దగ్గు ఉందని నోట్లో కరక్కాయ వేసుకొని పడుకుంది.. ఉదయం లేచే సరికి ప్రాణాల మీదికొచ్చింది.
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయింది. అనే సామెత వినే ఉంటాం. అయితే తాజాాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ సంఘటన ఈ సామెతకు సరిగ్గా సరిపోతుంది. అసలేం జరిగిందంటే..

ప్రాణం మీదికి తెచ్చిన కరక్కాయ
హైదరాబాద్‌లో ఒక మహిళ సాధారణ అలవాటు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. దగ్గు తగ్గుతుందని భావించి నిద్రలో కరక్కాయను బుగ్గన పెట్టుకోవడం ఆమెకు ప్రాణాల మీదకు తెచ్చింది. ఆ కరక్కాయ పొరపాటున శ్వాసనాళంలో ఇరుక్కుపోయి ఊపిరితిత్తుల పనితీరును పూర్తిగా ఆపేసింది. సమయానికి వైద్యులు జోక్యం చేసుకోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.
సమస్య ఎలా మొదలైందంటే.?
57 ఏళ్ల విజేత అనే మహిళ వాతావరణ మార్పుల కారణంగా నిరంతరం దగ్గుతో బాధపడుతున్నారు. కూర్చున్నప్పుడు అంత ఇబ్బంది లేకపోయినా, పడుకున్నప్పుడు దగ్గు మరింతగా పెరిగేది. దీంతో రాత్రి నిద్రకు ముందు కరక్కాయను బుగ్గన పెట్టుకుని పడుకున్నారు. నిద్రలో అనుకోకుండా దాన్ని మింగేయడంతో వెంటనే తీవ్ర దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరంలాంటి సమస్యలు ఎదురయ్యాయి.
వైద్యుల అత్యవసర చికిత్స
ఈ పరిస్థితిలో ఆమెను ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రి అత్యవసర విభాగానికి తీసుకువచ్చారు. సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఈ. రవీందర్ రెడ్డి పరీక్షించినప్పుడు ఆమె ఊపిరితిత్తులు సరిగా పనిచేయకపోవడం గుర్తించారు. వెంటిలేటర్‌పై ఉంచి ఐసీయూలో చేర్చారు. ఎక్స్-రే, హెచ్ఆర్‌సీటీ స్కాన్ పరీక్షల్లో ఎడమ ఊపిరితిత్తి పూర్తిగా మూసుకుపోయినట్లు తేలింది.
బ్రాంకోస్కోపీ ద్వారా విజయవంతమైన ఆపరేషన్
ఆమె ఆరోగ్యం కొంత మెరుగుపడిన తర్వాత కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ భరత్ జానపాటి బ్రాంకోస్కోపీ చేశారు. రాట్ టూత్ ఫోర్సెప్స్ అనే ప్రత్యేక పరికరం సహాయంతో శ్వాసనాళంలో ఇరుక్కుపోయిన కరక్కాయను రెండు ముక్కలుగా విడదీసి బయటకు తీశారు. ఈ ప్రక్రియలో రోగికి ఎటువంటి హాని కలగకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకున్నారు.
రోగి ఆరోగ్యం మెరుగుదల
చికిత్స అనంతరం తీసిన ఎక్స్-రేలో ఎడమ ఊపిరితిత్తి తిరిగి సక్రమంగా పనిచేస్తోందని తేలింది. ఆమె ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడటంతో మరుసటి రోజే డిశ్చార్జ్ చేశారు. ఈ విషయమై వైద్యులు మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపించినా, ఆరోగ్యంగా ఉన్న పెద్దవారిలో కూడా అలవాట్ల వల్ల జరగవచ్చని అన్నారు. నిద్రలో కరక్కాయలు, వక్క పలుకులు వంటి వస్తువులను బుగ్గన పెట్టుకోవడం ప్రమాదకరమని, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బ్రాంకోస్కోపీ పద్ధతితో సమర్థవంతంగా చికిత్స చేయవచ్చని అన్నారు.