తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే సమాచారం.. నవంబర్ ఫస్ట్ వీక్ లో నాల్రోజులు సెలవులే..!
School Holidays : తెలుగు విద్యార్థులకు వచ్చే నెల నవంబర్ ఆరంభంలోనే వరుస సెలవులు వస్తున్నాయి. ఉద్యోగులకు కూడా సెలవులున్నాయి. మొదటి పదిరోజుల్లో నాల్రోజులు సెలవులే…

నవంబర్ లో సెలవులే సెలవులు
November Holidays : దసరా, దీపావళి పండగలతో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెలుగు విద్యార్థులకు అక్టోబర్ లో భారీగా సెలవులు వచ్చాయి. ఈ నెల ముగింపుకు చేరుకుంది... ఇక నవంబర్ 2025 లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ క్రమంలో సహజంగానే సెలవులంటే ఇష్టపడే విద్యార్థులు వచ్చేనెలలో కూడా ఎన్నిరోజులు సెలవులు వస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగులు కూడా నవంబర్ సెలవుల సమాచారం కోసం హాలిడేస్ జాబితాను పరిశీలిస్తున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే అక్టోబర్ మాదిరిగానే నవంబర్ లో కూడా ఫస్ట్ వీక్ లో వరుస సెలవులు వస్తున్నాయి... ఏరోజు ఎందుకు సెలవుందో ఇక్కడ తెలుసుకుందాం.
నవంబర్ ఫస్ట్ వీక్ లోనే నాల్రోజులు సెలవులు..
విద్యార్ధులు, ఉద్యోగులకు ఎగిరిగంతేసే సమాచారమిది. వచ్చే నెల (నవంబర్) ఆరంభంలోనే వరుస సెలవులు వస్తున్నాయి... ఫస్ట్ వీక్ లో మొత్తం నాలుగు రోజులు విద్యాసంస్థలు, ఆఫీసులు మూతపడనున్నాయి. ఇలా నవంబర్ ప్రారంభమవుతుందో లేదో అలా ఆదివారం (నవంబర్ 2) వస్తోంది... సాధారణంగా ఈ రోజు అందరికీ సెలవే.
ఆదివారం సెలవు ముగిసి ఓ రెండ్రోజులు స్కూళ్లు నడుస్తాయో లేదో మళ్లీ బుధవారం (నవంబర్ 5న) మరో సెలవు వస్తోంది. ప్రస్తుతం కార్తీకమాసం కొనసాగుతోంది… ఈ సందర్భంగా దేవాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఈ నెలను హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు… అందులోనూ ఈ నెలలో వచ్చే పౌర్ణమి మరింత ప్రత్యేకమైనది. అందుకే ఈరోజు విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. ఇలా వచ్చే బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా మెజారిటీ విద్యార్థులకు సెలవు ఉండే అవకాశాలున్నాయి.
ఇలా కార్తీక పౌర్ణమి సెలవు ముగియగానే గురు, శుక్రవారం (నవంబర్ 6,7) స్కూళ్ళు నడుస్తాయో లేదో రెండు శనివారం వచ్చేస్తుంది… ఈ రోజు సెలవే. తర్వాత ఎలాగూ ఆదివారమే. ఇలా వీకెండ్ రెండ్రోజులు విద్యాసంస్థలకు వరుస సెలవులు వస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే నవంబర్ మొదటి పదిరోజుల్లో స్కూళ్లు నడిచేది ఆరురోజులే... మిగతా నాల్రోజులు (నవంబర్ 2, 5, 8, 9) సెలవులే.
తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు కార్తీక పౌర్ణమి సెలవు
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని తెలుగు రాష్ట్రాల్లో పండగలా జరుపుకుంటారు. అందుకే కార్తీక పౌర్ణమి రోజు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు ఉద్యోగులకు ఐచ్చిక సెలవులు ప్రకటించాయి. అంటే ఆరోజు అవసరం అనుకుంటే ఉద్యోగులు వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు మహిళా ఉద్యోగులు ఎక్కువగా సెలవు తీసుకునే అవకాశాలుంటాయి.
గురునానక్ జయంతికి ఐచ్చిక సెలవు
కార్తీక పౌర్ణమి రోజే అంటే నవంబర్ 5న గురునానక్ జయంతి కూడా ఉంది. సిక్కు మతగురువుల్లో గురునానక్ ఒకరు... ఈయనే ఈ మతాన్ని స్థాపించారు. కాబట్టి ఈరోజును సిక్కులు కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకే ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని కూడా నవంబర్ 5 ఐచ్చిక సెలవు ఇస్తున్నాయి తెలుగు ప్రభుత్వాలు. హైదరాబాద్ లో గురునానక్ జయంతి సిక్కులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
విద్యాసంస్థల యాజమాన్యల సమ్మె
అధికారిక సెలవులతో పాటు నవంబర్ లో అనధికారిక సెలవులు కూడా విద్యాసంస్థలకు వచ్చే అవకాశాలున్నాయి. మరీముఖ్యంగా డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కళాశాలలు ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిల కోసం ఉద్యమానికి సిద్దమయ్యాయి. నవంబర్ 1 లోపు తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని... లేదంటే నవంబర్ 3 నుండి నిరవధికంగా విద్యాసంస్థల బంద్ చేపడతామని ''ది ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్'' ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది. కాబట్టి ఉన్నత విద్యాసంస్థలకు నవంబర్ లో వరుస సెలవులు వచ్చే అవకాశాలున్నాయి.