నూనెలు, షాంపూలను మార్చినా జుట్టు ఎందుకు ఊడిపోతుంది?
జుట్టు రాలకుండా ఉండటానికి రకరకాల ఖరీదైన షాంపూలను, నూనెలను మారుస్తుంటారు. అయినా జుట్టు రాలడం మాత్రం ఆగదు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?
hair fall
ఒక్క ఆడవారికే కాదు.. మగవారికి కూడా జుట్టు బాగా రాలుతుంటుంది. దీనివల్ల మగవారికి బట్టతల వస్తే.. ఆడవారికి నెత్తి పల్చగా అవుతుంది. ఈ రోజుల్లో జుట్టు రాలడం కామన్ సమస్యగా మారిపోయింది. జుట్టు రాలడానికి చలి లేదా వాన, కాలుష్యమే కారణమని అనుకుంటాం. కానీ జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జుట్టు రాలడానికి అసలు కారణాలను తెలుసుకుంటేనే.. దీన్ని ఆపగలమంటారు నిపుణులు. అసలు ఆడవారికి జుట్టు ఎందుకు రాలుతుంది? ఇది తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
hair fall
జెనెటిక్స్
జెనెటిక్స్ వల్ల కూడా చాలా మందికి జుట్టు విపరీతంగా రాలుతుంది. జెనెటిక్స్ వల్ల జుట్టు రోజు రోజుకు సన్నబడుతుంటుంది. అలాగే నుదురు నుంచి జుట్టు వెనక్కి తగ్గడం మొదలవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జన్యుపరంగా వచ్చే హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించడం చాలా కష్టం. మీ ఇంట్లో ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే అది మీక్కూడా వచ్చే అవకాశం ఉంది.
హార్మోన్ల మార్పులు
ఆడవారికి జుట్టు రాలడానికి మరొక ప్రధాన కారణం.. హార్మోన్ల మార్పులు. ముఖ్యంగా ఈ హార్మోన్ల మార్పులు ప్రెగ్నెన్సీ, ప్రసవం సమయంలో ఎక్కువగా ఉంటాయి. నిపుణుల ప్రకారం.. ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవారి శరీరంలో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల జుట్టు విపరీతంగా రాలుతుంది. ఇది సర్వ సాధారణ విషయం. డెలివరీ తర్వాత కూడా ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉంది.
మెనోపాజ్ : నిపుణుల ప్రకారం.. ఆడవారికి మెనోపాజ్ టైంలో కూడా జుట్టు బాగా ఊడిపోతుంది. ఈ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు బాగా తగ్గుతాయి. దీంతో మీ జుట్టు రాలడం మొదలవుతుంది.
థైరాయిడ్ సమస్యలు: థైరాయిడ్ సమస్యలున్న వారు కూడా హెయిర్ ఫాల్ సమస్యను ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. నిపుణుల ప్రకారం.. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం ఈ రెండు సమస్యలు కూడా జుట్టు రాలేలా చేస్తాయి.
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్: నిపుణుల ప్రకారం.. పాలిసిస్టిక్ ఓవర్ సిండ్రోమ్ సమస్యతో బాధపడే ఆడవారికి కూడా జుట్టు విపరీతంగా రాలుతుంది. ఈ సమస్య వల్ల ఆడవారిలో హార్మోన్ల అసమతుల్యత ఎక్కువగా ఉంటుంది. ఇది మీ జుట్టు బాగా రాలేలా చేస్తుంది.
hair fall
పోషకాల లోపం: ఇనుము , ప్రోటీన్లు, రక్తహీనత వల్ల కూడా ఆడవారికి బాగా జుట్టు రాలుతుందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు బాగా పెరగాలంటే ప్రోటీన్లు చాలా చాలా అవసరం. అలాగే విటమిన్-డి, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్లు, జింక్ లోపం వల్ల కూడా జుట్టు బాగా రాలుతుంది.
మందులు: ఆరోగ్య నిపుణుల ప్రకారం.. జనన నియంత్రణ మాత్రలు కూడా జుట్టు రాలేలా చేస్తాయి. కొన్ని రకాల గర్భనిరోధక మాత్రలను వాడితే ఖచ్చితంగా జుట్టు రాలుతుంది. అలాగే కొన్ని రకాల హైబీపీ మందులు కూడా జుట్టు ఊడిపోయేలా చేస్తాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి.
ఒత్తిడి: ఒత్తిడి చిన్న సమస్యగా కనిపించినా దీనివల్ల కూడా జుట్టు బాగా రాలుతుంది. అలాగే శస్త్రచికిత్స, అనారోగ్య సమస్యల వల్ల కూడా జుట్టు రాలుతుంది.
hair fall
జుట్టు సంరక్షణ: జుట్టు సంరక్షణ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా జుట్టు రాలుతుంది. అంటే షాంపూను ఎక్కువగా పెట్టడం, హెయిర్ స్ట్రెయిటనర్, హెయిర్ డ్రైయ్యర్ వంటి వాటిని ఎక్కువగా ఉపయోగించడం, టైట్ హెయిర్ స్టైల్స్, రసాయన చికిత్సల వల్ల కూడా జుట్టు బాగా దెబ్బతింటుంది. అలాగే అలోపేసియా అరేటా, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు కూడా హెయిర్ ఫాల్ కు కారణమవుతాయి.
జుట్టు రాలడం తగ్గాలంటే ఏం చేయాలి?
ఆరోగ్యకరమైన ఆహారం - మీ జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే మాత్రం మీరు విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండే సమతుల్య ఆహారాన్ని తినాలి.
ఒత్తిడి నిర్వహణ- ఒత్తిడి వల్ల జుట్టు బాగా రాలుతుంది. ఇలా కాకూడదంటే మాత్రం మీరు ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా చేయాలి. ధ్యానం లేదా ఇతర ఒత్తిడిని తగ్గించే పద్దతులను ఫాలో కావాలి.
మంచి నిద్ర: నిద్రకూడా జుట్టు ఊడిపోకుండా చేయడానికి సహాయపడుతుంది. ఇందుకోసం మీరు ప్రతిరోజూ రాత్రి 8 నుంచి 9 గంటల పాటు బాగా నిద్రపోవాలి.
హెయిర్ కేర్: జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే జుట్టును టైట్ గా వేయకూడదు. అలాగే హీటింగ్ టూల్స్ ను ఎక్కువగా యూజ్ చేయకూడదు. ముఖ్యంగా నేచురల్ ప్రొడక్ట్స్ నే వాడాలి.
వ్యాయామం - వ్యాయామం మీ శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. జుట్టుకు కూడా మంచి మేలు జరుగుతుంది. ఇందుకోసం ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలైనా వ్యాయామం చేయాలి.