- Home
- Telangana
- Rain Alert: కరుణించవా వరుణ దేవా.! అనుకున్న స్థాయిలో వర్షాలు ఎందుకు పడడం లేదో తెలుసా?
Rain Alert: కరుణించవా వరుణ దేవా.! అనుకున్న స్థాయిలో వర్షాలు ఎందుకు పడడం లేదో తెలుసా?
ఈ ఏడాది మే 26 నే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించాయి. దీంతో కాలం త్వరగా వచ్చింది బాగా వర్షాలు పడుతాయని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితి మాత్రం దానికి భిన్నంగా ఉంది. ఇంతకీ ఆశించిన స్థాయిలో వర్షాలు ఎందుకు కురవడం లేదంటే..
- FB
- TW
- Linkdin
Follow Us

ఇప్పటివరకు సాధారణ స్థాయిలోనే వర్షపాతం
తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం 131.7 మిల్లీమీటర్లు. ఇది సీజన్ సాధారణ సగటు అయిన 140.7 మిల్లీమీటర్ల కంటే కొద్దిగా తక్కువ. అంటే వర్షాలు పూర్తిగా తక్కువగా కురుస్తున్నాయనేమి లేదు కానీ, అవసరమైన స్థాయిలో పెద్ద వర్షాలు మాత్రం నమోదవడం లేదు. వర్షాలు సమయానికి కురవకపోవడంతో పంటలు, సాగు పనుల్లో రైతులు జాప్యం ఎదుర్కొంటున్నారు. అందులోనూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సమానంగా వర్షపాతం నమోదు కాలేదు.
రుతుపవనాలు త్వరగా వచ్చినా
తెలంగాణలో ఈ ఏడాది మే 26 నే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ప్రారంభంలో కొన్ని చోట్ల మంచి వర్షాలు పడినా, ఆ తర్వాత వాతావరణంలో స్థిరత లేకపోవడం వల్ల వర్షాలు ఆగిపోయాయి. గాలుల వేగం అధికంగా ఉండటంతో మేఘాలు ఏర్పడకపోతున్నాయని వాతావరణ శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా వర్షాల్లో స్థిరత్వం ఉండడం లేదని అభిప్రాయపడుతున్నారు.
అల్పపీడనాల లేమి కారణంగానే..
రుతుపవనాలు బాగా చురుగ్గా ఉన్నప్పటికీ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడకపోవడం వల్ల వర్షాలు పడడం లేదని అధికారులు అంటున్నారు. అల్పపీడనాలు ఏర్పడితేనే గాలుల దిశ మారి, మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తాయని నిపుణులు తెలిపారు. అయితే జూలై మూడో లేదా నాలుగో వారంలో అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని అంచనా. దీంతో వర్షాలు మరింత విస్తృతంగా కురిసే అవకాశముందని భావిస్తున్నారు.
ఏం పర్లేదు అంటోన్న అధికారులు
అయితే ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోయినా ఈ మాన్సూన్ విఫలమైందని భావించాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు. వాతావరణ శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం, మాన్సూన్ ఇంకా చురుగ్గా ఉంది. అవసరమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడితే వర్షాలు పడతాయని అంటున్నారు.
వర్షాలు కురిసే అవకాశం
అయితే తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. తెలంగాణలో రానున్న 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ములుగు, మహబూబ్‌నగర్, హైదరాబాద్ సహా మొత్తం 24 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని తెలిపింది. అలాగే గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం కూడా ఉందని తెలిపింది.
ఈరోజు (ఆదివారం) వాతావరణం ఎలా ఉంటుంది?
ఆదివారం (జూలై 13) రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. రోజంతా ఆకాశం మేఘావృతంగా ఉంటుంది. అయితే కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.