Telangana Rising 2047: చైనాలోని ఆ నగరంలా తెలంగాణ.. సీఎం రేవంత్ కొత్త ఫార్ములా
Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి 2047 విజన్‌ను ఆవిష్కరించారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా CURE PURE RARE అనే మూడు కీలక విధానాలను ప్రకటించారు.

తెలంగాణ అభివృద్ధికి CURE, PURE, RARE ఫార్ములా
తెలంగాణను దేశంలోనే అత్యున్నత స్థానంలో నిలపాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మరో చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. మీర్‌ఖాన్‌పేట్‌లోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఇతర ప్రముఖులతో కలిసి పాల్గొన్నారు.
దేశ, విదేశాల నుంచి విచ్చేసిన పారిశ్రామిక వేత్తలు, నిపుణులను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి, రాష్ట్ర భవిష్యత్తు కోసం రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను సవివరంగా ఆవిష్కరించారు. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
మూడు మండళ్లుగా రాష్ట్ర అభివృద్ధి (CURE, PURE, RARE)
భవిష్యత్తు తెలంగాణ కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించే క్రమంలో రాష్ట్రాన్ని మూడు ప్రత్యేక ఆర్థిక మండళ్లుగా విభజించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సేవారంగం, తయారీ రంగం, వ్యవసాయ రంగం ఆధారంగా ఈ విభజన జరిగినట్లు తెలిపారు. దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో స్పష్టమైన విధానాలను రూపొందించామని, వాటిని క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE)గా నామకరణం చేశామని వివరించారు.
1. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE): పట్టణ ప్రాంత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం.
2. పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE): నగర శివారు ప్రాంతాల ఆర్థికాభివృద్ధి.
3. గ్రామీణ వ్యవసాయ రీజియన్ ఎకానమీ (RARE): గ్రామీణ, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ.
ఈ విధానాల రూపకల్పనలో ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించామని, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB), నీతి ఆయోగ్ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్నామని సీఎం వెల్లడించారు.
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను ప్రకటించారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు.
ప్రస్తుతం దేశ జనాభాలో తెలంగాణ వాటా దాదాపు 2.9 శాతంగా ఉండగా, జాతీయ జీడీపీలో రాష్ట్రం 5 శాతం వాటాను అందిస్తోందని గుర్తు చేశారు. అయితే, 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న తెలంగాణలో అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
చైనాలోని గ్వాంగ్-డాంగ్ నమూనా స్ఫూర్తితో అడుగులు
తెలంగాణ అభివృద్ధి నమూనా గురించి వివరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చైనాలోని గ్వాంగ్-డాంగ్ (Guangdong) ప్రావిన్స్‌ను ఉదహరించారు. గ్వాంగ్ డాంగ్ ఆర్థిక వ్యవస్థ చైనాలోని ఏ ఇతర ప్రావిన్స్‌కైనా అతిపెద్దదనీ, కేవలం 20 ఏళ్లలో వారు ప్రపంచంలోనే అత్యధిక పెట్టుబడులు సాధించి అద్భుతమైన వృద్ధిని నమోదు చేశారని తెలిపారు.
అదే స్ఫూర్తితో తెలంగాణలో కూడా ఆ నమూనాను అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాల నుంచి తాము ప్రేరణ పొందుతున్నామని, ఇప్పుడు ఆ దేశాలతో పోటీ పడే స్థాయికి తెలంగాణను తీసుకువెళ్తామని సీఎం ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
చరిత్ర నుంచి ప్రేరణ.. భవిష్యత్తు వైపు అడుగులు
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి పరిస్థితులను, రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టిని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మహాత్మ గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల నుంచి, రాజ్యాంగ నిర్మాతల నుంచి తాము ప్రేరణ పొందుతున్నామని అన్నారు.
దశాబ్దాల పోరాటం తర్వాత, 2014లో సోనియా గాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో తెలంగాణ కల సాకారమైందని గుర్తు చేశారు. గత పదేళ్లలో యువ రాష్ట్రంగా ఎదిగిన తెలంగాణను, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు ప్రారంభించామని అన్నారు.
అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాం
తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలు కష్టంగా అనిపించవచ్చని, కానీ వాటిని సాధించగలమన్న నమ్మకం తనకుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. "ఏదైనా పని కష్టంగా ఉంటే దాన్ని వెంటనే చేసి చూపిద్దాం.. అసాధ్యమని భావిస్తే మరికొంత గడువు తీసుకుని సాధిద్దాం" అని తన బృందానికి సూచించినట్లు సీఎం తెలిపారు.
వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు ఈ రెండు రోజుల సమ్మిట్‌లో ఇచ్చే సలహాలు, సూచనలను ప్రభుత్వం స్వీకరిస్తుందని హామీ ఇచ్చారు. నిన్నటి వరకు ఒక కలగా ఉన్న ప్రణాళిక, నేడు అందరి సపోర్టుతో సాధ్యమవుతుందన్న నమ్మకం పెరిగిందని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం అందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

