- Home
- Telangana
- Mahalakshmi scheme: 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు రూ. 2500.. త్వరలోనే అమల్లోకి కొత్త పథకం
Mahalakshmi scheme: 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు రూ. 2500.. త్వరలోనే అమల్లోకి కొత్త పథకం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళ సంక్షేమం కోసం పథకాలను తీసుకొస్తోంది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

మహిళా సాధికారత దిశగా కీలక అడుగు
తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనను పెంపొందించే లక్ష్యంతో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ పథకం కింద 18 ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున సహాయం అందించే ప్రతిపాదనపై జూలై 25న జరగబోయే క్యాబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ఒకటనే విషయం అని తెలిసిందే.
ఎవరు అర్హులు?
ఈ పథకం రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ప్రయోజనం చేకూర్చేలా రూపకల్పన చేశారు. అర్హతలలో కొన్ని ప్రధాన అంశాలు.
* తెలంగాణలో నివాసం ఉండాలి
* 18 ఏళ్లు పైబడినవారై ఉండాలి
* కుటుంబ సభ్యుల్లో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు.
* వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి.
* బ్యాంక్ అకౌంట్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి.
ఆర్థిక సహాయం ప్రయోజనాలు
ప్రతి నెల రూ.2,500 నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ కావడంతో మహిళలు తమ దైనందిన ఖర్చులు తీర్చుకోవడమే కాకుండా చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా విద్యా ఖర్చులకు వినియోగించుకోవచ్చు. ఈ చర్య మహిళలకు ఆర్థిక భద్రతను అందించడమే కాకుండా కుటుంబాల్లో వారి పాత్రను మరింత బలపరచనుంది. అందులోనూ 18 ఏళ్లు నిండిన వారు కావడంతో ఉన్నత విద్యకు కూడా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
మహిళల కోసం ఇప్పటికీ పలు పథకాలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం పలు పథకాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకాలను అమలు చేసింది. కాగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ. 2500 ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
త్వరలోనే అధికారిక ప్రకటన
క్యాబినెట్ భేటీ తర్వాత ఈ పథకం అమలుకు సంబంధించిన నిధుల కేటాయింపు, లబ్ధిదారుల ఎంపిక విధానం, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ పథకం వల్ల వెనుకబడిన వర్గాల మహిళలకు ఆర్థిక భరోసా కలుగుతుందని ప్రభుత్వ వర్గాలు ఆశిస్తున్నాయి.