చెప్పినట్లే ఇరాన్‌పై అమెరికా దాడి చేసింది. శనివారం రాత్రి ఇరాన్‌లోని అణు కేంద్రాలను లక్ష్యంగా అమెరికా సైన్యం దాడులు చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ సైతం ధృవీకరించింది. ఈ నేపథ్యంలో దాడుల తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియాతో మాట్లాడారు.
ఇరాన్‌పై అమెరికా కౌంటర్ దాడి
శనివారం రాత్రి అమెరికా సైన్యం… ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఆకాశ మార్గం ద్వారా దాడులు నిర్వహించింది. అమెరికా సైన్యం ఉపయోగించిన టెక్నాలజీ, టార్గెట్ సెలక్షన్, వేగం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచాయి. ఇది సాధారణ విమాన దాడి కాదని, కచ్చితమైన మిలిటరీ ప్లానింగ్‌తో చేసిన దాడిగా నిపుణులు చెబుతున్నారు.
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం
దాడి తర్వాత ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. “ఇరాన్‌పై విజయవంతమైన దాడి చేశాం. ప్రపంచంలో మరే దేశం ఇంత కచ్చితంగా దాడి చేయలేదు. ఇది అమెరికా సైనిక విజయానికి సూచిక. ఇప్పుడు ఇరాన్ శాంతికి రావాల్సిందే. లేదంటే మరింత కఠినమైన దాడులు జరుగుతాయి. లక్ష్యాలు ఇంకా చాలానే మిగిలి ఉన్నాయి. వీటి మీద దాడులు మరింత వేగంగా, నైపుణ్యంతో ఉంటాయి.” అని చెప్పుకొచ్చారు.
అమెరికాలో హై అలర్ట్
ఇరాన్ నుంచి ప్రతి దాడి ఉండొచ్చన్న అనుమానాలతో అమెరికా ఇంటెలిజెన్స్ అలర్ట్ అయ్యింది. అమెరికా వ్యాప్తంగా ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో భద్రతా బలగాలు మోహరించాయి.
ముఖ్యమైన మత స్థలాలు, ఇస్లామిక్ సాంస్కృతిక కేంద్రాలు, విదేశీ రాయబార కార్యాలయాల ప్రాంతాల్లో భద్రతను పెంచారు. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, వాషింగ్టన్ డీసీ వంటి నగరాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
రష్యా, చైనా ఎలా స్పందిస్తాయి.?
ఇరాన్ విషయంలో అమెరికా తీరును తప్పు బడుతూ ఇప్పటికే చైనా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక రష్యా సైతం ఇరాన్‌కు తన మద్ధతును చెప్పకనే చెప్పేసింది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా చేసిన దాడులపై రష్యా, చైనా ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తిగా మారింది.
మూడో ప్రపంచ యుద్ధం రానుందా.?
అమెరికా స్పందిస్తున్న తీరుతో మూడో ప్రపంచ యుద్ధం రానుందా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అయితే ప్రస్తుతం మారిన ప్రపంచ ఆర్థిక విధానాల నేపథ్యంలో యుద్ధానికి దేశాలు సహకరిస్తాయా.? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. అయితే రష్యా, చైనా వంటి దేశాలు నేరుగా రంగంలోకి దిగితే మాత్రం పరిస్థితులు చేయి దాటడం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ పరిణామాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి.
