- Home
- Andhra Pradesh
- IT Jobs: విశాఖ, విజయవాడలో ఉన్న విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు.. లింక్డిన్ సర్వేలో ఆసక్తికర విషయాలు
IT Jobs: విశాఖ, విజయవాడలో ఉన్న విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు.. లింక్డిన్ సర్వేలో ఆసక్తికర విషయాలు
ఐటీ ఉద్యోగాలు అంటే ఠక్కున గుర్తొచ్చేవి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, పుణె వంటి మెట్రో నగరాలు. అయితే ఈ అభిప్రాయం మారే రోజులు వచ్చేశాయి. ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ అయిన లింక్టిన్ నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

టాప్10లో చిన్న నగరాలు
ఈ నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా టైర్-2, టైర్-3 నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, రాంచి, నాశిక్, రాయ్‌పూర్, రాజ్‌కోట్, ఆగ్రా, మధురై, వడోదర, జోధ్‌పూర్ ఉద్యోగ నియామకాల్లో గణనీయమైన స్థానం సంపాదించాయి. మెట్రోలకు భిన్నంగా జీవన వ్యయం తక్కువగా ఉండటం, ఆకర్షణీయమైన మౌలిక సదుపాయాలు ఉండటం వంటివి ఈ నగరాలకు అనుకూలంగా మారాయి. కంపెనీలు కూడా ఇప్పుడు తమ కార్యకలాపాలను ఈ నగరాలకు విస్తరిస్తున్నాయి.
ఐటీ హబ్‌గా మారుతోన్న విశాఖ
విశాఖపట్నం ఇప్పుడు ఇండస్ట్రీలు, ఐటీ కంపెనీలకు గమ్యస్థానంగా మారుతోంది. విశాఖలో డేటా సెంటర్లు, ఫార్మా కంపెనీల విస్తరణ వంటి అంశాలు ఐటీ రంగానికి తోడ్పడుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్, మిరాకిల్ సాఫ్ట్‌వేర్, లారస్ ల్యాబ్స్ వంటి సంస్థలు విస్తృతంగా ఉద్యోగ నియామకాలు చేస్తుండటం విశేషం. ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో విశాఖ దేశవ్యాప్తంగా టాప్ టెక్ హబ్‌లలో ఒకటిగా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
విజయవాడకు పెరుగుతోన్న పెట్టుబడులు
విజయవాడ ఇటీవల మౌలిక సదుపాయాల పరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. నదీ తీరాన ఉన్న ఈ నగరంలో, పర్యాటక రంగానికే కాకుండా ఐటీ రంగానికి కూడా కేంద్ర బిందువవుతోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ వంటి టాప్ ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించడం ద్వారా భారీగా ఉద్యోగావకాశాలు పెరిగాయి.
రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉండటంతో పాటు.. విజయవాడకు హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో నగరాలు దగ్గరల్లో ఉండడం కూడా కంపెనీలు ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో అమరావతి, గుంటూరు, విజయవాడ మూడు పట్టణాలు కలిసి పోయే అవకాశం ఉందన్న వార్తలు సైతం ఇక్కడ ఉద్యోగకల్పన పెరగడానికి ఒక కారణంగా చెప్పొచ్చు.
అభివృద్ధి చెందుతున్న రంగాలు ఇవే
లింక్టిన్ డేటా ప్రకారం, ఈ చిన్న నగరాల్లో ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సేల్స్, బిజినెస్ డెవలప్‌మెంట్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో ఎక్కువగా నియామకాలు జరుగుతున్నాయి. చిన్న పట్టణాల్లో మానవ వనరులు అందుబాటులో ఉండటంతో పాటు, దూరదృష్టి ఉన్న కంపెనీలు ఈ నగరాలను తమ అభివృద్ధికి కేంద్రాలుగా మార్చుకుంటున్నాయి.
యువతలో ఆలోచన మారుతుందా.?
లింక్టిన్ విడుదల చేసిన నివేదిక “ఐటీ అంటే మెట్రోలే” అన్న దృష్టికోణం నెమ్మదిగా మారేలా చేస్తోంది. ఇక యువత ఆలోచనలపై కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగాల కోసం మెట్రో నగరాలకు వెళ్లే ఆలోచనలో క్రమంగా మార్పులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

