- Home
- Telangana
- School Holidays : ఆగస్ట్ లో మిగిలిన పదిరోజుల్లో మూడ్రోజులు సెలవులే.. ఏరోజు, ఎందుకో తెలుసా?
School Holidays : ఆగస్ట్ లో మిగిలిన పదిరోజుల్లో మూడ్రోజులు సెలవులే.. ఏరోజు, ఎందుకో తెలుసా?
తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త. ఈ నెలలో మిగిలిన పదిరోజుల్లో కొందరు విద్యార్థులకు మూడ్రోజులు, మరికొందరికి ఐద్రోజులు సెలవులు వస్తున్నాయి. ఏరోజు, ఎందుకు సెలవో తెలుసా?

తెలుగు విద్యార్థులకు సెలవులే సెలవులు
Holidays : తెలుగు విద్యార్థులకు ఈ నెల(ఆగస్ట్)లో భారీగా సెలవులు వచ్చాయి. వరలక్ష్మి వ్రతంతో ప్రారంభమైన సెలవులు రాఖీపౌర్ణమి, స్వాతంత్య్ర దినోత్సవం, శ్రీకృష్ణాష్టమి వరకు కొనసాగాయి. మధ్యలో భారీ వర్షాల కారణంగా కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులు వచ్చాయి. వీకెండ్స్ తో ఈ స్పెషల్ హాలిడేస్ కలిసిరావడంతో వరుస సెలవులు వచ్చాయి. వేసవి సెలవులు ముగిసినతర్వాత మొదటిసారి ఈస్థాయిలో స్కూళ్లకు సెలవులు వచ్చాయి... దీంతో విద్యార్థులు తెగ ఎంజాయ్ చేశారు.
ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయి... దీంతో ఈవారమంతా విరామంలేకుండా స్కూళ్లు నడిచాయి. గతవారం వచ్చిన వరుస సెలవుల్లో ఎంజాయ్ చేసిన విద్యార్థులకు ఈవీక్ కాస్త భారంగా గడిచివుంటుంది. కానీ విద్యార్థులకు వచ్చేవారం సెలవుల గురించి తెలిస్తే ఎగిరి గంతేస్తారు. ఆగస్ట్ లో ఇప్పటివరకు 20 రోజులు పూర్తయ్యాయి... ఇందులో అత్యధికంగా సెలవులే ఉన్నాయి. అయితే ఇకపై వచ్చే పదిరోజుల్లో మరికొన్ని సెలవులు వస్తున్నాయి. ఈ నెలలో మిగిలినరోజుల్లో వచ్చే సెలవులెన్నో ఇక్కడ తెలుసుకుందాం.
KNOW
వినాయక చవితి సెలవు
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు కూడా ఈ పండగను ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు. శివపార్వతులు పుత్రుడు వినాయకుడి విగ్రహాలను గల్లీల్లో, ఇళ్లలో ప్రతిష్టించి పూజించుకుంటారు. ఇలా గణపతి పండగ నేపథ్యంలో ఆగస్ట్ 27న తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకే కాదు ఉద్యోగులకు అధికారిక సెలవు ఇచ్చారు.
ఆగస్ట్ 24, 31 సెలవే
ఆగస్ట్ 24 ఆదివారం కాబట్టి ఎలాగూ సాధారణ సెలవు ఉంటుంది. ఇక ఈ నెలలో చివరిరోజు అంటే ఆగస్ట్ 31 కూడా ఆదివారమే వస్తోంది. ఆరోజు కూడా విద్యార్థులు, ఉద్యోగులకు సాధారణ సెలవు ఉంటుంది. వినాయక చవితి, ఈ రెండు సండేలను కలుపుకుంటే ఈ పదిరోజుల్లో మూడురోజులు సెలవులే... అంటే కేవలం ఏడ్రోజులే పనిదినాలన్నమాట.
ఆగస్ట్ 23, 30న వారికి సెలవే..
హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో పనిచేసే ఐటీ ఉద్యోగులకు సాధారణంగా వారంలో రెండ్రోజులు (శని, ఆదివారం) సెలవు ఉంటుంది. కొన్ని కార్పోరేట్ సంస్థలు, కంపెనీలు కూడా ఇలాగే తమ ఉద్యోగులకు వారంలో రెండ్రోజులు సెలవులు ఇస్తుంటాయి. ఇలాంటి ఉద్యోగుల పిల్లలు ఎక్కువగా చదివే కొన్ని స్కూళ్లు కూడా శని, ఆదివారం రెండ్రోజులు సెలవు ఇస్తున్నాయి. అంటే కొందరు విద్యార్థులకు ఆగస్ట్ 23, 30న కూడా సెలవు ఉంటుంది.
మొత్తంగా చూసుకుంటే ఆగస్ట్ 24, 27, 31 తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని స్కూళ్లు, కార్యాలయాలకు సెలవు ఉంటుంది. ఇక ఆగస్ట్ 23, 30 తేదీల్లో మాత్రం కొందరు ఉద్యోగులు, విద్యార్థులకు మాత్రమే సెలవు వర్తిస్తుంది. ఇలా ఈ నెలలో మిగిలిన పదిరోజుల్లో కొందరికి మూడ్రోజులు, మరికొందరికి ఐదురోజులు సెలవులు వస్తున్నాయన్నమాట.
సెప్టెంబర్ లో తెలుగు విద్యార్థులకు సెలవులే సెలవులు
ఆగస్ట్ లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు వరుస సెలవులు వచ్చాయి... ఇవి సెప్టెంబర్ లో కూడా కొనసాగనున్నాయి. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు దసరా సెలవులను ప్రకటించాయి. సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు అంటే 13 రోజులు తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. సెప్టెంబర్ 20న బంద్ అయ్యే స్కూళ్లు అక్టోబర్ 4న తిరిగి తెరుచుకుంటాయన్నమాట. తెలంగాణలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల ఈ సెలవులు వర్తిస్తాయి.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కూడా దసరా సెలవులను ప్రకటించింది... అయితే తెలంగాణతో పోలిస్తే ఏపీలో ఈ సెలవులు కాస్త తక్కువగా ఉన్నాయి. ఏపీలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉంటాయి... అంటే 9 రోజుల పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూతపడనున్నాయి. అక్టోబర్ 3న పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. క్రిస్టియన్, మైనారిటీ స్కూళ్లకు మాత్రం ఈ దసరా సెలవులు తక్కువగా ఉంటాయి.