ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎక్కడన్నారన్న ప్రశ్న తలెత్తుతోంది.
బంకర్‌లోకి ఖమేనీ
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రస్తుతం తీవ్ర ముప్పు మధ్య ఉన్నట్టు సమాచారం. ఇజ్రాయెల్ దాడులకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఖమేనీ గోప్యంగా బంకర్‌లోకి వెళ్లినట్టు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. ఈ ఘటనలో ఆయనకు ఎటువంటి హాని తలెత్తినా వారసత్వంపై స్పష్టత ఉండేలా ముందస్తు ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తోంది.
అమెరికా మీడియాలో సంచలన నివేదిక
ప్రతిష్ఠాత్మక అమెరికన్ పత్రిక ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, ఖమేనీ తన తరువాత సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టే వ్యక్తులుగా ముగ్గురు సీనియర్ మతపరమైన నేతల పేర్లను పరిశీలనలో పెట్టినట్టు తెలిపింది. వీరిలో అలీరేజా అరాఫీ, అలీ అస్గర్ హెజాజీ, హషీం హుస్సేని బుషారీ ఉన్నారు. ఇందులో ఎవరైనా ఒకరు ఖమేనీ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఖమేనీ తనయుడు రేసులో లేరు
ఇరాన్ రాజకీయాలలో ఇప్పటి వరకూ ఖమేనీ తనయుడు మోజ్తాబా ఖమేనీ పేరు చాలా సార్లు వారసుడిగా వినిపించింది. అయితే తాజా పరిణామాల్లో ఖమేనీ ఎంచుకున్న పేరుల్లో ఆయన కుమారుడి పేరు లేకపోవడం గమనార్హం. దీని వెనుక కారణం ఖమేనీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉండటమేనని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో కూడా కుటుంబ పాలనను ఖండిస్తూ ఆయన ఘాటుగా స్పందించిన దాఖలాలు ఉన్నాయి.
ఎలక్ట్రానిక్ పరికరాలు వద్దన్న ఖమేనీ
అత్యవసర యుద్ధ ప్రణాళికల దృష్ట్యా ఖమేనీ తన సిబ్బందికి పలు సూచనలు ఇచ్చినట్టు సమాచారం. వాటిలో ముఖ్యంగా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు దగ్గరలో ఉండకూడదని, ఆయన ఉన్న ప్రదేశాన్ని గోప్యంగా ఉంచాలన్న ఆదేశాలు ఉన్నాయి. ఇది ఆయనకు ప్రాణ హాని ఉన్న పరిస్థితులను స్పష్టంగా సూచిస్తోంది.
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఘాటు వ్యాఖ్యలు
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ తాజాగా మాట్లాడుతూ, ఖమేనీ బహిరంగంగా బయటకు రాలేని స్థితిలో ఉన్నారని, బంకర్‌లో దాక్కొని ఇజ్రాయెల్ ఆసుపత్రులపై దాడులకు ఆదేశిస్తున్నారని ఆరోపించారు. ఇది యుద్ధ నేరం కిందకు వస్తుందని, ఖమేనీ దీని మూల్యం తప్పక చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నదెవరు?
ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఇప్పటికే ఖమేనీపై దాడికి సంబంధించిన అన్ని చర్యలు ప్రారంభించాయని, ప్రత్యేక ఆపరేషన్లు కూడా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ రాజకీయ భవిష్యత్తుపై అనేక అనుమానాలు, ఊహాగానాలు మొదలయ్యాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఖమేనీ భద్రతకు గట్టి చర్యలు తీసుకోవడమూ, తన తరువాత నాయకుడి ఎంపికపై ముందస్తు పథకాలు రూపొందించడమూ బలమైన రాజకీయ సంకేతాలుగా మారాయి. ప్రస్తుతం ఖమేనీ బంకర్‌లో ఉన్నారా, లేదా ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అన్నదానిపై అధికారిక సమాచారం లేనప్పటికీ... ఈ పరిణామాలు ఇరాన్ సుప్రీం నాయకత్వ మార్పు దిశగా సాగుతున్న సంకేతాలుగా అనిపిస్తున్నాయి.


