- Home
- Telangana
- Telangana Rains : వర్షాలకోసం ఎదురుచూసిన తెలుగోళ్లే ఇవేం వానల్రా బాబు అనేలా ... ఈ జిల్లాల్లో నేడు కుండపోత వానలు
Telangana Rains : వర్షాలకోసం ఎదురుచూసిన తెలుగోళ్లే ఇవేం వానల్రా బాబు అనేలా ... ఈ జిల్లాల్లో నేడు కుండపోత వానలు
ఇవాళ (సోమవారం) తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు
Andhra Pradesh and Telangana Weather Update : తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇప్పుడు వర్షాకాలం ఫీలింగ్ కలుగుతోంది... దాదాపు గత రెండు నెలలుగా వర్షాకాలం అన్నమాటేగానీ వానల జాడ లేకపాయె. మే చివర్లో కురిసిన వర్షాలే... జూన్ మొత్తం ఇటు తెలంగాణలోనే కాదు అటు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వాన చుక్కలేదు. దీంతో ఈసారి వర్షాలపై ఇక ఆశలు వదిలేసుకున్న సమయంలో వరుణుడు కరుణించాడు.
గత నాలుగైదు రోజులుగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది... భారీ, అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులువంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నారు... చెరువులు, జలాశయాలు జలకళను సంతరించుకున్నారు. ఈ వర్షాలతో ప్రజలు మరీముఖ్యంగా రైతులు ఆనందంతో తడిసిముద్దవుతున్నారు.
ఈ నగరాల్లో భారీ వర్షాలు
జులై 17 నుండి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వానలు జోరందుకున్నాయి... హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలతో పాటు జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్నిరోజులు ఈ కుండపోత వానలు కొనసాగుతాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇలా ఇవాళ(సోమవారం) ఏఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణ వాతావరణ సమాచారం
తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా వాతావరణం వర్షాలకు అనుకూలంగానే ఉందని... భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నిన్న(ఆదివారం) మోస్తరు వర్షాలు మాత్రమే కురిసాయి... కానీ ఇవాళ వాతావరణం పూర్తి భిన్నంగా ఉంటుందని తెలిపింది. సాయంత్రం సమయంలో భారీ నుండి అతిభారీ వర్షాలు మొదలై రాత్రంతా కొనసాగే అవకాశాలున్నాయని హెచ్చరించింది.
ఈ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది . మెదక్, నాగర్ కర్నూల్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
హైదరాబాద్ తో పాటు శివారు జిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, భువనగిరి, వికారాబాద్ లో కూడా వర్షాలు పడతాయని ప్రకటించారు. మధ్యాహ్నమే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలవుతాయని... సాయంత్రానికి నగరంమొత్తం వ్యాపించి భారీ వర్షాలుగా మారతాయని తెలిపారు. కాబట్టి గత అనుభవాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాలు, చెరువులు, నాలాల పరిసర ప్రాంతాల్లో నివాసముండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ వాతావరణ సమాచారం
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.... అలాగే మరో రెండ్రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం చెబుతోంది. వీటి ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయట... మరికొద్దిరోజులు ఇలాగే భారీ నుండి అతిభారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్ లో మరో నాలుగైదు రోజులు ఈ వర్షాలు కొనసాగుతాయని ప్రకటించింది.
ఇవాళ(సోమవారం) ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో కుండపోత వానలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు,కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని... ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పటికే భారీ వర్షాలు నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్ధ అలర్ట్ అయ్యింది... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.

