంత స‌ముద్ర మ‌ట్టాల్లో స్వ‌ల్పంగా మార్పులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.