Appliances: భారీగా పెరగనున్న టీవీ, ఫ్రిడ్జ్, ఏసీల ధరలు.. కారణం ఏంటో తెలుసా.?
భారత ప్రభుత్వం త్వరలోనే కొత్త ఈ వేస్ట్ పాలసీని తీసుకొచ్చేందుకు అడుగులు వేస్తోంది. ఈ నిర్ణయంపై పలు ఎలక్ట్రానిన్ సంస్థలు న్యాయ పోరాటానికి దిగాయి. ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొస్తే వస్తువుల ధరలు భారీగా పెంచాల్సి వస్తాయని చెబుతున్నాయి.

ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్న కంపెనీలు
భారత ప్రభుత్వం అమలు చేయబోతున్న కొత్త ఈ-వేస్ట్ పాలసీపై దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీలు ఎల్జీ (LG), సామ్‌సంగ్ వంటి కంపెనీలు న్యాయపరంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ పాలసీ ప్రకారం, ఎలక్ట్రానిక్ పరికరాలను రీసైకిల్ చేసే సంస్థలకు కంపెనీలు కిలోకు రూ. 22 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
మూడింతలు కానున్న వ్యయం
ఈ విధానం అమల్లోకి వస్తే కంపెనీలపై రీసైక్లింగ్ వ్యయం మూడు రెట్లు పెరగనుందని, దీని ప్రభావం ఉత్పత్తుల ధరలపై పడే అవకాశం ఉందని కంపెనీలు కోర్టు ముందుకు వెళ్లాయి. మరీ ముఖ్యంగా టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి పెద్ద ఎలక్ట్రానిక్స్ పై సంస్థలు భారీగా ధరలు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఈ-వేస్ట్ దేశంగా
భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఈ-వేస్ట్ ఉత్పత్తిదారుగా ఉంది. కానీ ఇందులో ఎక్కువ శాతం అనధికార రీసైక్లింగ్ ద్వారా జరుగుతుంది. కొత్త పాలసీలో ఈ నిబంధనల వల్ల వ్యయ భారం కంపెనీలపై పడుతుంది కానీ, నిషిద్ధ రీసైక్లింగ్‌పై మాత్రం ప్రభావం తక్కువగా ఉంటుందని కంపెనీలు వాదిస్తున్నాయి.
ధరలు ఎంత పెరగనున్నాయి.?
కొత్త ఈ వేస్ట్ పాలసీ అమల్లోకి వస్తే టీవీల ధరలు గరిష్టంగా రూ. 3 వేల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక ఫ్రిజ్‌ల విషయానికొస్తే రూ. 1500 నుంచి రూ. 3 వేల వరకు పెరుగుతాయి. వాషింగ్ మెషీన్లు, ఏసీలు రూ. 2 వేలకిపైగా ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వచ్చే 2 నుంచి 3 నెల్లో ఈ ధరలు అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. దసరా, దీపావళి సీజన్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే వారి జేబులకు చిల్లు
కంపెనీల వాదన ఏంటంటే.?
కొత్త పాలసీ వల్ల కస్టమర్లపై ఆర్థిక భారం పడుతుందని ఎల్జీ, సామ్‌సంగ్ వంటి కంపెనీలతో పాటు డైకిన్, టాటా వోల్టాస్, హావెల్స్, బ్లూస్టార్ వంటి కంపెనీలు వాదిస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే కోర్టులో పిటిషన్స్ వేశాయి కూడా. కంపెనీలు తమ లాభాలు తగ్గించుకోవాలి లేదా వినియోగదారులపై భారం మోపాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వం ఏమంటోంది?
భారత ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా పర్యావరణ పరిరక్షణ, ఈ-వేస్ట్ నిర్వహణ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, కంపెనీల వ్యాజ్యాలపై అధికారిక స్పందన ఇంకా రాలేదు. మరి ఎలక్ట్రానిక్ సంస్థల వాదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా.? అసలేం జరగనుందో చూడాలి.