వేసవికాలంలో మొక్కలు వాడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎండల నుంచి మొక్కలను కాపాడుకోవాలంటే కేవలం నీళ్లు పోస్తే సరిపోదు, వాటికి సరైన పోషణ కూడా కావాలి. నీటిలో ఈ ఒక్కటి కలిపి మొక్కలకు చల్లడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అదేంటో తెలుసుకోండి.

ఎండాకాలం వచ్చిందంటే చాలు, ఇంట్లో మొక్కలకి కష్టాలు మొదలైనట్టే. మట్టి త్వరగా ఆరిపోవడం, ఆకులు రాలిపోవడం, పురుగులు పట్టడం, వేర్లు బలహీనపడటం లాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి టైంలో కేవలం మామూలు నీళ్లు పోస్తే మొక్కల అవసరాలు తీరవు. వేసవిలో బాగా పనిచేసే ఒక సింపుల్ చిట్కా పటిక నీళ్లు. ఇవి మట్టిని చల్లబరుస్తాయి, బ్యాక్టీరియాను అడ్డుకుంటాయి, మొక్కల వేర్లను తిరిగి యాక్టివ్ చేస్తాయి. ఈ చిన్న హ్యాక్‌తో మీ ఇంటి తోట ఎండాకాలంలో కూడా పచ్చగా, తాజాగా ఉంటుంది.

హీట్ స్ట్రెస్ దూరం, మట్టికి వెంటనే చల్లదనం

వేసవిలో కుండీల్లోని మట్టి ఎంతలా వేడెక్కుతుందంటే, వేర్లు మాడిపోయే ప్రమాదం ఉంటుంది. పటిక కలిపిన నీళ్లు మట్టి ఉష్ణోగ్రతను వేగంగా తగ్గిస్తాయి. ఇది మట్టిలో చల్లదనాన్ని, తేమను నిలిపి ఉంచుతాయి. దీనివల్ల మొక్కలు పగటిపూట ఎండను తట్టుకోగలుగుతాయి. ఉదయం 7–9 గంటల మధ్య లేదా సాయంత్రం 6–7 గంటల మధ్య వాతావరణం చల్లబడ్డాక నీళ్లు పోయడం మంచిది.

 ఫంగస్, పురుగులకు చెక్

వేడి వాతావరణంలో పురుగులు, ఫంగస్ చాలా వేగంగా పెరుగుతాయి. ముఖ్యంగా తెల్ల బూజు, చిన్న ఈగలు, మట్టిలోని సూక్ష్మక్రిములు ఎక్కువవుతాయి. పటిక నీళ్లు మట్టి పైపొరను శుభ్రం చేసి, ఎలాంటి కెమికల్స్ వాడకుండానే పురుగులు పెరగకుండా ఆపుతాయి. తులసి, మనీ ప్లాంట్, అలోవెరా, వాము, గులాబీ, ఇతర మొక్కలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది.

ఉప్పు నీటి ప్రభావం 

ఎండాకాలంలో కుళాయి నీళ్లు కాస్త ఉప్పగా లేదా, కఠినంగా రావచ్చు. వీటిని పోసినప్పుడు మట్టి క్షారంగా మారి, మొక్కలు పోషకాలను సరిగ్గా తీసుకోలేవు. పటిక నీళ్లు ఈ సమస్యను తగ్గించి, మట్టిని సమతుల్యంగా ఉంచుతాయి. దీంతో ఆకులు పసుపు రంగులోకి మారకుండా ఉంటాయి.

వేర్లు కుళ్లిపోకుండా రక్షణ

వేసవిలో చాలామంది మొక్కలకు ఎక్కువ నీళ్లు పోస్తుంటారు. దీనివల్ల వేర్లు కుళ్లిపోయే సమస్య వస్తుంది. పటిక నీళ్లు మట్టిని గుల్లగా మార్చి, అదనపు నీరు సులభంగా బయటకు పోయేలా చేస్తాయి. దీంతో వేర్లు సురక్షితంగా ఉంటాయి. రోజూ నీళ్లు పోసే అలవాటు ఉన్నవారికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది.

ఆకులు వాడిపోకుండా..

ఎండకు ఆకులు వాడిపోయి, మాడిపోవడం వేసవిలో పెద్ద సమస్య. పటిక నీటిని ఆకులపై లైట్‌గా స్ప్రే చేస్తే దుమ్ము, జిడ్డు వదిలిపోతాయి. ఆకులు ఎండను తట్టుకోగలుగుతాయి. ఈ పద్ధతి మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్, పీస్ లిల్లీ లాంటి మొక్కలకు చక్కగా పనిచేస్తుంది.