Skin Care: ఈ టవల్ ట్రిక్ ట్రై చేస్తే...జీవితంలో మీ ముఖంపై బ్లాక్ హెడ్స్ రావు
Skin Care: ముఖంపై బ్లాక్‌హెడ్స్ కనిపించగానే ఫేషియల్స్, స్క్రబ్స్ అంటూ ఏవేవో ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇంట్లో ఉండే చిన్న టవల్‌తో ఈ సమస్యను తగ్గించుకునే వీలుంది. అసలు టవల్‌తో బ్లాక్‌హెడ్స్‌కు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసుకుందాం.

బ్లాక్ హెడ్స్ తో ఇబ్బంది పడుతున్నారా?
ముఖంపై ముఖ్యంగా ముక్కు, గడ్డం, నుదురు భాగాల్లో కనిపించే బ్లాక్ హెడ్స్ చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. వీటినే బ్లాక్‌హెడ్స్ అంటారు. వీటిని తొలగించుకోవడానికి ఫేషియల్స్, పీలింగ్ స్ట్రిప్స్, రకరకాల స్క్రబ్స్ ఉపయోగిస్తుంటారు. అయితే ఇవేవీ చేయకుండానే ఈజీగా బ్లాక్ హెడ్స్ తీసేయొచ్చు. ఇంట్లో ఉండే టవల్‌తో కూడా చర్మాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ చలికాలంలో ఈ చిట్కా బాగా యూజ్ అవుతుంది. దీన్ని ఎలా ఉపయోగించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
అసలు బ్లాక్‌హెడ్స్ ఎందుకు వస్తాయి?
చర్మంపై ఉండే రంధ్రాల్లో సహజంగా సెబమ్ అనే నూనె ఉత్పత్తి అవుతుంది. దీనికి మృత కణాలు కూడా తోడైతే హెయిర్ ఫాలికల్స్‌లో పేరుకుపోతాయి. ఇలా రంధ్రాలు మూసుకుపోకుండా పైభాగం తెరిచి ఉన్నప్పుడు బ్లాక్‌హెడ్స్ ఏర్పడతాయి. అందులోని పదార్థాలు ఆక్సీకరణ చెంది నల్లగా కనిపిస్తాయి. అందుకే వీటిని ఓపెన్ కామెడోన్స్ అని కూడా పిలుస్తారు.
ముఖ్యంగా ముక్కు, నుదురు, గడ్డం ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఈ భాగాల్లో సెబమ్ ఉత్పత్తి ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. జన్యుపరమైన అంశాలు, హార్మోన్ల మార్పులు, చర్మానికి సరిపడని కొన్ని కాస్మెటిక్ ఉత్పత్తులు కూడా బ్లాక్‌హెడ్స్ ఏర్పడటానికి కారణమవుతాయి.
వేడి నీళ్ల టవల్‌తో బ్లాక్‌హెడ్స్ ఎలా తొలగించాలి?
ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి
ముందుగా మీ చర్మానికి సరిపోయే సున్నితమైన ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల మేకప్, సన్‌స్క్రీన్, అదనపు నూనె, దుమ్ము తొలగిపోతాయి. చర్మాన్ని పొడిబార్చే గట్టి సబ్బులు, ఎక్కువ రాపిడి కలిగించే క్లెన్సర్లకు దూరంగా ఉండాలి.
టవల్‌ను గోరువెచ్చని నీటిలో ముంచాలి
శుభ్రమైన కాటన్ టవల్‌ను గోరువెచ్చని నీటిలో ముంచి బయటకు తీయాలి. అందులోని అదనపు నీటిని పిండేయాలి. టవల్ తడిగా ఉండాలి కానీ నీరు కారకూడదు. మరీ వేడిగా ఉందో లేదో చూసుకోవాలి.
ముఖంపై టవల్ ఉంచాలి
బ్లాక్‌హెడ్స్ ఎక్కువగా కనిపించే ముక్కు, గడ్డం ప్రాంతాలపై ఈ టవల్‌ను మెల్లగా ఉంచాలి. కొద్దిసేపు అలాగే ఉంచాలి. ఈ సమయంలో టవల్‌తో ముఖాన్ని గట్టిగా రుద్దకూడదు. వేడి, తేమ వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
ముఖాన్ని మళ్లీ శుభ్రం చేసుకోవాలి
టవల్ తొలగించిన తర్వాత వేళ్లతో ముఖాన్ని సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. అనంతరం గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. చర్మంపై ఉన్న మురికి, నూనెను తొలగించుకోవడమే ఈ దశ ముఖ్య ఉద్దేశం. బ్లాక్‌హెడ్స్‌ను గోళ్లతో నొక్కి బయటకు తీయడానికి ప్రయత్నించకూడదు.
మాయిశ్చరైజర్ రాసుకోవాలి
ముఖాన్ని శుభ్రమైన టవల్‌తో మెల్లగా తుడుచుకున్న తర్వాత తేలికపాటి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. రంధ్రాలను మూసుకుపోని నాన్-కామెడోజెనిక్ మాయిశ్చరైజర్ ఎంచుకోవడం మంచిది. చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే ఈ దశను తప్పనిసరిగా పాటించాలి.
వేడి టవల్ చిట్కా నిజంగా పనిచేస్తుందా?
వేడి టవల్ వల్ల చర్మానికి తేమ అందుతుంది. చర్మంపై పేరుకున్న నూనె, మురికి కొంత మృదువుగా మారి శుభ్రం చేసుకోవడం సులభమవుతుంది. అయితే లోతుగా పేరుకుపోయిన బ్లాక్‌హెడ్స్‌పై ఈ పద్ధతి పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. అలాంటి సమస్య ఉన్నవారికి చర్మ వైద్యులు సాలిసిలిక్ యాసిడ్, టాపికల్ రెటినాయిడ్స్ వంటి చికిత్సలను చేయించుకోవచ్చు. సాలిసిలిక్ యాసిడ్ చర్మ రంధ్రాల్లో పేరుకున్న మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. రెటినాయిడ్స్ చర్మ కణాల పునరుత్పత్తి ప్రక్రియను మెరుగుపరుస్తాయి. అయితే వీటిని వైద్యుల సూచన మేరకే ఉపయోగించడం మంచిది. కాబట్టి వేడి టవల్‌ను బ్లాక్‌హెడ్స్‌కు పూర్తి చికిత్సగా కాకుండా సాధారణ చర్మ సంరక్షణలో ఒక అదనపు పద్ధతిగా మాత్రమే చూడాలి.
ఈ తప్పులు అస్సలు చేయకూడదు
వేడి టవల్ చిట్కాను ప్రయత్నించేటప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరీ వేడి నీళ్లు వద్దు. మంట, ఎర్రదనం, చికాకు పుట్టొచ్చు. బ్లాక్‌హెడ్స్‌ను గిల్లకూడదు. గట్టి స్క్రబ్స్ వాడకూడదు. అతిగా స్టీమింగ్ చేయకూడదు. మాయిశ్చరైజర్ మర్చిపోవద్దు.















