ఈ జూన్ అంటే వచ్చేనెలలో పాకిస్తాన్‌కు చైనా నుండి 3.7 బిలియన్ డాలర్ల లోన్ దక్కనుంది. ఈ రుణం చైనా కరెన్సీ యువాన్‌లో ఇవ్వనుండటం విశేషం. ఇలా ఎందుకిస్తున్నారో తెలుసా? 

China Loan to Pakistan : భారత్‌తో సైనిక ఘర్షణల తర్వాత పాకిస్తాన్‌కు చైనా మరోసారి ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ జూన్ నాటికి పాకిస్తాన్‌కు 3.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ.31,584 కోట్ల రూపాయలు) వాణిజ్య రుణం ఇవ్వనుంది. అయితే ఈ  లోన్ మొత్తం చైనా కరెన్సీ యువాన్‌లో ఇవ్వడం విశేషం. డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్న చైనా ఇలా పాక్ కు తమ కరెన్సీలోనే రుణం ఇస్తోంది. 

ఇటీవలే అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి పాకిస్తాన్‌కు 1 బిలియన్ డాలర్ల రుణం లభించింది. దీంతో పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ నిల్వలు 11.4 బిలియన్ డాలర్లకు చేరాయి. చైనా నుంచి లోన్ రావడంతో ఈ నిల్వలు మరింత పెరుగుతాయి. చైనా లోన్ లేకపోతే జూన్ నాటికి పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు 10 బిలియన్ డాలర్లకు పడిపోయేవి. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి విదేశీ మారక నిల్వలను 14 బిలియన్ డాలర్ల వద్ద ఉంచుకోవాలని పాకిస్తాన్ భావిస్తోంది.

పాకిస్తాన్‌పై మొత్తం అప్పు

జూన్ 2024 నాటికి పాకిస్తాన్‌పై మొత్తం 256 బిలియన్ డాలర్ల అప్పు ఉంది. ఇది దేశ జీడీపీలో 67%. దీంట్లో 7.3 లక్షల కోట్ల విదేశీ అప్పు, 14.3 లక్షల కోట్ల దేశీయ అప్పు ఉన్నాయి. డిసెంబర్ 2024 నాటికి చైనా నుండి పాకిస్తాన్ 28.7 బిలియన్ డాలర్లు తీసుకుంది. జూన్ 2025 లో ఇచ్చే 3.7 బిలియన్ డాలర్ల లోన్ తో కలిపితే ఈ మొత్తం 32.4 బిలియన్ డాలర్లకు చేరుతుంది. అంతేకాకుండా డిసెంబర్ 2024 నాటికి సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్‌కు 9.16 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చింది.