- Home
- Telangana
- Rain Alert: అత్యవసరమైతేనే బయటికి వెళ్లండి.. నేడు, రేపు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Rain Alert: అత్యవసరమైతేనే బయటికి వెళ్లండి.. నేడు, రేపు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌తో పాటు, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అయితే ఈ వర్షం ఇప్పట్లో తగ్గదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో విస్తారంగా వర్షాలు
తెలంగాణలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో దక్షిణ, మధ్య జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగి పారుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పరిస్థితి అత్యంత తీవ్రంగా మారింది.
నగర రహదారులు నీట మునిగాయి. దీంతో వాహనాల రద్దీతో ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపోయింది. బేగంపేట, మియాపూర్ ప్రాంతాల్లో కిలోమీట్లర మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సాయంత్రం సమయంలో వర్షం కురుస్తుండడంతో ఆఫీసులు, స్కూళ్ల నుంచి ఇంటికి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరో ఐదు రోజుల పాటు వర్షాలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాబోయే ఐదు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కొనసాగే అవకాశముంది. నేడు, పేరు (20, 21 తేదీల్లో) పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముండటంతో ముందుజాగ్రత్తగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా భూపాలపల్లి, ములుగు, వనపర్తి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జాగ్రత్తగా ఉండాలని సూచిన
వర్షాల ప్రభావంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. హైదరాబాద్ నగరంలో కాప్రా, ఉప్పల్, మల్కాజిగిరి, సరూర్‌నగర్ వంటి ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. విద్యార్థులు, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ జామ్‌లు గంటల తరబడి కొనసాగాయి. వర్షం కురుస్తున్న సమయంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఇంటికే పరిమితం కావాలని పేర్కొంటున్నారు.
కొన్ని జిల్లాల్లో అత్యధిక వర్షం
శనిరవారం తెలంగాణలో పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌లో 11 సెం.మీ., రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 11 సెం.మీ., యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో కాప్రా ప్రాంతంలో అత్యధికంగా 7.7 సెం.మీ., ఉప్పల్‌లో 6.8 సెం.మీ. వర్షం కురిసింది.
ఆంధ్రప్రదేశ్‌లోనూ..
ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా విశాఖపట్నం సహా ఉత్తరాంధ్రలో మోస్తరు వాన కురవనుంది. అలాగే సాయంత్రం కోస్తా, ఉత్తరాంధ్ర అంతటా మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాయలసీమకు కూడా ఈరోజు (ఆదివారం) వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు.