Top 5 Startups : హైదరాబాద్ లో ప్రారంభమై గ్లోబల్ స్థాయికి ఎదిగిన టాప్ 5 స్టార్టప్స్ ఇవే
Top 5 Startups in Hyderabad : ప్రస్తుతం స్టార్టప్స్ కు హైదరాబాద్ అడ్డాగా మారింది. కానీ గతంలోనే ఇక్కడ ప్రారంభమైన కొన్ని స్టార్టప్స్ ప్రస్తుతం వందలు, వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాయి.

హైదరాబాద్ స్టార్టప్స్
Top 5 Startups in Hyderabad : దేశంలో చాలా నగరాలున్నాయి... అన్నీ వేగంగా అభివృద్ధి చెందుతున్నవే. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని నగరాలు ఐటీ, టెక్నాలజీ వంటి రంగాల్లో చాలా ముందున్నాయి. ఇందులోనూ బెంగళూరు, చెన్నై వంటి నగరాలకంటే హైదరాబాద్ మరింత ముందుందనే చెప్పాలి. తక్కువ ఖర్చుతో మంచి బిజినెస్ ప్రారంభించేందుకు హైదరాబాద్ పర్ఫెక్ట్ ప్లేస్. ఈ నగరంలో లివింగ్ కాస్ట్ కూడా తక్కువ, వరల్డ్ క్లాస్ విద్యాసంస్థలు కూడా ఉన్నాయి కాబట్టి మానవ వనరులకు కొరతలేదు. అందుకే చాలా కంపెనీలు ఈ హైదరాబాద్ నుండి ప్రయాణం ప్రారంభించి ప్రస్తుతం గ్లోబల్ స్థాయికి ఎదిగాయి. ఇలాంటి టాప్ 5 స్టార్టప్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. బిగ్ బాస్కెట్ (bigbasket)
ఈ టెక్ జమానాలో అంతా ఆన్లైన్ మయం అయిపోయింది... కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డలు కూడా ఇక్కడ లభిస్తున్నాయి. ఈ పరిస్థితిని చాలా ముందుగానే ఊహించి 'బిగ్ బాస్కెట్' పేరిట 2011 లోనే ఆన్లైన్ సరుకుల దుకాణం ప్రారంభించారు కొందరు ఔత్సాహికులు. ఇలా హరి మీనన్, విఎస్ సుధాకర్, విపుల్ పరేఖ్, అభినవ్ చౌదరి అనే నలుగురు దీన్ని ప్రారంభించారు.. ఇది దేశంలోనే మొట్టమొదటి ఆన్ లైన్ కిరాణాషాప్. అయితే కరోనా సమయంలో బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో ఆన్లైన్ లోనే సరుకులు కొనడానికి ప్రసక్తి చూపించారు... దీంతో బిగ్ బాస్కెట్ బిజినెస్ తారాస్థాయికి చేరింది.
బిగ్ బాస్కెట్ ను టాటా గ్రూప్ యాజమాన్యం టెకోవర్ చేసింది. ప్రస్తుతం 30 నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. హైదరాబాద్ లో బలమైన పునాదులున్న ఈ సంస్థ ప్రధాన కార్యాలయం మాత్రం బెంగళూరులో ఉంది. ప్రస్తుతం దీని విలువ 3 బిలియన్ డాలర్లుగా ఉంది.
2. డార్విన్ బాక్స్ (darwinbox)
డార్విన్ బాక్స్ అనేది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో హెచ్ఆర్ (హ్యూమన్ రిసోర్సెస్) సేవలు అందించే ప్లాట్ ఫామ్. దీని ప్రయాణం కూడా 2015 లో మన హైదరాబాద్ లోనే ప్రారంభమయ్యింది.
జయంత్ పలేటి, రోహిత్ చెన్నమనేని, చైతన్య పెద్ది దీన్ని స్థాపించారు. టెక్, కార్పోరేట్ కంపెనీల మానవ వనరుల అంటే ఉద్యోగాల విషయంలో సహకారం అందిస్తుంది. ప్రస్తుతం 100 కు పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది... ఈ డార్విన్ బాక్స్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంది. దీని విలువ ప్రస్తుతం 1 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది.
3. వాల్యూ ల్యాబ్స్ (Value Labs)
వాల్యూ ల్యాబ్స్ అనేది డిజిటల్ సర్వీసెస్ అందించే సంస్థ. టెక్నాలజీ కన్సల్టింగ్, సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సేవలను అందించే గ్లోబల్ సంస్థ. దీనిని 1997 లో అర్జున్ రావు హైదరాబాద్ లో స్థాపించారు... ప్రస్తుతం ఈ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో క్లయింట్స్ కలిగివుంది. ఈ వాల్యూ ల్యాబ్ విలువు 1 బిలియన్ డాలర్లుగా ఉంది.
4. జాగిల్ (Zaggle)
భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ ఫిన్‌టెక్ (FinTech) సంస్థ ఈ జాగిల్. ఇది స్పెండ్ మేనేజ్‌మెంట్ (ఖర్చుల నిర్వహణ) సేవలను అందిస్తుంది. 2011లో హైదరాబాద్ లో రాజ్ పి నారాయనమ్ దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఇది పబ్లిక్ కంపెనీ... 3000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ కలిగివుంది.
5. యెల్లో.ఏఐ (Yellow.AI)
2016 లో రఘు రావినూతల, రష్మి రావినూతల ఈ యెల్లో.ఏఐ స్టార్టప్ ను ప్రారంభించారు. ఇది జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలు అందిస్తుంది. ప్రస్తుతం దీని విలువ 700 నుండి 800 మిలియన్ డాలర్లుగా ఉంటుంది.

