మీ ఇంట్లో బాల్కనీ మరీ చిన్నగా ఉందా? మొక్కలు ఎలా పెంచాలి అని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసమే ఈ ఐడియాస్. వీటితో అపార్ట్‌మెంట్లలో ఉండే తక్కువ స్థలంలోనే అందమైన పూల తోటను సృష్టించవచ్చు. మరి ఆ అద్భుతమైన చిట్కాలేంటో తెలుసుకోండి.
Small Balcony Gardening Ideas: ఈ రోజుల్లో అపార్ట్‌మెంట్లలో బాల్కనీలు చాలా చిన్నగా ఉంటున్నాయి. ఇద్దరు ముగ్గురు నిల్చోవడమే కష్టం. అలాంటిది ఇక మొక్కలు పెంచడం కలే అనుకుంటాం. మీరు కూడా ఇలాగే అనుకుంటే పొరపాటు పడినట్టే. కొంచెం తెలివిగా ఆలోచిస్తే తక్కువ స్థలంలో కూడా అదిరిపోయే గార్డెన్ క్రియేట్ చేయవచ్చు. ముఖ్యంగా వర్టికల్ స్పేస్‌ను (నిలువుగా ఉండే ఖాళీ జాగా) వాడుకుంటే ఈ పని ఇంకా ఈజీ అవుతుంది. అందుకోసం 5 ఐడియాస్ ఉన్నాయి. అవేంటో చూద్దాం.

స్టాండ్ లేదా గోడను వాడటం
నేల మీద కుండీలు పెట్టే బదులు, స్టాండ్‌లు లేదా గోడలను వాడాలి. యూరోపియన్ స్టైల్ 'లాడర్ గార్డెనింగ్' (నిచ్చెన మీద మొక్కలు పెంచడం) కూడా ట్రై చేయవచ్చు. ఇది స్థలాన్ని ఆదా చేయడమే కాకుండా, ఇంటికి క్రియేటివ్ లుక్ ఇస్తుంది.
వాల్ ప్లాంటర్లు బెస్ట్ ఆప్షన్
చిన్న ఇళ్ల కోసం వాల్ ప్లాంటర్లు ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యాయి. వీటిని నేరుగా గోడకే తగిలించుకోవచ్చు. ఆన్ లైన్‍తో పాటు దగ్గర్లోని మార్కెట్లలో కూడా ఇవి రకరకాల డిజైన్లలో దొరుకుతాయి.
హ్యాంగింగ్ పాట్స్ లో మొక్కలు

తక్కువ స్థలానికి హ్యాంగింగ్ పాట్స్ ఒక మంచి ఎంపిక. బాల్కనీ పైకప్పుకు లేదా రెయిలింగ్‌కు కుండీలను వేలాడదీయవచ్చు. ఈ మధ్య హుక్స్ ఉన్న కుండీలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. మీరు కూడా వీటిని ట్రై చేయవచ్చు.
రెయిలింగ్ ప్లాంటర్స్ వాడకం
బాల్కనీలో స్థలం ఎక్కువగా లేనప్పుడు, రెయిలింగ్‌పై మొక్కలు పెట్టుకోవచ్చు. దీనివల్ల కింద నేల ఖాళీగా ఉంటుంది, ఫ్లాట్ లుక్ కూడా చాలా బాగుంటుంది.
పొడవాటి ప్లాంటర్ల వాడకం
ఒకటి రెండు కుండీలు పెట్టేంత ప్లేస్ ఉంటే, చిన్న చిన్న కుండీలకు బదులు పొడవాటి ప్లాంటర్లు వాడుకోవచ్చు. వీటిలో ఒకేసారి చాలా మొక్కలు పెట్టొచ్చు. దీంతో తక్కువ స్థలంలోనే చిన్న గార్డెన్ రెడీ అయిపోతుంది.
గార్డెనింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బాల్కనీలో మొక్కలు పెట్టడమే కాదు, వాటిని అందంగా సర్దడం కూడా ముఖ్యమే. మొక్కలను వాటి సైజును బట్టి చిన్న, పెద్ద, మీడియం అని విభజించాలి. చిన్న మొక్కలను ముందు వైపు పెడితే, అన్ని మొక్కలకూ ఎండ తగులుతుంది, చూడటానికి కూడా అందంగా ఉంటుంది.
బాల్కనీలోకి ఎండ ఎక్కువగా వస్తుంటే, పెద్ద మొక్కలను ముందు పెట్టి నీడను క్రియేట్ చేయవచ్చు. దీనివల్ల చిన్న మొక్కలు వాడిపోకుండా ఉంటాయి. వీలైతే, నేల మీద ఒక మ్యాట్ వేసుకోవచ్చు. ఇది వేడిని తగ్గిస్తుంది.
మొత్తం మీద, బాల్కనీ చిన్నగా ఉందని పచ్చదనాన్ని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న స్థలాన్ని సరిగ్గా వాడుకుంటే, చిన్న బాల్కనీని కూడా అందమైన తోటగా మార్చేయవచ్చు.


