Kitchen Tips: గోధుమ పిండికి పురుగులు పట్టకుండా ఉండాలంటే ఇలా చేస్తే చాలు!
మనలో చాలామంది చపాతీలను రెగ్యులర్ గా తింటుంటారు. అందుకోసం కేజీల కొద్ది గోధుమ పిండిని కొనుగోలు చేస్తుంటారు. సాధారణంగా గోధుమ పిండికి త్వరగా పురుగులు పడుతుంటాయి. మరి పురుగులు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.

Protect Flour From Insects
రెగ్యులర్ గా చపాతీ తినేవారు.. ఎక్కువ మొత్తంలో గోధుమ పిండిని కొని నిల్వ చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఆ పిండికి పురుగులు పడుతుంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా పురుగుల బాధ తప్పదు. కొన్ని చిట్కాలతో పురుగుల సమస్యకు చెక్ పెట్టవచ్చు. గోధమ పిండిని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవచ్చు. ఆ చిట్కాలేంటో ఓసారి చూద్దామా..
ఎండలో ఆరబెట్టాలి
గోధుమ పిండిలో ఏదైనా వింత వాసన లేదా పిండి పాతదిగా అనిపిస్తే, దాన్ని కలిపే ముందు జల్లెడ పట్టండి. దానిలో పురుగులు ఉంటే బయటకు వచ్చేస్తాయి.
గోధుమ పిండిని వారానికి 1-2 సార్లు ఎండలో ఆరబెట్టాలి. తేమ ఉంటే పురుగులు పట్టే అవకాశం ఉంటుంది. పిండిలో పురుగులు కనిపించిన వెంటనే ఎండలో ఆరబెడితే ఆ సమస్య దూరం అవుతుంది.
ఉప్పుతో..
ఇంట్లో తయారుచేసిన పిండి అయినా లేదా దుకాణంలో కొన్న పిండి అయినా దానిలో 2-3 స్పూన్ల ఉప్పు కలిపి ఉంచాలి. ఇలా చేస్తే తెల్ల పురుగుల బెడద తగ్గుతుంది. కావాలంటే ఒక చిన్న క్లాత్ లో ఉప్పు కట్టి పిండిలో వేసి ఉంచండి. ఇలా చేస్తే పిండి చాలా రోజులవరకు పాడవకుండా తాజాగా ఉంటుంది.
వేపాకు
వేపాకును ఎండలో ఆరబెట్టి.. ఆ తర్వాత ఒక క్లాత్ లో కట్టి గోధుమ పిండి ఉన్న డబ్బాలో వేయండి. పిండికి పురుగులు పట్టకుండా ఉంటాయి.
లవంగాలు
గోధుమ పిండి డబ్బాలో కొన్ని లవంగాలు వేయండి. లవంగాలు ఫంగస్ నిరోధక, బాక్టీరియా నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని పిండిలో వేసినప్పుడు పురుగులు రాకుండా నిరోధిస్తాయి.
ఇంగువ
ఇంగువ వాసన పురుగులకు నచ్చదు. కాబట్టి గోధుమ పిండి ఉన్న డబ్బాలో ఇంగువ వేసి ఉంచండి. అలాగే వెల్లుల్లిని తొక్క తీసి గోధుమ పిండి డబ్బాలో వేస్తే పురుగుల సమస్యకు చెక్ పెట్టవచ్చు.
బిర్యాని ఆకు
గోధుమ పిండిని ఎప్పుడూ గాలి చొరబడని ప్లాస్టిక్ డబ్బాలో నిల్వ చేయాలి. అందులో బిర్యానీ ఆకు వేస్తే వర్షాకాలంలో పురుగులు రాకుండా నివారించవచ్చు.
గడువు తేదీని తనిఖీ చేయాలి
దుకాణాల్లో గోధుమ పిండి కొనేటప్పుడు ముందుగా గడువు తేదీని చెక్ చేయాలి. అలాగే 5-10 కిలోల పిండిని ఒకేసారి కొనకూడదు. అవసరానికి తగ్గట్టుగా లేదా తక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం మంచిది. గోధుమ పిండిని ఫ్రిజ్‌లో ఉంచితే కూడా ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.