Sweaters: స్వెట్టర్లు, హుడీలు ఎలా ఉతుకుతున్నారు? ఈ తప్పులు అస్సలు చేయకండి
Sweaters: చలికాలంలో స్వెటర్లు, జాకెట్లు, హూడీలు ఎక్కువగా వేసుకుంటారు. అయితే వీటిని శుభ్రం చేసే విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. తెలియక చేసే చిన్న పొరపాట్లే వాటిని పాడు చేస్తాయి. మరి వాటిని పాడవకుండా ఎలా ఉతకాలి?

వేడి నీళ్లతో స్వెటర్ ఉతకడం
ఉన్ని బట్టలు ఉతికేటప్పుడు చాలా మంది చేసే మొదటి తప్పు వేడి నీళ్లను వాడటం. మురికి, మరకలు పోవాలని స్వెటర్లను ఎక్కువ వేడి నీళ్లలో నానబెట్టడం మంచిది కాదు. దీనివల్ల ఉన్ని దారాల అమరిక దెబ్బతిని, బట్టలు ముడుచుకుపోతాయి. అలాగే వాటి మృదుత్వం కూడా పోతుంది. కొన్ని బట్టల రంగు కూడా వెలిసిపోవచ్చు. కాబట్టి బట్టల కేర్ లేబుల్ చూసి, దానికి తగ్గట్లుగా చల్లటి నీళ్లు లేదా గోరువెచ్చని నీళ్లను వాడాలి.
స్వెటర్‌ను పిండి ఆరబెట్టడం
ఉతికిన తర్వాత స్వెటర్లోని నీళ్లు పోవాలని గట్టిగా పిండకూడదు. ముఖ్యంగా చేత్తో అల్లిన స్వెటర్లను గట్టిగా పిండితే వాటి దారాలు వదులై ఆకారం మారిపోతుంది. అలాగే తడిగా ఉన్న స్వెటర్‌ను హ్యాంగర్‌కు తగిలిస్తే, ఆ బరువుకి అది సాగిపోయే ప్రమాదం ఉంది. దీనికి బదులుగా ఓ శుభ్రమైన వస్త్రంపై స్వెటర్‌ను ఉంచి, మెల్లగా నొక్కుతూ అదనపు నీటిని తీసేయాలి. ఆ తర్వాత దాన్ని ఒక వల లేదా పొడి వస్త్రంపై ఫ్లాట్‌గా ఆరబెట్టాలి.
సాధారణ వాషింగ్ పౌడర్ వాడటం
అన్ని రకాల బట్టలకూ ఒకే వాషింగ్ పౌడర్ వాడటం సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా ఉన్ని బట్టలపై ఎక్కువ కెమికల్స్ ఉండే డిటర్జెంట్లు వాడితే అవి పాడవుతాయి. దీనివల్ల బట్టల మృదుత్వం తగ్గి, దారాల ఆకృతి దెబ్బతింటుంది. కాబట్టి ఉన్ని బట్టల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మైల్డ్ లిక్విడ్ డిటర్జెంట్ మాత్రమే వాడటం మంచిది. డిటర్జెంట్ ఎక్కువ వేయకుండా, వాడే విధానాన్ని సరిగ్గా పాటించాలి.
వాషింగ్ మెషీన్లో తప్పు సెట్టింగ్ వాడటం
స్వెటర్లను వాషింగ్ మెషీన్లో ఉతికేటప్పుడు స్పిన్ స్పీడ్ ఎక్కువగా పెట్టడం మరో పెద్ద తప్పు. దీనివల్ల బట్టల ఆకారం మారడంతో పాటు దారాలు కూడా దెబ్బతింటాయి. అందుకే ఉతికే ముందు బట్టలకున్న కేర్ లేబుల్ తప్పక చదవాలి. మెషీన్ వాష్‌కి అనుమతి ఉంటేనే, ఉన్ని బట్టలకు సరిపడే జెంటిల్ వాష్ సెట్టింగ్ పెట్టుకోవాలి. హై స్పీడ్‌లో స్పిన్ చేయడం కచ్చితంగా మానుకోవాలి.
బ్రష్ పెట్టి గట్టిగా రుద్దడం
స్వెటర్‌పై పడిన మరకలను వదిలించడానికి బ్రష్‌తో గట్టిగా రుద్దితే బట్ట పైపొర దెబ్బతింటుంది. దారాలు బయటకు వచ్చి చిన్న చిన్న ఉండల్లా మారిపోతాయి. దీంతో స్వెటర్ పాతదానిలా కనిపిస్తుంది. కాబట్టి మరక పడిన చోట మెత్తటి వస్త్రంతో జాగ్రత్తగా తుడవాలి. ఎక్కువగా రుద్దడం మానుకోవాలి. ఈ ఐదు తప్పులు చేయకుండా, బట్టల కేర్ లేబుల్స్ పాటిస్తే మీ స్వెటర్లు, ఉన్ని బట్టలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.















