IMD Cold Wave : హమ్మయ్యా..! ఇక చలిగండం గట్టెక్కినట్లేనా..?
IMD Cold Wave Alert : తెలంగాణకు ఇక్క చలి గండం తప్పినట్లేనా..? అంటే హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా సమాచారాన్ని బట్టి అవుననే అనిపిస్తోంది. అయితే ఒక్క జిల్లాను మాత్రం ఇంకా చలి వదిలిపెట్టడంలేదు.

తెలంగాణలో చలి తగ్గిందోచ్...
IMD Cold Wave Alert : డిసెంబర్ ఆరంభంనుండి తెలుగు రాష్ట్రాలను చలిగాలులు గజగజా వణికిస్తున్నాయి. రోజురోజుకి ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఈ నెల మిడిల్ కి వచ్చేసరికి కుప్పకూలిపోయాయి... కొన్నిచోట్ల అత్యల్పంగా 3, 4 డిగ్రీలకు కూడా పడిపోయాయి. దీంతో ఎక్కడ 0 డిగ్రీస్ టెంపరేచర్స్ నమోదవుతాయోనని... కశ్మీర్ మాదిరిగా మంచు కురుస్తుందేమోనని తెలుగు ప్రజలు భయపడిపోయారు. కానీ అలాంటి పరిస్థితి లేకుండానే ఇటీవల క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి... దీంతో గండం గట్టెక్కిందని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
తెలంగాణ ప్రజలకు ఊరట
ప్రస్తుతం తెలంగాణలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలను బట్టి చూస్తుంటే చలి తీవ్రత మెల్లిమెల్లిగా తగ్గుతోందని అర్థమవుతోంది. ఇప్పటికే వాతావరణ నిపుణులు సైతం డిసెంబర్ 31 నుండి చలిగాలులు తీవ్రత తగ్గుతుంది... కొత్త సంవత్సరంలో సరికొత్త వాతావరణం ఉంటుందని చెప్పారు. వారి అంచనాలే నిజమయ్యేలా ఉన్నాయి… ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి... ప్రస్తుతం కొన్నిచోట్ల మాత్రమే సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి.
తెలంగాణలో తాజా వాతావరణం
తెలంగాణ వాతావరణ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం... ఇవాళ (డిసెంబర్ 26, శుక్రవారం) కేవలం ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే సింగిల్ డిజిట్ 7.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మెదక్ లో 10.2, హన్మకొండలో 11.5, రామగుండంలో 12, నిజామాబాద్ లో 13.1, భద్రాచలంలో 14.5, ఖమ్మంలో 14.4, నల్గొండలొ 14.4, హహబూబ్ నగర్ లో 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఈ జిల్లాల్లో కూడా సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదయ్యాయి... ఇప్పుడు పెరగడంతో చలి తీవ్రత కూడా తగ్గింది.
హైదరాబాద్ టెంపరేచర్స్
హైదరాబాద్ విషయానికి వస్తే ఇవాళ (డిసెంబర్ 26) చలి తీవ్రత ఎక్కువగానే ఉంది... కానీ గతంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. జిహెచ్ఎంసి పరిధిలోని పటానుచెరులో గతంలో 6, 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి... కానీ ప్రస్తుతం ఇది 8.4 డిగ్రీలకు చేరింది. చలితో పాటు పొగమంచు తీవ్రత కూడా బాగా తగ్గినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఇక బేగంపేటలో 13.6, హకీంపేటలో 13.4, దుండిగల్ లో 13.6 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నాయి... మొత్తంగా హైదరాబాద్ లో సగటు ఉష్ణోగ్రత 13.6 గా ఉంది.
REALISED WEATHER OVER TELANGANA DATED: 26.12.2025 pic.twitter.com/IEM5pJdEtY
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) December 26, 2025
అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే
ప్రాంతాలవారిగా చూసుకుంటే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యానిలో అత్యల్పంగా 7.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే సంగారెడ్డి జిల్లా కోహీర్ 7.8, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ 8.9, ఆదిలాబాద్ జిల్లా గడిగూడ 9.5, కామారెడ్డి జిల్లా గాంధారి 9.6, వికారాబాద్ జిల్లా బంట్వారం 9.8 లో మాత్రమే సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ ఉన్నాయి. మిగతా అన్ని జిల్లాల్లోనూ అత్యల్ప ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పైనే నమోదయ్యాయి. తెలంగాణలో అత్యల్ప సగటు ఉష్ణోగ్రత 12.9 గా ఉంది.

