USA: చైనా జాతీయులు అమెరికాలోకి ఫుసారియమ్ గ్రామినేరియమ్ (Fusarium graminearum) అనే ప్రమాదకర శిలీంద్రాన్ని అక్రమంగా తరలించారు. అమెరికాపై బయో వార్ లా కనిపిస్తున్నఈ దాడి ప్రయత్నాలను ముందుగానే పసిగట్టిన ఎఫ్‌బీఐ వారిని అరెస్ట్ చేసింది.
USA: అమెరికాలోకి ఒక ప్రమాదకర వైరస్ ను అక్రమంగా తరలించినందుకు చైనా పౌరులను ఎఫ్‌బీఐ అరెస్ట్ చేసింది. అరెస్టు అయిన వారిలో యున్‌చింగ్ జియాన్ (33) అనే మహిళ, ఆమె ప్రియుడు జునియాంగ్ లియూ (34) ఉన్నారు. వీరిద్దరూ యునైటెడ్ స్టేట్స్ లో మిచిగన్ విశ్వవిద్యాలయంలో పరిశోధనల నిమిత్తం పనిచేస్తున్నారు.
అమెరికా న్యాయ విభాగం ప్రకారం జియాన్.. ఫుసారియమ్ గ్రామినేరియమ్ (Fusarium graminearum) అనే శిలీంద్రాన్ని దేశంలోకి అక్రమంగా తెచ్చిందని ఆరోపణలు వచ్చాయి. ఇది ఒక వ్యవసాయ ఉగ్రవాద జీవిగా (శిలీంద్రం) పరిగణిస్తారు. ఈ శిలీంద్రం ధాన్యం, జొన్న, వరి, గోధుమలలో 'హెడ్ బ్లైట్' అనే వ్యాధిని కలిగిస్తుంది. ఇది పశుపక్ష్యాదులతో పాటు మానవులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇది ఏటా బిలియన్ల డాలర్ల నష్టం కలిగిస్తోంది.
ఫెడరల్ విచారణ ప్రకారం.. జియాన్ చైనా ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ చైనా కమ్యూనిస్ట్ పార్టీకి విశ్వాసంతో ఉన్నట్లు ఆధారాలు గుర్తించారు. ఆమెకు చైనా ప్రభుత్వ మద్దతు, ఆర్థిక సాయం కూడా అందుతున్నదని గుర్తించారు. జియాన్ ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం, వారి విధేయతకు సంబంధించిన డేటా ఉన్నట్లు న్యాయ శాఖ తెలిపింది.
లియూ కూడా అదే శిలీంద్రంపై చైనాలో పరిశోధనలు చేస్తుండగా, డెట్రాయిట్ విమానాశ్రయం ద్వారా అమెరికాలోకి ఫుసారియమ్ గ్రామినేరియమ్ శిలీంద్రాన్ని అక్రమంగా తీసుకొచ్చినట్టు పేర్కొంది. మొదట అతను అబద్ధం చెప్పినప్పటికీ, తరువాత నిజం ఒప్పుకున్నాడని వెల్లడించింది.
వీరిద్దరిపై కుట్ర, అమెరికాలోకి అక్రమ వస్తువుల రవాణా, తప్పుడు సమాచారం, వీసా మోసం వంటి అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ కేసుపై స్పందించిన ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, "ఇది చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎలాగైనా అమెరికన్ వ్యవస్థలను చొరబడి, దేశ ఆహార భద్రతను టార్గెట్ చేస్తోంది అన్నదానికి బలమైన రుజువుగా నిలుస్తుంది," అని అన్నారు.
"మిచిగన్ విశ్వవిద్యాలయంలో ప్రమాదకర ఈ జీవిని ఉపయోగించి ప్రయోగాలు చేయాలన్న కుట్ర, దేశ భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా మారుతుంది" అని ఆయన హెచ్చరించారు. సరిహద్దు భద్రతా విభాగం డైరెక్టర్ మార్టీ రేబాన్ ప్రకారం, ఈ కేసు జాతీయ భద్రతను కాపాడడంలో CBP కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
