Telangana: నవంబర్ 3 నుంచి తెలంగాణలో కాలేజీలు బంద్.. కారణం ఏంటంటే.?
Telangana: తెలంగాణలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు మరోసారి బంద్ పిలుపునిచ్చాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై గతకొన్ని రోజులుగా సర్కారుకు, ఇంజనీరింగ్ కాలేజీలకు మధ్య చర్చలు నడుస్తోన్న విషయం తెలిసిందే.

ప్రభుత్వం హామీ ఇచ్చినా నిధులు రాక ఆగ్రహం
తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుపై ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. కొన్ని వారాల క్రితం బంద్‌కు పిలుపునిచ్చిన ప్రైవేట్ కాలేజీలు, ప్రభుత్వ హామీతో తాత్కాలికంగా వెనక్కి తగ్గాయి. కానీ ఇప్పటికీ బకాయిలు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బకాయిలు చెల్లించకపోతే నవంబర్ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేపడతామని ప్రైవేట్ కళాశాలల సమాఖ్య ప్రకటించింది.
అక్టోబర్‌లోనే బంద్‌కు పిలుపు
ప్రైవేట్ కళాశాలల సమాఖ్య ప్రకారం, అక్టోబర్ 22న ప్రభుత్వం వద్ద అధికారిక నోటీసు సమర్పించనున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 25న విద్యార్థి సంఘాలతో చర్చలు, 26న సర్వ సభ్య సమావేశాలు జరపనున్నారు. అలాగే నవంబర్ 1న రాజకీయ పార్టీల నాయకులతో కూడా సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే నవంబర్ 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడతాయని హెచ్చరించారు.
పాత వివాదం మళ్లీ ముదురుతోంది
సెప్టెంబర్ 15న ప్రారంభమైన బంద్ సమయంలో ప్రభుత్వం యాజమాన్యాన్ని చర్చలకు ఆహ్వానించింది. ఆ చర్చల్లో ప్రభుత్వం రెండు విడతల్లో రూ.600 కోట్ల చెల్లింపుకు అంగీకరించింది. మొదటి విడతగా రూ.600 కోట్లు తక్షణమే విడుదల చేస్తామని, మిగిలిన మొత్తాన్ని దీపావళి నాటికి చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అయితే బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు మరోసారి బంద్ నిర్ణయం తీసుకున్నాయి.
ఇంజినీరింగ్, వృత్తి విద్యా కాలేజీల ఏకగ్రీవ నిర్ణయం
ఇప్పటివరకు ఇంజినీరింగ్ కాలేజీలు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఆందోళన వ్యక్తం చేశాయి. కానీ ఈసారి ఇతర వృత్తి విద్యా కళాశాలలు కూడా బంద్‌లో పాల్గొనాలని నిర్ణయించాయి. ప్రభుత్వం చెల్లింపుల్లో ఆలస్యం చేయడం వలన, పలు కళాశాలలు ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాయని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. విద్యార్థులకు సకాలంలో సౌకర్యాలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు.
రేవంత్ ప్రభుత్వంపై యాజమాన్యాల విమర్శ
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై రేవంత్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రైవేట్ కాలేజీ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని, కళాశాలల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని అంటున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి బకాయిలను విడుదల చేయకపోతే, రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక బంద్ తప్పదని స్పష్టం చేశారు.