వారికి వెంటనే చేయూత పింఛన్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Telangana: తెలంగాణలో సామాజిక భద్రతా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కొన్ని ప్రత్యేక కేటగిరీల కింద పింఛన్లు పొందుతున్న వ్యక్తులు మరణిస్తే, వారి భార్యలకు పింఛన్ మంజూరులో జాప్యం జరగడంతో ప్రభుత్వం మార్పులు చేసింది.

ఏయే కేటగిరీలకు ఈ నిర్ణయం వర్తిస్తుంది?
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం గీత కార్మికులు, చేనేత కార్మికులు, దివ్యాంగులు, ఫైలేరియా, హెచ్‌ఐవీ, డయాలసిస్ కేటగిరీల కింద పింఛన్లు పొందుతున్న పురుషులు మరణిస్తే వారి భార్యలకు కూడా తక్షణమే పింఛన్ మంజూరు చేసే అవకాశం కల్పించారు. గతంలో వృద్ధాప్య పింఛన్ల విషయంలో మాత్రమే భర్త మరణించిన వెంటనే భార్యకు పింఛన్ బదిలీ చేసే విధానం ఉండేది. మిగిలిన కేటగిరీల్లో ఈ సదుపాయం లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేసింది.
మంత్రి సీతక్క ఆదేశాలతో కొత్త విధానం
భర్త మరణించిన తర్వాత కుటుంబానికి వచ్చే పింఛన్ నిలిచిపోవడంతో మహిళలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు సెర్ప్ అధికారులు కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్ ఈ నిర్ణయానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. గతంలో కొన్ని ప్రత్యేక పింఛన్ కేటగిరీల్లో లబ్ధిదారుడి మరణం తర్వాత భార్యకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. తాజా మార్గదర్శకాలతో ఈ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.
భార్య వయస్సును బట్టి పింఛన్ కేటగిరీ
మరణించిన పింఛనుదారుడి భార్య వయస్సు ఆధారంగా పింఛన్ కేటగిరీని నిర్ణయించనున్నారు. కొత్త ఉత్తర్వుల్లో ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. 57 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉంటే వితంతు పింఛన్ కేటగిరీ కింద మంజూరు చేస్తారు. 57 సంవత్సరాలు దాటిన మహిళలకు వృద్ధాప్య పింఛన్ కేటగిరీ కింద మంజూరు చేస్తారు. దీంతో భర్త మరణించిన తర్వాత మహిళలు తమ వయస్సు, అర్హతలకు అనుగుణంగా పింఛన్ పొందేందుకు అవకాశం ఉంటుంది. కుటుంబానికి అందే ఆర్థిక సహాయం నిలిచిపోకుండా చూడటమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.
పింఛన్ కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?
భర్తను కోల్పోయిన అర్హులైన మహిళలు తమ నివాస ప్రాంతాన్ని బట్టి సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు అందించాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే సంబంధిత బిల్ కలెక్టర్‌ను సంప్రదించి అప్లికేషన్ సమర్పించాలి. దరఖాస్తు అందిన తర్వాత అధికారులు వివరాలను చేయూత పోర్టల్‌లో నమోదు చేస్తారు. అనంతరం క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి, దరఖాస్తుదారురాలి అర్హతలను పరిశీలిస్తారు. అన్ని వివరాలు సక్రమంగా ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత పింఛన్ మంజూరు చేస్తారు.
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు ఇవే
పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో కొన్ని ముఖ్యమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిలో దరఖాస్తుదారురాలి ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ వివరాలు, మరణించిన భర్త ఆధార్ కార్డు, . భర్త మరణ ధ్రువీకరణ పత్రం ముఖ్యమైనవి. ఈ పత్రాలతో దరఖాస్తు సమర్పించిన తర్వాత అధికారులు వివరాలను ధ్రువీకరిస్తారు. అర్హతలు పూర్తిగా నిర్ధారణ అయితే పింఛన్ మంజూరు చేస్తారు. ఇటీవల ప్రభుత్వం పలు పింఛన్ కేటగిరీలకు సంబంధించి కొత్త దరఖాస్తులను కూడా స్వీకరించింది. వాటి పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉంది. తాజా నిర్ణయం వల్ల భర్తను కోల్పోయిన మహిళలు పింఛన్ కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం తగ్గనుంది.





