Mutton : కిలో చికెన్ ధరకే కిలో మటన్.. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే..!
Hyderabad : హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో అతి తక్కువ ధరకే మటన్ లభిస్తుంది. ప్రస్తుతం చికెన్ ధరలు పెరిగిన నేపథ్యంలో చికెన్, మటన్ సేమ్ రేట్ కు వస్తున్నాయి. కిలో మటన్ ధర ఎంతుందో తెలుసా?

ఇక్కడ మటన్ యమ చీప్ గురూ..
Mutton : ప్రస్తుతం కూరగాయల ధరలు పెరిగాయి... టమాటా రూ.50కి చేరింది... మిర్చీ, చిక్కుడు, బెండకాయ ఏదీ తక్కువ లేదు. ఇంతింత ఖర్చుచేసి కూరగాయలేం కొందాం... రుచిగా చికెన్ వండుకుని తిందామనుకుంటున్నారా..? ఆ అవకాశమూ లేదు. నిన్నమొన్నటివరకు రూ.200-250 కి కిలో చికెన్ వచ్చేది... ఇప్పుడు అదికూడా రూ.300 దాటింది. బోన్ లెన్ చికెన్ అయితే కిలో రూ.400 క్రాస్ అయ్యింది. నాటుకోడి కిలో రూ.450 నుండి రూ.550 ఉంది.
ఇలా చికెన్ ధరలు పెరగడంతో సామాన్యులు ముక్క కొరకాలంటే ముందూ వెనక ఆలోచించాల్సి వస్తోంది. అయితే ముక్కలకు అలవాటపడ్డ నాలుక పప్పు తినలేదు... కాబట్టి మాంసాహారం కోసం తహతహలాడుతుంది. హైదరాబాద్ లో ఉండే ఇలాంటి మాంసాహారప్రియుల కోసమే ఈ సమాచారం. అతి తక్కువ ధరకు చికెన్, మటన్ దొరికే ప్రాంతాలుకొన్ని నగరంలో ఉన్నాయి. అలాంటి ప్రాంతాలగురించి ఇక్కడ తెలుసుకుందాం.
తక్కువధరకే చికెన్, మటన్ దొరికే ప్రాంతమిదే...
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా మటన్ ధర రూ.800-900 మధ్య ఉంటుంది. పల్లె ప్రాంతాల్లో కంటే పట్టణాల్లోనే మటన్ ధర ఎక్కువ... అలాంటిది హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో మటన్ అతి తక్కువ ధర లభిస్తుంది. ఇలాంటి ప్రాంతమే అంబర్ పేట సమీపంలో గోల్నాక.
గోల్నాకలో మేకల, గొర్రెల మార్కెట్ జరుగుతుంది. వివిధ ప్రాంతాలనుండి ఇక్కడ మేకలు కొనేందుకు వస్తుంటారు. అయితే గోల్నాకలో జీవించివున్న మేకలు, గొర్రెలే కాదు వాటి మాంసం కూడా దొరుకుతుంది. గోల్నాక కబేలాలో లభించే మటన్ మంచి నాణ్యతతో ఉండటమే కాదు అతి తక్కువ ధరకు లభిస్తుంది. మార్కెట్ లో రూ.800-900 ధర పలికే మటను ఇక్కడ కేవలం రూ.500-550 కే కిలో లభిస్తుంది. బోటీ, తలకాయ కూర అయితే మరింత తక్కువ ధరకే లభిస్తుంది.
కేవలం మటన్ మాత్రమే కాదు చికెన్ కూడా గోల్నాకలో తక్కువ ధరకే లభిస్తుంది. మార్కెట్ ధరకంటే తక్కువకే ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందని అక్కడి వ్యాపారులను అడిగితే తక్కువ లాభం చూసుకుని ఎక్కువమొత్తంలో మాంసం అమ్మడంవల్ల తమకు గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు. ధర తక్కువ అని క్వాలిటీలో ఏమాత్రం తేడా ఉండదని గోల్నాక మండీలోని మాంసం వ్యాపారులు చెబుతున్నారు.
చికెన్ ధరకే మటన్..
ప్రస్తుతం మార్కెట్ లో చికెన్ ధర రూ.300 దాటింది... ఇది ఇంకా పెరిగే అవకాశాలున్నాయట. బోన్ లెన్ చికెన్ రూ.400 దాటింది... అలాంటిది గోల్నాక మార్కెట్ లో కిలో మటన్ రూ.500 పలుకుతోంది. అంటే ఇంచుమించు చికెన్, మటన్ ధర ఒకేలా ఉన్నాయి. అందుకే గోల్నాక చుట్టుపక్కల ప్రజలు ఇక్కడే అతి తక్కువ ధరకు మటన్, బోటీ, తలకాయ కొనుక్కుని ఇష్టంగా తింటుంటారు.
ఇక్కడయితే కేవలం రూ.400కే కిలో మటన్..
హైదరాబాద్ శివారులోని మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలంలోని చెంగిచెర్ల గ్రామంలో కూడా తక్కువ ధరకే మటన్ లభిస్తుంది. ఇక్కడ మేకల మండి ఉంది... నిత్యం వందలాది మేకలను వధించి మాంసం విక్రయిస్తుంటారు. ఈ మార్కెట్ లో మటన్ హోల్ సేల్ ధరకు విక్రయిస్తుంటారు వ్యాపారులు.
చెంగిచెర్ల మండిలో కిలో మేకమాంసం కేవలం రూ.400 నుండి 500 లోపే లభిస్తుంది. అంటే నగరంలో అరకిలో మటన్ ధరకే ఇక్కడ కిలో మటన్ వస్తుందన్నమాట. ఇక్కడ మేకలు కూడా తక్కువ ధరకు లభిస్తాయి... ఏదయినా పంక్షన్ కోసం మటన్ కావాలంటే ఇలా మేకను కొని అక్కడే కటింగ్ చేయించుకోవచ్చు. ఇలాగయితే కిలో మటన్ ఇంకా తక్కువ ధర పడుతుంది. మటన్ తో పాటు మేక లివర్, బోటి కూడా తక్కువ ధరకే లభిస్తుంది
చికెన్ ధరలు పెరగడానికి కారణాలివే...
ప్రస్తుతం హైదరాబాద్ లోనే కాదు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ చికెన్ ధరలు ట్రిపుల్ సెంచరీకి చేరాయి. రాబోయే రోజుల్లో సంక్రాంతి, రంజాన్ పండగలు ఉన్నాయి... కాబట్టి చికెన్ కు మరింత డిమాండ్ పెరిగి ధరలు కూడా మరింత పెరిగే అవకాశాలున్నాయి.
సాధారణంగా చలికాలంలో అతి తక్కువగా నమోదయ్యే ఉష్ణోగ్రతలను బ్రాయిలర్ కోళ్లు తట్టుకోలేవు... అందుకే ఈకాలంలో చికెన్ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. అయితే ఇదే శీతాకాలం చలి పీక్స్ లో ఉన్న సమయంలో క్రిస్మస్, న్యూఇయర్ పండగలు వచ్చాయి... సంక్రాంతి, రంజాన్ పండగలు రాబోతున్నాయి. ఇలా వరుస పండగలతో చికెన్ కు డిమాండ్ పెరిగింది... అందుకే ధరలు అమాంతం పెరిగాయి. ఈ ధరలే మరికొన్నిరోజులు కంటిన్యూ కానున్నాయి.

