- Home
- Telangana
- Hyderabad: ఇరాన్‌లో యుద్ధం... హైదరాబాద్‌లో పూరీ, దోసెలు బంద్ చేస్తున్న హోటళ్లు. అసలేంటీ లాజిక్
Hyderabad: ఇరాన్‌లో యుద్ధం... హైదరాబాద్‌లో పూరీ, దోసెలు బంద్ చేస్తున్న హోటళ్లు. అసలేంటీ లాజిక్
Hyderabad: ఇరాన్ ప్రాంతంలో ఉధృతమైన యుద్ధ పరిస్థితులు ప్రపంచ వ్యాపార రంగంపై ప్రభావం చూపుతున్నాయి. ఆ ప్రభావం భారత్ నగరాలకూ చేరింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. దీంతో ఇది టిఫిన్స్‌పై ప్రభావం చూపుతోంది.

గ్యాస్ కొరతతో హోటళ్లకు ఇబ్బందులు
రాష్ట్రంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో అనేక హోటళ్ల పరిస్థితి క్లిష్టంగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా చిన్న పెద్ద హోటళ్లను తెరవడం లేదు. ఇంకా కొందరు హోటల్ నిర్వాహకులు మెనూను గణనీయంగా తగ్గించారు. ఐటీ కారిడార్ ప్రాంతాల్లోని హోటళ్ల అసోసియేషన్ టీ, కాఫీ వంటి వాటిని కొన్ని రోజులు ఇవ్వలేమని ప్రకటించింది. ఎక్కువ సమయం పట్టే వంటకాలు అయిన దోసె, పూరీ, చపాతి వంటి వాటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.
టిఫిన్ ఐటమ్స్ తగ్గింపు
హోటళ్లలో వంటకు ఎక్కువగా గ్యాస్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న సిలిండర్లు ఒక్కటి లేదా రెండు రోజులకే సరిపోతాయని నిర్వాహకులు చెబుతున్నారు. పరిస్థితి మారకపోతే హోటళ్లను పూర్తిగా మూసివేయాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్‌కు బదులుగా కట్టెల పొయ్యి లేదా ఎలక్ట్రిక్ ఇండక్షన్ వంట పరికరాలు ఏర్పాటు చేయడం కూడా తక్షణం సాధ్యంకాదని హోటల్ యజమానులు చెబుతున్నారు. అందువల్ల చాలా చోట్ల కేవలం తక్కువ గ్యాస్‌తో తయారయ్యే వంటకాలు మాత్రమే అందిస్తున్నారు.
హాస్టళ్లు, మెస్‌లపై ప్రభావం
హైదరాబాద్‌లోని పీజీ హాస్టళ్లు, స్టూడెంట్ మెస్‌లు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. వంటకు దాదాపు 90 శాతం వరకు గ్యాస్ వినియోగమే ఉండడంతో ఇప్పుడు అక్కడ కూడా మెనూలో మార్పులు చేశారు. ఇప్పటికే ఎక్కువ సమయం తీసుకునే వంటకాలు తగ్గించి అన్నం, సాంబారు, పప్పు, రసం వంటి సింపుల్ భోజనాలకే పరిమితం అయ్యారు. మరో రెండు లేదా మూడు రోజుల్లో పరిస్థితి మారకపోతే హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేయాల్సి వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.
ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్ వంటి ప్రాంతాల్లో వందల సంఖ్యలో హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో నివసించే విద్యార్థులు, ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకుంటున్న యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
టిఫిన్స్ ధరల పెరుగుదల
గ్యాస్ కొరతతో పాటు రవాణా ఖర్చులు కూడా పెరగడం హోటళ్లపై అదనపు భారం పెంచింది. దీనివల్ల టిఫిన్ ఐటమ్స్ ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. టిఫిన్స్‌పై సుమారు 10 శాతం వరకు ధరలు పెరిగాయి. దోసె, పూరీ, వడ వంటి వంటకాల ధరలు కనీసం రూ.15 వరకు పెరిగాయి. ఇడ్లీ, ఉప్మా వంటి వాటిపై రూ.10 వరకు పెంపు కనిపిస్తోంది. పెద్ద రెస్టారెంట్లలో అయితే 15 శాతం వరకు ధరలు పెంచినట్లు తెలుస్తోంది.
కొబ్బరి మార్కెట్‌పై కూడా ప్రభావం
మధ్యప్రాచ్య దేశాల్లో ఉద్రిక్తతలు పెరగడం మరో రంగంపై కూడా ప్రభావం చూపింది. ముఖ్యంగా కొబ్బరి ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు కొబ్బరి సాగులో ముందంజలో ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు భారీగా ఎగుమతులు జరుగుతాయి. ప్రస్తుతం రంజాన్ నెల కావడంతో డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది.
కువైట్, ఒమన్, దుబాయ్, ఇరాన్, సౌదీ అరేబియా దేశాలకు పంపేందుకు సిద్ధం చేసిన కాయలు ఇప్పుడు ముంబయి, చెన్నై, తూత్తుకూడి పోర్టుల వద్దే నిలిచిపోయాయి. యుద్ధ పరిస్థితి ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేకపోవడంతో వ్యాపారులు అయోమయంలో ఉన్నారు.
కొబ్బరి ధరల్లో భారీ పతనం
ఇటీవల శివరాత్రి సందర్భంగా కోనసీమ కొబ్బరి మార్కెట్‌లో ధరలు మంచి స్థాయిలో ఉన్నాయి. వెయ్యి పచ్చి కాయలు రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు విక్రయమయ్యాయి. శ్రీరామనవమి సమయానికి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ వస్తుందని వ్యాపారులు ఆశించారు. కానీ ఎగుమతులు నిలిచిపోవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
పోర్టుల్లో నిలిచిపోయిన సరుకు స్థానిక మార్కెట్‌లోనే తక్కువ ధరకు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం వెయ్యి కాయల ధర రూ.13 వేల నుంచి రూ.14 వేల మధ్యకు పడిపోయిందని వాపోతున్నారు.

