- Home
- Telangana
- Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sydney Bondi Beach Attack : సిడ్నీ బోండీ బీచ్ ఉగ్రదాడిలో నిందితుడైన సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్‌తో సంబంధాలు ఉన్నట్లు తేలింది. అతడు భారత పాస్‌పోర్ట్ కలిగి ఉన్నాడని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సిడ్నీ బోండీ బీచ్‌లో రక్తపాతం
ఆస్ట్రేలియాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సిడ్నీ బోండీ బీచ్ ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా యుద్ధభూమిలా మారింది. యూదుల హనుక్కా పండుగ వేడుకలు జరుగుతున్న సమయంలో తండ్రీకొడుకులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఈ దాడిలో 10 ఏళ్ల బాలిక నుంచి 87 ఏళ్ల వృద్ధుడి వరకు మొత్తం 15 నుంచి 16 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనాస్థలంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు పరుగులు తీశారు.
సిడ్నీ ఉగ్రదాడిలో సంచలనం: నిందితుడు సాజిద్ అక్రమ్ హైదరాబాదీ!
కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకడైన సాజిద్ అక్రమ్ (50) వద్ద భారత పాస్‌పోర్ట్ ను అధికారులు గుర్తించారు. ఆ పాస్‌పోర్ట్ హైదరాబాద్ నుంచే పొందినట్లు ఆస్ట్రేలియా అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేశారు. దీంతో తెలంగాణ డీజీపీ కార్యాలయం స్పందిస్తూ సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తేనని స్పష్టం చేసింది. అతడు హైదరాబాద్‌లో బీకాం చదివినట్లు, ఇక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసినట్లు వెల్లడించింది.
నిందితుడి వీసాలు, కుటుంబం, ఆస్తుల వివరాలు ఇవే
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సాజిద్ అక్రమ్ 1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లాడు. 2001లో తన స్టూడెంట్ వీసాను పార్ట్నర్ వీసాగా మార్చుకున్నాడు. 2002లో రెసిడెంట్ రిటర్న్ వీసా పొందాడు. యూరప్‌కు చెందిన వెనెరా గ్రోసోను వివాహం చేసుకున్న సాజిద్‌కు ఒక కుమారుడు నవీద్ అక్రమ్ (24), ఒక కుమార్తె ఉన్నారు. వీరిద్దరూ ఆస్ట్రేలియా పౌరులు.
గత 25 ఏళ్లలో కేవలం ఆరు సార్లు మాత్రమే సాజిద్ భారత్‌కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కుటుంబ, ఆస్తి వ్యవహారాల కోసమే ఈ ప్రయాణాలు చేసినట్లు తెలిపారు. 2022లో టోలిచౌకీలో ఉన్న తన ఆస్తులను విక్రయించినట్లు సమాచారం.
ఉగ్రవాద సంబంధాలు, పోలీసుల ఎదురుకాల్పులు
దాడి జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సాజిద్ అక్రమ్ అక్కడికక్కడే హతమయ్యాడు. అతడి కుమారుడు నవీద్ అక్రమ్ తీవ్రంగా గాయపడగా, పోలీసులు అతడిని అరెస్టు చేశారు. దర్యాప్తులో వీరిద్దరికీ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS) ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి.
గతంలో 2019లో ఆస్ట్రేలియాలో అరెస్టైన ఐసిస్ అనుచరుడితో నవీద్‌కు సన్నిహిత సంబంధాలున్నట్లు కూడా బయటపడింది. కొంతకాలం అతడిపై నిఘా ఉన్నప్పటికీ, ఆ తర్వాత పర్యవేక్షణ తగ్గినట్టు తెలుస్తోంది.
లైసెన్సు తుపాకులతో దాడులు
ఈ కేసులో మరో షాకింగ్ విషయం ఏమిటంటే… దాడికి ఉపయోగించిన తుపాకులు చట్టబద్ధంగా లైసెన్సు పొందినవే కావడం. అవన్నీ సాజిద్ అక్రమ్ పేరు మీదే నమోదు అయి ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్ మిన్స్ ఈ ఘటనను అధికారికంగా ఉగ్రవాద చర్యగా ప్రకటించారు.
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఈ దాడిని అమానుష చర్యగా పేర్కొంటూ ఖండించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిని తీవ్ర సెమిటిక్ వ్యతిరేక దాడిగా వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలు ఈ ఘటనను ఖండిస్తూ సంఘీభావం తెలిపారు.
సిడ్నీ బోండీ బీచ్ ఉగ్రదాడి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో నిందితుడికి హైదరాబాద్‌తో సంబంధాలు ఉండటం, భారత పాస్‌పోర్ట్ వినియోగించడం భద్రతా సంస్థలకు కొత్త సవాళ్లను విసురుతోంది. అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

