- Home
- Telangana
- IMD Cold Wave Alert : ఈ ఎనిమిది జిల్లాల్లో సూపర్ కూల్ పరిస్థితి... ఈ రెండ్రోజులు మరింత జాగ్రత్త
IMD Cold Wave Alert : ఈ ఎనిమిది జిల్లాల్లో సూపర్ కూల్ పరిస్థితి... ఈ రెండ్రోజులు మరింత జాగ్రత్త
IMD Cold Wave Alert : మరో రెండ్రోజులు చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని… ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఎనిమిది జిల్లాల్లో సూపర్ కూల్ వెెదర్ ఉంటుందని హెచ్చరించింది.

తెలుగు రాష్ట్రాలపై చలి పంజా
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో చలిగాలులు కొనసాగుతున్నాయి... దీంతో ప్రజలు గజగజా వణికిపోతున్నారు. అయితే గతవారంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు పెరిగాయి... కానీ చలి తీవ్రత మాత్రం తగ్గినట్లు అనిపించడంలేదు. పొడి వాతావరణం కొనసాగుతూ చలి ఇరగదీస్తోంది... మరికొద్దిరోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
తెలంగాణలో సూపర్ కూల్ వెదర్
తెలంగాణగాలో ఇవాళ, రేపు (డిసెంబర్ 29,30) రెండ్రోజులు సూపర్ కూల్ వెదర్ ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిప్రాంతాల్లో టెంపరేచర్స్ పూర్తిగా కుప్పకూలిపోతాయని... అత్యల్పంగా 2-3 డిగ్రీలు నమోదయ్యే ఆస్కారం ఉందని హెచ్చరిస్తోంది. అత్యధిక చలి ఉండే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్, నిర్మల్, వికారాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఇక నాగర్ కర్నూల్, జగిత్యాల, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగామ, భూపాలపల్లి జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరో రెండ్రోజులు ఇంతే..
డిసెంబర్ 30 వరకు తెలంగాణలో విపరీతమైన చలి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. అత్యల్పంగా పలు జిల్లాల్లో 5-10 డిగ్రీలు, మరికొన్ని జిల్లాల్లో 11-15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రకటించింది... ఇంకొన్ని జిల్లాల్లో 15 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలుంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండ్రోజులు అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే
ఇదిలా ఉంటే ఆదివారం (డిసెంబర్ 28, ఆదివారం) తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ లో 8.2, మెదక్ లో 9.0 డిగ్రీలు నమోదయ్యాయి. అలాగే హన్మకొండలో 11, దుండిగల్ లో 12, రామగుండం లో 12.6, నిజామాబాద్ లో 12.9, ఖమ్మం లో 14.6 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ పటాన్ చెరులో 9, రాజేంద్ర నగర్ లో 9.5 డిగ్రీలు నమోదయ్యాయి.. బేగంపేటలో 13.2, హకీంపేటలో 14 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలున్నాయి.
తెలంగాణలో పెరిగిన AQI
తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగుతుండటంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) దారుణ స్థాయికి చేరుకుంటోందని... అంటే వాయుకాలుష్యం పెరుగుతోందని తెలంగాణ వెదర్ మ్యాన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విపరీతమైన పొగమంచు, ఉష్ణోగ్రతలు కుప్పకూలడం, మధ్యాహ్నం సమయంలో కూడా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం కూడా AQI పెరగడానికి కారణమట. ఈ చలి, కాలుష్యం కారణంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలుంటాయి... మరీముఖ్యంగా చిన్నారులు, ముసలివారు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఏపీలో చలి
మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో కూడా చలి చంపేస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదవుతూ చలి ఎక్కువగా ఉంటోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అయితే చలి గజగజా వణికిస్తోంది... మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. అరకు, పాడేరు, చింతపల్లి, మంచంగిపుట్టు ప్రాంతాల్లో 5 నుండి 10 డిగ్రీలలోపు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

