చెవిలోకి చీమలు, పురుగులు వెళ్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మాటల్లో చెప్పలేము. అవి బయటకు వచ్చే వరకు నరకం కనిపిస్తుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో వాటిని ఈజీగా బయటకు రప్పించవచ్చు. మరి ఆ చిట్కాలేంటో చూసేయండి.
సాధారణంగా మనం నిద్రపోయినప్పుడు లేదా కాస్త ఆదమరిచి ఉన్నప్పుడు చెవిలోకి చీమలు, పురుగులు వెళ్తుంటాయి. చెవిలోకి ఇలా పురుగులు వెళ్తే.. ఆ నొప్పి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము. పెద్దవాళ్లు కాస్త నొప్పిని ఓర్చుకున్నా.. పిల్లలు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. నొప్పిని తట్టుకోలేక ఏడుస్తారు. అయితే కొన్నిసింపుల్ చిట్కాలతో చెవిలోకి దూరిన చీమలు, పురుగులను బయటకు రప్పించవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.
చెవిలోకి చీమ వెళ్తే ఏం చేయాలి?
1. ముందుగా చీకటి గదిలోకి వెళ్లి చెవిలో లైట్ వేయాలి. వెలుతురుకి పురుగులు బయటకి వచ్చేస్తాయి.
2. గోరువెచ్చని నీళ్లలో కొంచెం ఉప్పు కలిపి 2-3 చుక్కలు చెవిలో వేయాలి. ఉప్పు నీరు చీమలకి, పురుగులకి చిరాకు తెప్పిస్తుంది. దాంతో అవి వెంటనే బయటకి వచ్చేస్తాయి.
3. ఆలివ్ ఆయిల్ లేదా బేబీ ఆయిల్ చుక్కలు చెవిలో వేస్తే పురుగులు బయటకి వచ్చేస్తాయి.
చేయకూడనివి!
- చెవిలోకి చీమ, పురుగు వెళ్తే చెవిలో వేలు పెట్టకూడదు. దానివల్ల చెవి నొప్పి వస్తుంది కానీ.. చీమ బయటకి రాదు.
- కార్ కీ, బడ్స్, పిన్ను లాంటివి చెవిలో పెట్టి పురుగుల్ని బయటకి తీయడానికి ప్రయత్నించకూడదు. దానివల్ల పురుగు ఇంకా లోపలికే వెళ్లిపోతుంది. పైగా చెవి పొర దెబ్బ తినే అవకాశం ఉంటుంది.
- కొంతమంది అగ్గిపుల్లని చెవిలో పెట్టి పురుగుల్ని తీయడానికి ప్రయత్నిస్తారు. ఇలా చేస్తే చెవి లోపలి సున్నితమైన భాగం దెబ్బ తింటుంది.
డాక్టర్ ని ఎప్పుడు కలవాలి?
నీళ్లు, ఆయిల్ వేసినా చీమ లేదా పురుగు బయటకి రాకపోతే వెంటనే డాక్టర్ ని కలవాలి. ముఖ్యంగా పిల్లలకి ఈ సమస్య వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం మంచిది.
చెవిలోకి పురుగులు వెళ్తే వచ్చే సమస్యలు:
- చీమ లేదా పురుగు చెవి పొరని లేదా చర్మాన్ని కొరకడం వల్ల నొప్పి పెడుతుంది.
- కొన్నిసార్లు రక్తం కూడా రావొచ్చు.
- చెవి మూసుకుపోవడం లేదా చెవి ఇన్ఫెక్షన్ కూడా రావొచ్చు.


