తెలంగాణలో మరో హైటెక్ సిటీ.. ఆ నగరం నడిబొడ్డున ఐటీ టవర్ల నిర్మాణానికి సన్నాహాలు
Telangana: హైదరాబాద్ తర్వాత మరో నగరాన్ని ప్రధాన ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో హనుమకొండలో ఐటీ టవర్ల నిర్మాణానికి కసరత్తు ప్రారంభించింది.

హైదరాబాద్ తర్వాత ఓరుగల్లుపై ప్రత్యేక దృష్టి
గ్రేటర్ వరంగల్ పరిధిలో పారిశ్రామిక, విద్యా, రవాణా రంగాలను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం వరుస ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తోంది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, మామునూరు విమానాశ్రయం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వంటి కీలక ప్రాజెక్టులు నగరానికి మంజూరయ్యాయి. వీటికి తోడు ఐటీ పరిశ్రమలను ఆకర్షించడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచాలని నిర్ణయించింది. వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలతో కూడిన ట్రైసిటీకి ఇప్పటికే విద్యా, వాణిజ్యపరంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఐటీ రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తే స్థానికంగా ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమమవుతుందని భావిస్తున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఈ ప్రతిపాదనను సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఐటీ టవర్ల నిర్మాణానికి అవసరమైన భూమిని గుర్తించాలని అధికారులను ఆదేశించింది.
హంటర్ రోడ్, హయగ్రీవాచారి గ్రౌండ్‌పై పరిశీలన
ఐటీ టవర్ల ఏర్పాటుకు నాలుగు నుంచి ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి అవసరం అని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఉద్యోగులు, ఐటీ సంస్థలకు రాకపోకలు సులభంగా ఉండటంతోపాటు నగరంలోని ప్రధాన ప్రాంతాలకు అందుబాటులో ఉండే స్థలాన్నే ఎంపిక చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో హనుమకొండలోని హంటర్ రోడ్, న్యూశాయంపేట జంక్షన్ పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ భూమిని అధికారులు పరిశీలిస్తున్నారు. జూపార్క్ సమీపంలో ప్రభుత్వానికి మొత్తం తొమ్మిది ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. ఇందులో ఐదు ఎకరాలను శిల్పారామం ఏర్పాటుకు కేటాయించే ప్రతిపాదన ఉంది. మిగిలిన నాలుగు ఎకరాలను ఐటీ టవర్ల నిర్మాణానికి వినియోగించే అవకాశాలను పరిశీలిస్తున్నారు.
దీనితోపాటు బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రం పక్కనే ఉన్న హయగ్రీవాచారి గ్రౌండ్‌ను కూడా ప్రత్యామ్నాయ స్థలంగా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో ఏది అనువుగా ఉంటుందనే అంశంపై ప్రజాప్రతినిధులు, అధికారులు చర్చిస్తున్నారు. స్థల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేసి నిర్మాణాలకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
స్థానిక యువతకు ఉద్యోగాలే ప్రధాన లక్ష్యం
వరంగల్ విద్యారంగంలో కీలక కేంద్రంగా ఎదిగింది. ఇక్కడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), కాకతీయ విశ్వవిద్యాలయంతోపాటు అనేక ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాలతోపాటు ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇక్కడికి వస్తుంటారు.
ఏటా ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక విద్యను పూర్తిచేసిన యువతకు స్థానికంగానే ఉద్యోగాలు కల్పించాలంటే పెద్ద ఐటీ సంస్థల రాక అవసరం. ప్రస్తుతం వరంగల్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న కొన్ని సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య 100 నుంచి 200 మందిలోపే ఉంటోంది. వీరిలో ఎక్కువ మందికి నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు మాత్రమే వేతనాలు లభిస్తున్నాయి. తక్కువ జీతాలు, నివాస ఖర్చులు, కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రయాణ సమయం ఉద్యోగులకు ఇబ్బందిగా మారుతున్నాయి. వరంగల్ నగరంతోపాటు ధర్మారం, గీసుగొండ, మామునూరు వంటి ప్రాంతాల నుంచి ఉద్యోగులు రోజూ 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు ప్రయాణించాల్సి వస్తోంది. ఈ కారణాలతో కొందరు ఉద్యోగాలు కొనసాగించలేకపోతున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు నగరానికి చేరువలో ఐటీ మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
మడికొండ ఐటీ పార్క్‌తో ఆశించిన ఫలితాలు రాలేదా?
వరంగల్‌లో ఐటీ పరిశ్రమల విస్తరణ కోసం గతంలో మడికొండ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. హైదరాబాద్ వెళ్లే మార్గంలో నగరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో ఐటీ పార్క్ ఏర్పాటుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే భూముల కేటాయింపుల విషయంలో అప్పట్లో రాజకీయ ఆరోపణలు, వివాదాలు తెరపైకి వచ్చాయి. కొందరు నేతల వ్యక్తిగత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే స్థలాల కేటాయింపులు జరిగాయనే విమర్శలు వినిపించాయి. 2016లో అక్కడ ప్రభుత్వ ఐటీ ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం 2020లో టెక్ మహీంద్రా, సైయంట్ వంటి సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయి. అదే ఏడాది క్వాడ్రంట్ టెక్నాలజీస్‌కు శంకుస్థాపన చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఈ సంస్థను ప్రారంభించారు. అయితే నగరానికి దూరంగా ఉండటం, ఉద్యోగులకు రవాణా సౌకర్యాలు, వేతనాలు వంటి అంశాలు అక్కడి ఐటీ కార్యకలాపాల విస్తరణకు సవాళ్లుగా మారాయి. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కొత్త ఐటీ టవర్లను నగర నడిబొడ్డున ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
భూమి కేటాయింపుపై ఎమ్మెల్యే నాయిని ప్రత్యేక చొరవ
గ్రేటర్ వరంగల్‌ను విద్యా, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. స్థానిక యువతకు ఉద్యోగాల కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి తగ్గించాలనే ఉద్దేశంతో ఐటీ టవర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నగర పరిధిలో అందుబాటులో ఉన్న స్థలాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. హంటర్ రోడ్‌లోని శిల్పారామం పరిసరాలు, హయగ్రీవాచారి గ్రౌండ్ ప్రాంతాలను పరిశీలనలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. త్వరలోనే అనువైన స్థలాన్ని ఖరారు చేసి భూమి కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. నిర్మాణాలు పూర్తయిన తర్వాత ప్రముఖ ఐటీ కంపెనీలను వరంగల్‌కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేయనుంది. అదే జరిగితే ఓరుగల్లు యువతకు సాఫ్ట్వేర్, ఐటీ రంగాల్లో మరిన్ని ఉద్యోగాలు అందుబాటులోకి రావడంతోపాటు నగరంలో వాణిజ్య కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది.















