కాదేదీ క‌ల్తీకి అన‌ర్హం అన్న‌ట్లు ప‌రిస్థితి మారింది. కాసుల క‌క్కుర్తి కోసం కొంద‌రు ఎంత‌కైనా దిగ‌జారుగుతున్నారు. తాజాగా హైద‌రాబాద్‌లో వెలుగులోకి వ‌చ్చిన ఓ సంఘ‌ట‌న షాక్‌కి గురి చేస్తోంది.

నకిలీ అల్లంవెల్లుల్లి పేస్ట్

హైద‌రాబాద్‌ల‌లోని బండ్లగూడ పటేల్‌నగర్‌లో జింజర్‌-గార్లిక్‌ పేస్ట్ తయారీ యూనిట్‌పై మంగళవారం పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో మోహమ్మద్ ఫైసల్ (44) అనే వ్యాపారిని అరెస్ట్ చేశారు. అతను హానికరమైన రసాయనాలతో కలిపిన నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేసి అమ్ముతున్నట్టు పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డైంది.

ఇంట్లోనే త‌యారీ ఏర్పాటు

ఫైసల్ నివాసంలో 870 కిలోల నకిలీ పేస్ట్, 4 కిలోల టైటానియం డయాక్సైడ్, 16 కిలోల మోనో సిట్రేట్, 4 కిలోల పసుపు పొడిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. "FK Food Product" అనే బ్రాండ్ పేరుతో ఇంట్లోనే ఈ నకిలీ పేస్ట్‌ను తయారు చేస్తున్నాడు.

ప్ర‌మాద‌క‌ర‌మైన ర‌సాయ‌నాలు

పోలీసుల వివరాల ప్రకారం, ఫైసల్ నకిలీ పేస్ట్‌ను పలు ప్రొవిజన్ స్టోర్లకు, అవసరమైన కస్టమర్లకు నేరుగా సరఫరా చేస్తున్నాడు. ఈ పేస్ట్ తయారీలో ఉపయోగించిన టైటానియం డయాక్సైడ్, పసుపు రంగు, ఇతర రసాయనాలు FSSAI నిబంధనలకు వ్యతిరేకం. ఇవి ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతాయని టాస్క్ ఫోర్స్ అదనపు కమిషనర్ ఆంధ్ర శ్రీనివాసరావు తెలిపారు.

ఈ జాగ్ర‌త్తలు త‌ప్ప‌నిస‌రి

"ఇలాంటి పదార్థాలు ఆరోగ్యానికి హానికరం. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుతూ వ్యక్తిగత లాభాల కోసం నకిలీ ఉత్పత్తులు విక్రయించడం చట్టవిరుద్ధం," అని ఆయన స్పష్టం చేశారు. మార్కెట్లో ఊరుపేరు లేని ప్రొడ‌క్ట్స్‌ను కొనుగోలు చేసే ముందు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.