- Home
- Telangana
- Pensions: తెలంగాణలో రూ. 4 వేలకి పెరగనున్న పెన్షన్.. ఎప్పటి నుంచి అమలు కానుంది? ప్రభుత్వం ప్లాన్ ఏంటి.?
Pensions: తెలంగాణలో రూ. 4 వేలకి పెరగనున్న పెన్షన్.. ఎప్పటి నుంచి అమలు కానుంది? ప్రభుత్వం ప్లాన్ ఏంటి.?
Pensions: తెలంగాణలో ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో కీలక గ్యారెంటీని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

పెన్షన్ల పెంపుపై ప్రభుత్వ ఫోకస్
తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్ల మొత్తాన్ని పెంచాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రకటించిన ఈ హామీని వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే అమలు చేయాలన్న లక్ష్యంతో కార్యాచరణ సాగుతోంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా వివిధ వర్గాలకు అందుతున్న పింఛన్లను పెంచేందుకు సాధ్యాసాధ్యాలపై అధికారులు సమీక్షలు చేస్తున్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే పెంపు అమలు చేయాలన్న ఆలోచనపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది.
ఖజానాపై ఎంత భారం పడనుంది.?
ప్రస్తుతం రాష్ట్రంలో పింఛన్ల కోసం 2025–26 బడ్జెట్‌లో సుమారు రూ.11,635 కోట్లు కేటాయించారు. లబ్ధిదారుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే, ఎన్నికల హామీల ప్రకారం అన్ని పింఛన్లు పెంచిన పరిస్థితిలో వార్షిక వ్యయం దాదాపు రూ.22 వేల కోట్ల వరకు చేరే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఈ భారాన్ని బడ్జెట్‌లో ఎలా సమతుల్యం చేయాలి అన్న అంశంపై ఆర్థిక శాఖ విస్తృతంగా లెక్కలు వేస్తోంది.
రూ.500 పెంపా? రూ.1000 పెంపా?
పింఛన్లను ఎంత మేర పెంచాలన్న విషయంపై ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం అందుతున్న మొత్తానికి రూ.500 పెంచాలా లేక రూ.1000 వరకు పెంచాలా అన్న అంశంపై లోతైన చర్చ సాగుతోంది. నిజానికి ఎన్నికల హామీలో భాగంగా రూ. 2 వేల పెన్షన్‌ను రూ. 4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అయితే ఒకేసారి పూర్తి స్థాయిలో పెంపు సాధ్యం కాకపోతే దశలవారీగా అమలు చేయాలన్న ఆలోచన కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం అమలులో ఉన్న పింఛన్లు
రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులకు నెలకు రూ.2,016 చొప్పున పింఛన్ అందిస్తున్నారు. దివ్యాంగులకు నెలకు రూ.4,016 చెల్లిస్తున్నారు. డయాలసిస్ రోగులు సహా ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పింఛన్లు అమలులో ఉన్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం సాధారణ పింఛన్లను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచాల్సి ఉంది.
బోగస్ పింఛన్ల నియంత్రణ, కొత్త దరఖాస్తులు
బోగస్ పింఛన్లను అడ్డుకునేందుకు ఆధార్ సీడింగ్, బయోమెట్రిక్ విధానాలను మరింత కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా ఆదా అయ్యే నిధులను పెరిగిన పింఛన్లకు వినియోగించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇటీవల కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన నేపథ్యంలో కొత్తగా అర్హత పొందినవారి నుంచి పింఛన్ దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెరిగిన నిత్యావసర ధరలు, వైద్య ఖర్చుల నేపథ్యంలో పెన్షన్ పెంపు వార్త లబ్ధిదారుల్లో ఆశలన పెంచేస్తోంది. మరి పెన్షన్లు ఎప్పటి నుంచి పెరగనున్నాయన్నదానిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

